చిలిపి ప్రశ్నలు:
1. రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?
2. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
3. వేసుకోలేని గొడుగు ఏమిటి?
4. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?
5. రుచిలేని కారం ఏమిటి?
6. అంకెల్లో లేని పది?
7. భార్య లేని పతి ఎవరు?
8. అన్నం తినకపోతే ఏమవుతుంది?
9. తినలేని కాయ ఏమిటి?
10. పిల్లలు ఉండని స్కూల్‌ ఏమిటి?
11. ఆపరేషన్‌ చేస్తున్న డాక్టర్లు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు?
12. నోరు లేకపోయినా కరిచేవి?
13. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర?

జవాబులు:
1. ఈత రాదు కాబట్టి 2. పకోడి 3. పుట్టగొడుగు 4. శిరోజాలు 5. ఆకారం 6. ద్రౌపది 7. అల్లోపతి 8. మిగిలిపోతుంది 9. లెంపకాయ 10. డ్రైవింగ్‌ స్కూల్‌ 11. ఎవరు చేశారో తెలియకూడదని 12. చెప్పులు 13. విసనకర్ర

చిలిపి ప్రశ్నలు:
దారిన పోయే మనిషి ఎలా ఉంటాడు?
జ) ఉండమంటే ఉంటాడు!
ఎప్పటికప్పుడు మారిపోయే రణం?
జ)వాతావరణం!
అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
జ) పుస్తకాలు!

జోకులు:

దీర్ఘ యాత్ర!
ICU లో ఉన్న వ్యక్తి రాశి ఫలం చూస్తే ఇలా ఉంది:
"ఈరోజు మీకు శుభదినం‌. సుదూర ప్రయాణం, తక్కువ ఖర్చు, పాత మిత్రులు, బంధువుల కలయిక, ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదు. శుభం..! “
జిందాబాద్ రహస్యం
ఒక పేదవాడు చెరువులో ఒక చేపను పట్టి తన ఇంటికి తెచ్చి వండమని తన భార్యకిస్తాడు.
భార్య: గ్యాస్‌ లేదు, కిరోసిన్‌ లేదు, కరెంటు లేదు, నూనె లేదు ఎలా వండేది?
రైతు చేపను తీసుకెళ్ళి మళ్ళీ చెరువులోనే వదిలేస్తాడు దాన్ని.
నీటి ఉపరితలానికి వచ్చిన చేప గట్టిగా "సియం గారికి జై!! పియం గారికి జై!!” అని అరుస్తుంది.
ఖాళీ
పంతులమ్మ: మీ డాడీ ఏం చేస్తుంటాడోయ్‌?
చింటు: ఫర్నీచర్‌ అమ్మే పని టీచర్‌
పంతులమ్మ: వ్యాపారం బాగా సాగుతోందా, మరి?!
చింటు: బాగా సాగుతోంది టీచర్‌.. ప్రస్తుతం ఇంట్లో మంచం మాత్రమే మిగిలింది.
యమదూత
ఒకతనికి ఎడమ కాలు బ్లూ కలర్ లోకి మారింది.
గాభరా పడి డాక్టరుకి చూపించాడు.
డాక్టర్: కాలు మొత్తం విషంతో నిండిపోయింది.‌‌ ఆ విషం మొత్తం శరీరానికి పాకే అవకాశం ఉంది కనుక...వెంటనే ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి..
అతనికి ఆపరేషన్ చేసి కృత్రిమ కాలు అమర్చాడు.
కొద్దిరోజులకు కుడి కాలు కూడా నీలం రంగులోకి మారింది.
డాక్టర్: వెంటనే‌ ఆపరేషన్ చేసి కొత్త కాలు అమర్చాలి.. అన్నాడు.
కొద్దిరోజుల తరవాత కృత్రిమ కాళ్ళు రెండు బ్లూ కలర్ లోకి మారిపోయాయి. పేషెంటు వెంటనే‌ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.
డాక్టర్:‌నాకు ఇప్పుడు మీ ప్రాబ్లం అర్థమయ్యింది. మీ లుంగీ రంగు వదులుతుంది.. మీరు సరిగ్గా స్నానం చేయకపోవడం వల్ల అది పోవడం లేదు. రేపట్నుండీ స్నానం చేయండి!!!

పద్యాలు:

వినదగునెవ్వరు చెప్పిన- వినినంతనె వేగపడక వివరింప దగున్
కని కల్ల-నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో‌ సుమతీ!

చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు; గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదనుగ మంచి కూర నల పాకము చేసిననైన నందు నిం
పొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య, భాస్కరా?

ఎంత చదువుకున్నాగానీ, చదువులోని సారాన్ని ఆస్వాదించటం తెలీకపోతే ఆ చదువు వృధా. ఎంత చక్కని కూరను వండినాగానీ, అందులో తగినంత ఉప్పు లేకపోతే ప్రయోజనం ఏముంటుంది?

మానవుడాత్మకిష్టమగు మంచి ప్రయోజనమాచరించు-
కానక అల్పుడొక్కడది కాదని పల్కిన, వాని పల్కుకే
మానగ జూడడా పని- సమంచిత భోజన వేళ ఈగ కా
లూనిన వంటకంబు తినకుండగ నేర్పగునోయి, భాస్కరా?!

మనం మనకు నచ్చిన మంచి పనిని చేస్తూ పోవాలి. ఎవరో ఏదో అన్నారని ఆ పనిని ఆపనక్కరలేదు. మంచి భోజనం చేసేటప్పుడు గిన్నెమీద ఈగ వాలిందని తినటం మానేస్తామా?

సూక్తులు (వివేకానంద వాణి) :

  1. చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు
  2. "డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది."
  3. ధీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు
  4. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే అత్మగౌరవం
  5. లేవండి, మేల్కొనండి గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి
  6. అత్మ సందర్శమునకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం.
  7. ఈ దేశానికి వీరుల అవసరం వుంది. అందుకే వీరులుకండి.
  8. ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది.

పొడుపు కథలు:
1. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?!
2. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది. ఏంటది?
3. తలుపుల సందున మెరుపుల గిన్నె- ఏంటది?
4. తల్లి దయ్యం, పిల్ల పగడం!
5. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర!
6.ఒకటే తొట్టి, రెండు పిల్లలు!
7.చూస్తే చూసింది గాని కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్ళు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు. ఏంటది?!
8.చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు. ఏంటబ్బా, అది?!
9.తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు కానీ రాకాసి కాదు. పాకిపోవుచుండు గాని పాము కాదు. మరేమిటది?
10.నూరు పళ్లు, ఒకటే పెదవి. ఏమది?

పొడుపు కథలకు జవాబులు:
1. పొగ 2. మేఘం 3. దీపం 4. రేగుపండు 5. కొవ్వొత్తి 6. వేరుశనగ 7. అద్దం 8. టెంకాయ 9. రైలు 10. దానిమ్మ