కృష్ణవర్మ మహారాజుకు ముగ్గురు మగ పిల్లలు. ముగ్గురూ ముగ్గురే, మహా సోమరులు. పిల్లలు అట్లా ఉంటే ఏ తల్లిదండ్రులకు మనసున పడుతుంది? వాళ్లని ప్రయోజకుల్ని చేయాలి, విద్యాబుద్ధులు నేర్పాలి అని రాజుగారికి గట్టి కోరిక కలిగింది.

'మా పిల్లల్ని తట్టుకోగల సమర్థులైన గురువులు ఎవరున్నారు?' అని బాగా వెతికారు కృష్ణవర్మ గారు. ఏ గురువుల్ని చూసినా 'వీళ్ళు కురరరు' అనే అనిపించింది. చివరికి ఎవరో చెబితే సువర్ణముఖీ నదికి ఆవలి ఒడ్డున 'ప్రజ్ఞ ఆశ్రమాన్ని' నడిపే మిత్రవిందులవారి దగ్గరికి వెళ్ళారు.

కొండల నడుమన, పచ్చటి చెట్ల మధ్య, అత్యంత ప్రశాంతంగా వున్న ఆశ్రమంలో గురువులకు, శిష్యులకు కావల్సిన వసతులు అన్నీ ఉన్నాయి. మిత్రవిందులవారు రాజుకు బాగా నచ్చారు. బలంగా, చురుకుగా, జ్ఞానం-సాధన ఉట్టిపడుతూ ఉన్నారాయన.

"మా పిల్లలకు విద్య నేర్పమని అర్థించేందుకు వచ్చాను. మీరు రాజధానికి విచ్చేసి, కనీసం ఓ పదేళ్లపాటు మా పిల్లలకు పాఠాలు చెప్పాలి" అన్నాడు రాజు ఆయనతో.

మిత్రవిందులవారు నవ్వారు. "కాదు అంటున్నందుకు క్షమించాలి మహారాజా! మేం ఈ ప్రాంతాన్ని వదిలి వచ్చే వీలు లేదు. మా పద్ధతులకు నగరాలు సరిపడవు. అయినా అసలు అంత శ్రమ ఎందుకు పడతారు? మీ పిల్లల్ని ముగ్గుర్నీ నిశ్చింతగా మావద్ద వదిలి వెళ్ళండి. వాళ్ళు కూడా మా ఇతర, సామాన్య కుటుంబాలనుండి వచ్చిన శిష్యులతో బాటు విద్యలు నేర్చుకుంటారు. అలా వారికి లోకాచారం కూడా తెలుస్తుంది!" అన్నారు.

"కానీ ఇక్కడ.., రాకుమారులు ఉండేందుకు వసతి..-" నీళ్ళు నమిలారు రాజుగారు.

"ఇక్కడ వారు రాకుమారులు కాదు మహారాజా! విద్యార్థులు. గురుకులంలో విద్యార్థులందరూ ఒక్కటిగా నివసిస్తారు. కావాలంటే, వాళ్ళు అలవాటు పడే వరకూ మీరు నదికి అటు ఒడ్డునే ఉన్న దేవరకొండలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకోవచ్చు. నేను ఇది వారి మేలు కోరే చెబుతున్నాను- అన్యథా భావించకండి" గట్టిగా చెప్పేసారు మిత్రవిందులు.

చివరికి కృష్ణవర్మకు 'సరే' ననక తప్పలేదు. 'ముద్దుముద్దుగా పెంచిన రాకుమారులను కష్టపడమంటున్నాడే' అని బాధ కూడా కలిగింది.

అంతలోనే మిత్రవిందుడు "విద్య వంట బట్టాలంటే ముందు శరీరం చురుకుగా ఉండాలి. శరీరం చురుకుగా వుండాలంటే యోగాసనాలు, ప్రాణాయామాలు, వ్యాయా-మాలు నిత్యం చెయాల్సిందే. రాకుమా-రులను రేపటినుండీ ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేవాలని చెప్పండి" అన్నాడు.

"అప్పుడేనా? ముందు ఒకటి రెండు రోజులు.." అని దాట వేయబోయిన రాజుగారికి "యోగ: చిత్త వృత్తి నిరోధ: అని తెలిసిందే కదా!" అని హితవు చెప్పేసి పంపేసాడు కూడా.

మొదట కొంత సంకోచించినా, తర్వాత రాజుగారు వెంటనే తేరుకొని, కుమారుల నివాసానికి ఏర్పాట్లు చేయించాడు. వాళ్ళు దేవరకొండలో సకల సౌకర్యాల నడుమన ఉంటారు; రోజూ ఉదయం రథంలో నది ఒడ్డుకు చేరుకుని, అక్కడ వారికై ప్రత్యేకించిన పడవలో ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకల్లా ఆశ్రమానికి చేరుకునేట్లు రథ సారథులను, కళాసీలను నియమించాడు.

