రాజమ్మ, సంగయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు- సుశీల్, సాగర్.

వీళ్ళిద్దరిలోనూ సుశీల్ మంచిగా చదువుతాడు; కానీ వాడికి క్రమశిక్షణ లేదు. వాడి బుద్ధి మంచిది కాదు. సాగర్‌కేమో చదువు లేదు; కానీ క్రమశిక్షణ ఉంది. వాడిది మంచి బుద్ధి.

రాజమ్మ, రంగయ్యలకు ఇద్దరికీ‌ చదువు రాదు. "మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు?" అని వాళ్ళు బడిలో టీచర్లను అడిగేవాళ్ళు.

"సుశీల్ బలే చదువుతాడు. సాగర్‌కు చదువు సరిగ్గా రాదు" అనేవాళ్ళు వాళ్ళు. దాంతో తల్లిదండ్రులు సాగర్‌ని వాయించేవాళ్ళు; "మా సుశీ, మా సుశీ" అంటూ సుశీల్‌ని గారాబం చేసేవాళ్ళు. వాడు ఏది అడిగితే అది కొనిపెట్టేవాళ్ళు.

తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు సుశీల్ సాగర్‌ని ఎగతాళి చేసేవాడు. "నాలాగా ఉండాలి, నువ్వేంటి, ముద్దపప్పులాగా?" అనేవాడు.

సాగర్ నవ్వి, "చేతికి ఉండే ఐదు వేళ్ళే ఒక లాగా ఉండవు. మనం ఇద్దరం మనుషులం ఒకలాగా ఉంటామా? నువ్వేమో తెలివిగల వాడివి, నాకు అన్ని తెలివి తేటలు లేవు- ఏం చేస్తాం" అనేవాడు.

కాలం గడిచింది. సుశీల్, సాగర్ ఇద్దరూ పెద్దవాళ్లయారు. సుశీల్ పెద్ద ప్రభుతోద్యోగి అయ్యాడు. ప్రభుత్వం వాళ్ళు అతనికి ఒక పెద్ద ఇల్లు, కారు ఇచ్చారు. అతని భార్య పెద్ద కుటుంబం నుండి వచ్చింది.

ఇక సాగర్, లెక్క లేనన్ని కష్టాలు పడ్డాక, చివరికి ఓ చిన్న కంపెనీలో గుమస్తా అయ్యాడు. అయితే అతని మంచితనంవల్ల, ఆ కంపెనీ ఓనరు అతన్ని మెచ్చటం, అతన్ని దగ్గర చేసుకొని, అలా ఓ మోస్తరు జీతం ఇవ్వటం జరిగాయి. సాగర్ భార్యది కూడా సాధారణ కుటుంబం.

" 'చదువుకోరా' అంటే వినలేదు మా చిన్నోడు. చదువుకొని ఉంటే వాడు కూడా పెద్దోడిలాగా గొప్పవాడు అయ్యేవాడు" అనేవాళ్ళు రాజమ్మ-సంగయ్య. ఆ మాటలు విని సాగర్ భార్య చాలా నొచ్చుకునేది, కానీ సాగర్ మంచితనం ఆమెకూ అంటిందో ఏమో, బయట పడి అత్త మామల్ని ఏమీ అనేది కాదు. "వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళయారు. పెద్దవాళ్ళు ఇంతే- మారరు" అని తనే సర్దుకు పోయేది.

ముసలితనం మీద పడిన కొద్దీ రాజమ్మ, సంగయ్య ఊళ్ళో పనులు కట్టి పెట్టి, కొడుకుల దగ్గర ఎక్కువ సమయం గడపాలనుకున్నారు. పెద్ద కొడుకు అంటే వాళ్లకు ప్రేమ ఎక్కువ; అదీ కాక వాడు సంపాదనపరుడు. అందుకని ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.

వాళ్ళు వెళ్ళే సరికి కోడలు కొడుకుతో పోట్లాడుతున్నది- "మీ అమ్మవాళ్ళు వస్తే నేను చాకిరి చెయ్యను. వాళ్లకు నువ్వు ఏం చేసుకుంటావో అది నువ్వే చేసుకో" అని. "చూడు, నా పనులు నాకు ఉంటాయి. నువ్వు, వాళ్ళు ఎట్లా ఉంటారో మీ ఇష్టం. నా దగ్గర నచ్చకపోతే వాళ్ళు సాగర్ గాడి దగ్గరికి పోతారు- పొమ్మందాం" అంటున్నాడు పెద్ద కొడుకు!

ముసలివాళ్ళని చూడగానే వాళ్ళిద్దరూ మాటలు కట్టి పెట్టి "వచ్చారా! సరే సరే! మీ గది అదిగో, శుభ్రం చేయించి పెట్టాం. అందులో ఉండండి. ఏం కావాలన్నా పనమ్మాయికి చెప్పండి" అని బయటికి వెళ్ళిపోయారు.

వాళ్ల పిల్లాడు రణధీర్ ఎప్పుడూ సెల్ఫోనులో ఆటలు ఆడుతో, చదువు సంధ్యలు లేకుండా ఉండేవాడు. తల్లిదండ్రులిద్దరూ వాడికి ఏలాంటి మంచి బుద్ధులూ నేర్పలేదు. వాడు తుంటరిగా, వెటకారిగా మొద్దుగా తయారయ్యాడు. రాజమ్మ కొడుక్కు, కోడలికి ఏవో సలహాలు ఇవ్వబోయింది కానీ వాళ్ళు పట్టించుకోలేదు. సుశీల్ ఒక్కోసారి తాగి ఇంటికి రావటం, తల్లి దండ్రులతో మొరటుగా మాట్లాడటం కూడా జరిగింది.

"ఇంత చదివాడు అయినా వీడి జీవితమే ఇట్లా ఉంది; చిన్నోడికి అసలే చదువు లేదు వాడెట్లా ఉన్నాడో" అని బెంగ పడ్డారు ముసలివాళ్ళిద్దరూ. వాళ్లకు ఆ ఊహ వచ్చిందో లేదో, కోడలు "అయితే మరి వాళ్ళింటికే పోండి!" అని పెట్టే బేడా సర్ది, వాళ్లని చిన్నోడి ఇంటికి పంపించేసింది.

సాగర్ కొడుకు సందీప్ బాగా చదువుతున్నాడు. బాధ్యతగా ఉంటున్నాడు. సాగర్ ఉద్యోగంలో అలసిపోయి ఇంటికి వస్తే భార్య, కొడుకు ఇద్దరూ అతనికి సాయం చేస్తున్నారు. ముసలివాళ్లని వాళ్ళు ప్రేమగా చూసుకున్నారు. వాళ్లతో కలిసి కూర్చొని, మాట్లాడి, అన్నిటిలోనూ వాళ్ల అభిప్రాయాలూ తీసుకుంటున్నారు.

చూస్తూండగానే వాళ్ల దగ్గర నెలలు గడిచిపోయాయి. ఈ ఆరు నెలల్లోనూ కొడుకు, కోడలు ఒక్కసారి కూడా కొట్లాడుకోలేదు. కొడుకు ఎలా చదువుతున్నాడో పట్టించుకోకుండా ఒక్క రోజు కూడా గడవలేదు.

"ఏమో అనుకున్నాగానీ, చిన్నోడిదే మంచి జీవితం రాజమ్మా! తెలివి తేటలు ఎన్ని ఉంటే మటుకు ఏం లాభం, క్రమశిక్షణ, మంచితనం ఉండాలి గానీ?!" అంటున్న సంగయ్య మాటలకు "నిజమే" అని తలూపింది రాజమ్మ.