అనగనగా ఒక పేను ఉండేది. దానికి ఒక పెసర చేను ఉండేది. రోజూ అది దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, పెసర చేనుకు కాపలా కాసేది. విరగకాసిన చేనును చూసుకుంటూ ఆనందంగా పాటలు పాడుకునేది.
ఒకసారి ఆ ఊరి రాజు అటుగా వచ్చాడు. అతను, అతని సైన్యమూ పెసర చేనును చిత్తడి చిత్తడిగా తొక్కేశారు. తన చేను నాశనం అవ్వటం చూసి పేను చాలా ఏడ్చింది. రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నది.
మిగిలిన పెసర కాయల్ని కోసి, రుబ్బి, అది చాలా రుచికరమైన పెసరట్లు వేసింది. ఆ పెసరట్లు మూట గట్టుకొని రాజు దగ్గరికి బయలుదేరింది.
అన్నేసి పెసరట్లు కమ్మగా 'ఘుమ ఘుమలాడుతుంటే, ఆ వాసనకు నోరూరిన సింహం ఒకటి పేను దగ్గరకు వచ్చి "నేను కూడా నీతోటి వస్తాను. నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాను- పెసరట్లు నాకు కొన్ని పెట్టవా!" అని అడిగింది. "సరే" అని పేను దానికి పెసరట్లు పెట్టింది.
ఆ తరువాత అవి రెండూ కలిసి పోతూ ఉంటే, ఈసారి వాటికొక పాము ఎదురైంది. పెసరట్ల వాసన దానికి కూడా చాలా నచ్చి, అది కూడా సింహం అడిగినట్లే అడిగింది. "సరే" అని పేను పాముకు కూడా పెసరట్లు పెట్టింది.
అప్పుడింక ఆ మూడూ కలిసి పోతావుంటే ఈసారి వాటికొక తేలు ఎదురైంది: "నేను కూడా నీకు సాయం చేస్తాను. నాకు పెసరట్లు పెట్టవా ప్లీజ్" అని అడిగింది అది కూడా. పేను దానికి కూడా పెసరట్లు పెట్టింది.
నాలుగూ కలిసి ముందుకు పోతుంటే వాటికొక సీతాకోక చిలుక ఒకటి ఎదురైంది. అది కూడా అన్నీ అడిగిన మాదిరే అడిగింది. పేను దానికి కూడా పెసరట్లు పెట్టి, తమవెంట పిలుచుకు పోయింది.
అట్లా అన్నీ కలసి రాజుగారి భవనం చేరుకున్నాయి. అక్కడ కాపలా ఉండే వాళ్లంతా సింహాన్ని చూసి పారిపోయారు. దాంతో అవన్నీ నేరుగా రాజు పడుకునే గది దగ్గరికి పోయాయి.
సీతాకోక చిలుక లోపలికి ఎవ్వరూ రాకుండా కాపలా కాయసాగింది. పాము చప్పుడు కాకుండా ఆ గది తలుపు తీసి, గడియకు చుట్టుకున్నది. లోపల రాజు గురక పెట్టి నిద్రపోతున్నాడు. ప్రక్కనే దీపం వెలుగుతున్నది. సింహం మెల్లగా పోయి దీపం ప్రక్కన నిలబడింది. రాజు ప్రక్కనే ఉన్న గూట్లోకి చేరుకున్నది తేలు. పేను మెల్లగా రాజుగారి గడ్డంలోకి దూరి ఇష్టం వచ్చినట్లు కొరకటం మొదలు పెట్టింది.
హాయిగా నిద్రపోతున్న రాజుకు నిద్రాభంగం అయింది. ఎంత గోక్కున్నా దురద పోలేదు. చివరికి చికాకుగా లేచి కూర్చున్నాడు. అయినా పేను తన దారిన తాను కొరుకుతూనే పోయింది.
"దువ్వుకుంటే సరిపోతుంది" అని దువ్వెన కోసం గూట్లో చెయ్యి పెట్టాడు రాజు. అక్కడే కూర్చున్న తేలు చటుక్కున కుట్టింది. "అబ్బా!" అని అరుస్తూ రాజు వేలిపైన గాటును చూసుకుందామని దీపం దగ్గరకు పరుగెత్తాడు. దీపం ప్రక్కనే కూర్చున్న సింహం గాండ్రించింది. రాజు గాభరాగా గదిలోంచి బయటికి పారి పోదామని తలుపు దగ్గరికి పరుగెత్తబోయాడు. గడియకు చుట్టుకున్న పాము బుస్సుమన్నది. ఇంక ఏం చేయాలో తెలీని రాజు చెమటలు క్రక్కుకుంటూ నిలబడి పోయాడు.
ఆలోగా సీతాకోక చిలుక మీదికి ఎక్కి కూర్చున్న పేను కోపంగా లేచి నిలబడింది: "ఏమి రాజా?! ఒక్క పూట నిద్ర చెడితేనే అంత బాధ పడుతున్నావు; మరి నా చేను మీదినుండి సైన్యాన్ని పంపినప్పుడు నాకెంత బాధ వెయ్యాలి? చిన్న ప్రాణులంటే నీకు అంత అలుసా?" అని అడిగింది గట్టిగా.
రాజు ముందు బిత్తరపోయాడు. అటుపైన పేనుకు క్షమాపణ చెప్పుకున్నాడు. "ఇకపైన ఎప్పుడూ చిన్న ప్రాణులను హింసించను" అని వాటికి మాట ఇచ్చాడు.
సంతోషపడ్డ పేను తన సైన్యంతో సహా వెనుదిరిగి ఇంటికి పోయింది.