అనగనగా ఒక ఊళ్లో రామయ్య-సోమయ్య అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవాళ్ళు. ఇద్దరూ తమ ప్రాంతంలో పండిన ధాన్యాలను కొనుగోలు చేసి, దూర ప్రాంతాల్లో మంచి ధరకు అమ్మేవాళ్ళు. ఇట్లాంటి వ్యాపారాలు ఒంటరిగా చేయటం కష్టం అన్న ఉద్దేశంతో, ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చేసి, లాభాల్ని సమానంగా పంచుకుంటూ ఉండేవాళ్ళు.

ఒక సంవత్సరం అలా అన్నీ సిద్ధం చేసుకున్నాక, అకస్మాత్తుగా రామయ్య ఆరోగ్యం పాడైంది. "నేను కదిలే పరిస్థితి లేదు సోమయ్యా! ఈసారికి నువ్వు ఒక్కడివే వెళ్ళిరా! నా వంతు ధాన్యం నేను ఇక్కడే ఎక్కడైనా అమ్ముకుంటాను" అన్నాడతను. అయితే సోమయ్య ఒప్పుకోలేదు. "దానిదేముంది, నీ వంతు కూడా నేనే తీసుకెళ్ళి అమ్ముకొస్తాను!" అన్నాడు.

'సరే- అదే మేలు' అని మిత్రుడికే తన వంతు ధాన్యం కూడా అప్పగించి పంపాడు రామయ్య.

ఆ సంవత్సరం సోమయ్యకు వ్యాపారం అద్భుతంగా జరిగింది. చాలా డబ్బు చేతికొచ్చింది. అంత డబ్బును కళ్ళ చూసేసరికి సోమయ్యకు ఎక్కడా లేనంత ఆశ పుట్టింది. ఆ డబ్బులో సగం రామయ్యకు యివ్వడానికి అతని మనసు అస్సలు ఒప్పలేదు.

దాంతో అతను తను సంపాదించుకొచ్చిన డబ్బులో అధికశాతాన్ని సముద్రం ఒడ్డునే ఇసుకలో దాచి, ఊరికే కొంత సొమ్మును మాత్రం తీసుకువచ్చి, దొంగ ఏడుపులు ఏడుస్తూ "రామయ్యా! ఏం చెప్పేది?! ఒక్కడినే రావటం చూసుకొని ఆ దేశపు ప్రజలు నన్ను పూర్తిగా మోసం చేసారు. అసలు నీ ధాన్యాన్నయితే వాళ్ళు పూర్తిగా దొంగిలించుకొనే పోయారు. మిగితాది మటుకు నేను కాపాడుకున్నాను. అయినా దాన్ని అమ్ముదామంటే కూడా సరైన రేటు రాలేదు. చివరికి చూసుకుంటే మొత్తంగా వచ్చిన డబ్బు ఇదిగో, ఈ పది వేల రూపాయలు! నీ ఆరోగ్యం బాలేనందుకు గాను ఎంత నష్టపోయామో చూడు" అంటూ తన చేతిలో మూట చూపించాడు.

"పోనీలే సోమయ్యా! ఏం చేస్తాం?! నా రాత ఇట్లా ఉంది!" అన్నాడు రామయ్య.

"కాదు కాదు- ఎంత వచ్చినా నీ వాటా నీది కాకుండా పోతుందా? ఇందులో సగం నీది. అమ్మి పెట్టిన ఖర్చులకు నువ్వు ఏమీ ఇవ్వనక్కర్లేదులే" అంటూ ఐదువేల రూపాయలు రామయ్య చేతిలో‌ పెట్టి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సోమయ్య.

రామయ్యకు అతని మోసం అర్థమైంది. కానీ తను ఏం చేయగలడు? "నా ఆరోగ్య సమస్య వల్లనే ఇట్లా జరిగింది" అనుకొని చప్పుడు చేయకుండా ఊరుకున్నాడు.

కానీ మాట దాగదు గదా, 'రామయ్యకు-సోమయ్యకు పాపం, వ్యాపారం బాగా సాగలేద'ని, 'పొరుగుదేశాల్లో రేట్లు బాగా రాలేద'ని అందరూ చెప్పుకున్నారు.