ఆరు నెలలు గడిచాయి. పుత్ర రత్నాలు ఎలా వున్నారోనని రాజు-రాణిలకు బెంగ వేసింది. రాజు గారు బయలుదేరి దేవరకొండ వెళ్లారు. రథ సారథి గుర్రాలకు నీళ్ళు పెడుతున్నాడు. "అయ్యగార్లు ముగ్గురూ ఆశ్రమానికి వెళ్ళారండి" అన్నాడతను.

"మరి నువ్వు ఇక్కడెందుకున్నావు? వాళ్లతో వెళ్ళలేదేమి?" అని కోపంగా అరిచాడు రాజు. "మరండి.. బాబుగార్లండి.." అంటాడు గానీ సారథి నోరు తెరిచి ఏమీ చెప్పలేకపోయాడు.

రాజుగారు గబగబా గుర్రాన్నెక్కి, నది ఒడ్డుకు చేరుకున్నారు- "ఈ నదిని ఎట్లా దాటాలో ఈ సమయంలో" అనుకుంటూ.

తీరా వెళ్ళేసరికి రాకుమారులకోసం‌ ఉద్దేశించిన పడవ ఈ ఒడ్డునే ఉంది- "రాకుమారులేరి?" అడిగాడు రాజు.

"ఆశ్రమానికి వెళ్ళారండి" అన్నాడు నావికుడు, పడవని బయలుదేరదీస్తూ.

"నువ్వు వాళ్లని దిగవిడిచి అక్కడే ఉండాలి కదా, ఇటువైపు ఎందుకు వచ్చావు?" అడిగాడు రాజు కోపంగా.

"మొదట్లో ఒక్క వారం రోజులు పడవలో దిగవిడిచి వచ్చాను అంతే ప్రభూ తర్వాత ఏవైనా నౌకా విహారాలకు తప్పిస్తే అయ్యగార్లు నా నావని ఎక్కటమే లేదండయ్యా" విన్నవించుకున్నాడు కళాసీ.

రాజుగారి హృదయంలో తుఫాను రేగింది. గబగబా మిత్రవిందుల వారి ఆశ్రమానికి చేరుకున్నారు. ధ్యానంలో ఉన్న మిత్రవిందుడు ఆయన్ని చూసి లేచి వచ్చి "రాకుమారులు ముగ్గురూ బాగున్నారు ప్రభూ. విద్యలు చక్కగా నేరుస్తున్నారు. రండి" అని లోనికి పిలుచుకు వెళ్ళారు. లోపల మిగిలిన పిల్లలతో పాటు చక్కగా సాధన చేస్తున్న రాకుమారుల్ని చూసి రాజుగారి మనసు కుదుటపడ్డది.

పనిలో ఉన్న రాజకుమారులు మధ్యాహ్నం భోజన సమయంలో వచ్చి, తండ్రిని పలకరించారు, ఆయన్నికూడా పిల్చుకొని వెళ్ళి తమ తోటి విద్యార్థులను అందరినీ పరిచయం చేసారు; అందరితో పాటు భోజనం పెట్టించారు. వారిలో ఇప్పుడు ఆర్నెల్ల క్రితం‌ ఉన్న సోమరితనం, బద్ధకాల చాయలు కూడా లేవు!

గుమ్మడికాయల లెక్కన వుండే రాకుమారులు ఆర్నెల్లలో సొరకాయల లెక్కన సన్నబడటం చూసి రాజుగారు సంతోషపడినారు. వారిలో వచ్చిన మార్పుని చూసి రాజుగారికి ఆశ్చర్యం వేసింది- 'పూచికపుల్ల సైతం ప్రక్కకి తీసి పెట్టని రాకుమారులు ఇంత చలాకీగా ఎలా తయారైనారు?' అని.

"రాకుమారులు ముగ్గురూ చాలా మంచి పిల్లలు మహారాజా!‌ రథాన్ని, నౌకల్ని ఎప్పుడో తప్ప, అసలు వాడనే వాడరు. ప్రతిరోజూ ఉదయం నది ఒడ్డు వరకూ పరుగెత్తి వస్తారు; అటుపైన నది ఈవలి ఒడ్డు వరకూ‌ ఈదుతారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా అంతే.

ఉదయం నుండి యోగాలోను, శాస్త్రపఠనంలోను, క్రీడాభ్యాసంలోను, యుద్ధ-క్రీడల్లోను పాల్గొంటారు. వీటన్నింటి వల్లా వాళ్ళ శరీరం బలంగా తయారైంది. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది" వివరించారు మిత్రవిందులు.

"అయినా, అంత దూరం నదిలో‌ ఈదుతారా, మా పిల్లలు?!" ఆశ్చర్యం ప్రకటించారు రాజుగారు.

"రాజా! సరైన కృషి ద్వారా మన శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకున్నప్పుడు, చుట్టూ ఉన్న ప్రాణశక్తి మనలోకి ప్రవహించ-గల్గుతుంది. చాలా పని చేయగల్గుతాం. ఈ ఆరు నెలల్లోను రాకుమారులు తమలోని ప్రాణశక్తిని గుర్తించారు. ఉత్సాహంగా శ్రద్ధ చూపుతున్నారు. వారికి ముగ్గురికీ మంచి భవిష్యత్తు వుండగలదు" అని ఆశీర్వదించారు మిత్రవిందులు.