పాటిగడ్డలో మురళయ్య అనే భూస్వామి ఒకాయన ఉండేవాడు. మురళయ్యకు వంద ఎకరాలకు పైగా భూమి ఉంది. అతనికి ఏ దేశాలూ, రాష్ట్రాలూ, సాంకేతికతలూ తెలీవు. అతనికి ఉన్నదల్లా మంచితనం, మాటకారితనం. కేవలం ఆ రెంటింటి వల్లా అతని వ్యవసాయం చక్కగా జరుగుతున్నది. ఎలాంటి లోటుపాట్లూ లేకుండా పంటలు పండుతున్నాయి.

కష్టాల్లో ఉన్న వాళ్ళకు అనేక మందికి కోరిన సహాయం చేసేవాడు అతను. పేదలను ఆదుకొని సహాయ-పడుతుండేవాడు. అట్లా అందరూ "మంచివాడు మురళయ్య" అని పిలిచేవాళ్ళు ఆయన్ని.

మురళయ్య మనమడు 'సిద్ధార్థ' పట్నంలో చదువుకుంటున్నాడు. ఒకసారి సెలవల సమయంలో సిద్దార్థ పాటిగడ్డకు వచ్చాడు. తాతతో పాటు పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మురళయ్య ఒక పెద్ద రాయిమీద కూర్చుండి, కూలి పనులకు వచ్చిన వాళ్లని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు; అందరికీ కూలి డబ్బులు ఇస్తున్నాడు; కొందరికి వాళ్ళు అడిగినంత మొత్తాల్లో ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వసాగాడు.

మురళయ్యను గమనిస్తున్నాడు సిద్దార్థ. తాత మాట్లాడే తీరు మరీ మెత్తగా ఉంది. ఎవరైనా ఎక్కువ డబ్బులు అడిగితే కూడా ఈయన జంకటం లేదు- వాళ్ళు అడిగినంత మొత్తం ఇచ్చేస్తున్నాడు.."

అంతలోనే ఎవరో పిల్చినట్లు, సిద్ధార్థ దగ్గరికి ఒక ముసలాయన వచ్చి నిల్చున్నాడు: "మీ తాత తను సంపాదించిన దాన్నంతా ఎట్లా పంచి పెడుతున్నాడో చూసావా? అట్లా అడిగినవాళ్లకల్లా ఇచ్చేస్తే, ఇంక మీకు మిగిలేది ఏంటి, బూడిద!" అన్నాడు వెటకరిస్తూ.

సిద్దార్థకు తన మనసులో మాటే విన్నట్లయింది. ముసలాయన మాటలు నిజమే అనిపించాయి. తాతమీద చాలా కోపం వచ్చింది. అలిగి ముభావంగా కూర్చున్నాడు.

"ఏమైందిరా, ఎందుకట్లా ఉన్నావు?" అని మురళయ్య ఆరోజు సాయంత్రం అడిగితే, అప్పుడు అరిచాడు వాడు: "నువ్వు డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేస్తున్నావని అందరూ అనుకుంటున్నారు.

అట్లా అడిగినవాళ్ళకల్లా డబ్బులు ఇచ్చేస్తుంటే ఎలాగ? మనకు ఏం మిగులుతుంది?" అని.

మురళయ్య ఒక్క క్షణం‌ పాటు ఏమీ మాట్లాడలేదు. తను ఏమైనా 'అతిగా మాట్లాడాడేమో' అనుకున్నాడు సిద్ధార్థ. అయితే వెంటనే చిరునవ్వు నవ్విన మురళయ్య, "రా! నీకో వింత చూపిస్తాను!" అంటూ సిద్దార్థను వెంట బెట్టుకొని మార్కెట్‌కు వెళ్ళాడు.

మార్కెట్‌లో సిద్దార్థకోసం పలు రకాల బట్టలు కొన్నారు. దుకాణం‌ యజమాని అందరి కంటే ఎక్కువ తగ్గింపు ఇచ్చాడు మురళయ్యకు. తరువాత వాళ్ళిద్దరూ పోయి కిరాణంలో సరుకులు తీసుకున్నారు. కిరాణం యజమాని కూడా అందరికంటే తక్కువ బిల్లు వేశాడు. ఆపైన ఇద్దరూ మార్కెట్‌కు వెళ్ళి కూరగాయలు కొన్నారు. కూరగాయల వాళ్ళు మురళయ్య సంచినిండా కూరగాయలు నింపి ఇస్తూ "అయ్యా! నీ మేలు తీర్చుకోలేం!" అంటూ నమస్కరించారు.

సిద్ధార్థకు ఆశ్చర్యం అనిపించింది. "మేం వచ్చి కూరలు కొనుక్కుంటే, ఇంక అందులో మేలు ఏమున్నది?" అని ఆశ్చర్యపోయాడు.

అంతలోనే "మీ సంపాదనంతా వృధాగా పంచుతున్నాడు" అన్న ముసలాయన కన్పించాడు. సిద్దార్థ దగ్గరకు వచ్చి "వచ్చావా?!" అంటూ కౌగిలించుకున్నాడు: "ఇదిగో, మీ తాత చేసిన సాయం వల్ల ఇట్లా బట్టల దుకాణాలవాళ్ళు, కిరాణా దుకాణాలు, కూరగాయలమ్మే వాళ్లే కాదు; నాలాంటి వాళ్ళు కూడా ఎందరో బాగుపడ్డారు. పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న పొలాల్లో నాణ్యమైన పంటలు పండించి, వాటిలో ఎక్కువభాగాన్ని కూలీలకు ఇవ్వటమే కాదు; మాలాంటి మామూలు ప్రజలకు కూడా ఇలా అనేక విధాలుగా సాయపడుతున్నాడు మీ తాత.

నువ్వు 'చిన్నవాడివి కదా, ఈ విషయం తెలుసుకోవాలి; మీ తాతని అర్థం చేసుకోకుండా వేధించకూడదు' అనే, నీతో అట్లా అన్నాను. నీ మనస్సుకు బాధ కలిగిందేమో, నన్ను క్షమించు" అన్నాడు ఆ ముసలాయన.

సిద్దార్థ అలక తీరింది. తాత ఎంత మంచి పని చేస్తున్నాడో, ఎందుకు అందరూ ఆయన్ని 'మంచివాడు' అంటారో అర్థమైంది.

తన ఆలోచనలు ఎంత సంకుచితంగా ఉన్నాయో తెలిసి వచ్చింది. పదిమందికి సాయపడడం వెనుక ఉన్న ఆనందాన్ని తాత ఆనందంలో చూడగలిగాడతను. "నేను కూడా ఇప్పటినుండే మంచి పనులు చేస్తాను" అనుకున్నాడు గట్టిగా.