అయితే అంత డబ్బు వచ్చిన ఆనందం త్వరలోనే సోమయ్యను ముంచెత్తింది. అతను ఇప్పుడు బాగా ఖర్చు పెట్టి ఇల్లు పెద్దది చేయించుకోవటమే కాకుండా, తన భార్యకు, కుమారుడికి బంగారం కూడా చేయించాడు.

అది చూసిన వాళ్ళంతా "నష్టం వచ్చిందన్నారు, మరి ఇదేంటి?" అని గుసగుసలు పోయారు. కొందరు చొరవ చేసి రామయ్యతో ఆ మాట అన్నారు కూడా. "ఈసారి నేను పోలేదు కదా, అంతా సోమయ్యే చూసాడు; పాపం నష్టం వచ్చిందట నిజంగానే!" అన్నాడు రామయ్య.

సరిగ్గా అదే సమయానికి రాజ మందిరంలోని విలువైన వస్తువులు కొన్ని కనిపించడం లేదని కనుక్కున్నారు. "దొంగలకు కఠిన శిక్షలు విధిస్తాం. కోరి వాటిని కొన్నవాళ్లకు కూడా ఇదే చివరి అవకాశం: మర్యాదగా మాకు తెచ్చి ఇస్తే సరి, లేకుంటే ఉరిశిక్ష పడుతుంది. దొంగలను పట్టించిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది" అని దండోరా వేయించారు రాజుగారు.

"సోమయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చినా, బంగారం‌ కొన్నాడంటే మరి, ఇలాంటి దొంగ పనేదో చేసి ఉంటాడు" అనుకున్న ఊళ్ళోవాళ్ళు రాజుగారి చెవిలో ఆ సంగతి ఊదారు: "అంత తక్కువ సమయంలో సోమయ్య కోటీశ్వరుడు అయ్యాడు ప్రభూ! మాకు అనుమానంగా ఉంది" అని.

వెంటనే రాజుగారు సోమయ్యను పిలిపించి "నువ్వు ఇంత తక్కువ సమయంలో కోటీశ్వరుడివి ఎలా అయ్యావు?" అని అడిగాడు.

"పొరుగుదేశాల్లో వ్యాపారం చేసి లాభం సంపాదించాను ప్రభూ!" అన్నాడు సోమయ్య.

రాజుగారు రామయ్యను పిలిపించి, "ఏమిరా! నువ్వేమో నష్టం వచ్చింది అంటున్నావు, వీడు లాభం వచ్చిందంటున్నాడు?! మర్యాదగా నిజం చెప్పండి- లేకపోతే ఇద్దరికీ ఉరిశిక్ష వేయిస్తాను" అని గద్దించాడు.

సంగతిని ఇంక దాచలేని సోమయ్య వాస్తవం బయట పెట్టాడు. "నేను రామయ్యని మోసం చేశాను" అని.

రాజు గట్టిగా నవ్వి, "ఒరే! 'తీగలాగితే డొంక కదలటం' అంటే ఇదే. నువ్వు నిన్ను నమ్మిన స్నేహితుడినే మోసం చేసినవాడివి. నిన్ను ఇంక ఎవరు నమ్ముతారు? సరే, నీకు శిక్ష నువ్వే విధించుకో, చూస్తాను" అన్నాడు.

సోమయ్య వణికిపోతూ రాజుగారి పాదాలు పట్టుకొని, "నాకు వచ్చిన లాభం కూడా కలిపి మొత్తం అంతా రామయ్యకు ఇచ్చేస్తాను. సముద్రం‌ ఒడ్డున దాచిన సొమ్ము కూడా తీసి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి" అని ప్రాధేయపడ్డాడు.

"నాకు న్యాయంగా రావలసిన సొమ్ము ఇస్తే చాలు మహారాజా, మిగతాది తమరు రాజ్యానికి జమ చేసుకోండి" అని తన వంతు లాభాన్ని తీసుకొని, మిగతాది ఖజానాకు జమ చేసాడు రామయ్య.