ఏనుగులు ఇలా కొత్తగా కనుగొన్న చెరువుకు దగ్గరలో చాలా కుందేళ్లు నివసిస్తూ ఉండేవి. శిలీముఖుడనే కుందేలు వాటికి రాజు, రోమకర్ణుడు అతని మంత్రి. ఏనుగుల గుంపు తమకు కనబడ్డ దారిలో చెరువు వైపుకు పరుగులిడుతున్న సమయంలో వాటి పాదాల క్రింద పడి అనేక కుందేళ్లు పాపం, నలిగి, చచ్చిపోయాయి! వాటిని చూసి మంత్రి రోమకర్ణుడి మనస్సు దు:ఖంతో పరితపించి-పోయింది.

అది భయపడుతూ, రొప్పుతూ, రోజుతూ, పరుగు పరుగున శిలీముఖడి దగ్గరికి వెళ్ళింది. రాజుగారికి వినయంగా నమస్కరిస్తూ, అది తమ వారికి ఎదురైన ఆపద గురించి చెప్పబోయింది- కానీ దు:ఖంతో దాని గొంతు మూసుకుపోయింది. మాట్లాడలేనట్లు అది కొంతసేపు తలవంచుకొని నిలబడి, చివరికి తెలివి తెచ్చుకొని "ప్రభూ! తమరు చూశారో, లేదోగాని, ఏనుగుల గుంపుల వల్ల మన కుందేళ్లకు ప్రళయమే ఎదురయినట్లున్నది!" అన్నది.

భయంకరమైన ఆ పలుకులు శిలీముఖుడి చెవులలోకి దూరి ఆతని హృదయాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. అప్పుడది చేతులతో చెవులు మూసుకొని, 'హరి హరీ' అంటూ కళ్లు మూసుకొని, కొంతసేపు బొమ్మలాగా నిలబడిపోయింది. మంత్రి ప్రయత్నం వల్ల కొంతసేపటికి అది తెలివి తెచ్చుకొని, నిట్టూర్చుతూ అన్నివైపులా చూసింది. అటుపైన మెల్లగా లేచివచ్చి, 'జరగవలసిన పని ఏమా' అని ఆలోచిస్తూ, చెంతనిలబడ్డ మంత్రులందరినీ చూసి ఇట్లా అన్నది:

"ఈ ఏడాది వేసవి వేడివల్ల అడవి అందం అంతా చెదరిపోయింది. అన్ని చోట్లా వాగులు, వంకలు ఇంకబట్టాయి. దాంతో దాహం ఎక్కువైపోగా, మనసులు అల్లకల్లోలమై పోగా, ముఖాలు వాడిపోగా, ఏనుగుల గుంపులు నడిచివచ్చే కొండల మాదిరి బయల్పడ్డాయి. ఇప్పుడు అవి 'ఈ నేల మొత్తం యీనిందా' అన్నట్లు, అన్ని చోట్లా తామే అయి, పరుచుకొని ఉన్నాయి. వాటి పాదాల క్రింద పడి నలిగి చనిపోయిన మన కుందేళ్ల సంగతి విన్నప్పటి నుండీ నా మనస్సు తీవ్ర ఆందోళనకు గురవుతున్నది.

దాహంతో ఈ ఏనుగుల మనస్సులు పూర్తిగా అదుపు తప్పి ఉన్నాయి. మత్తెక్కిన ఈ ఏనుగుల గుంపుల్ని మనం ఇలా ఎల్లప్పుడూ నీళ్లు త్రాగేందుకని రానిస్తూ-పోనిస్తూ ఉంటే, త్వరలో మన గుంపులో ఇక ఎవ్వరూ మిగలని స్థితి వస్తుంది. అందరం ప్రాణాలు కోల్పోయి, మన జాతి మొత్తం కేవలం పేరుకే పరిమితమై పోతుంది. మనవాళ్లు ఇప్పటికే చాలామంది చనిపోయారు. సముద్రం మాదిరి అఖండంగా ఉండే మన బృందం ఇప్పుడు ఆవు గిట్ట ఆకారంలోకి వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేస్తే వినాశనమే. అయితే మనం ఏం చేయగలం? మనం బలహీనులం- అంత పెద్ద ఏనుగులను ఎదిరించేంత బలం మనకు లేదు. ఏం చెయ్యాలి ? ఎట్లాగైనా యీ ఏనుగుల సమస్యకు తగిన ఉపాయాన్ని త్వరగా కనుగొనాలి!" అన్నది.

అదివిని మంత్రుల మనసులన్నీ విషాదంతోటీ, ఆశ్చర్యంతోటీ ముడుచుకు పోయినై. వాటికి ఏమీ తోచలేదు. అవన్నీ అలా ఒక దాని ముఖం ఒకటి చూసుకుంటూ 'ఈ సమయంలో మనకు దేవుడేదిక్కు-వేరే ఏమీ చేయలేం' అని దు:ఖ పడుతూ ఉండి-పోయాయి.

ముఖాలు తెలివి తప్పి, అవన్నీ అలా చేష్ఠలు ఉడిగి ఉండగా, 'విజయుడు' అనే ముసలి కుందేలు ఒకటి ముందుకు వచ్చింది. అది శిలీముఖుడితో- "మహా ప్రభూ! తమరు చింతించకండి. 'ఇది ఒక పని ' అని కూడా భావించకండి; మనసును కష్టపెట్టుకోకండి. ప్రభువుల దయ నా మీద ఉంటే, నాకు యీ శత్రువులను ఓడించటం ఎంత పని? ఈ ప్రపంచంలో 'తెలివితేటల వల్ల సాధ్యంకానిది' అంటూ ఏమీ లేదు. శరీర బలం లేకపోయినా సరే, తెలివితేటలు ఉన్నవాడు ఏ పనినైనా అలవోకగా చేయగల్గుతాడు. దేశకాలాల గురించిన తెలివి ఉండి, ఎల్లప్పుడూ ప్రభువులవారి సభలో కొలువు చేసుకునే మావంటి వారికి యీ ఏనుగులను పారద్రోలటం ఏమంత కష్టం కాదు. మీరు కనుసైగతో ఆజ్ఞాపిస్తే చాలు - మీ ఆజ్ఞాబలంతో ఎంతటి పనినైనా అతి సులభంగా సాధించుకొని రాగలడు- మీ యీ దాసానుదాసుడు!" అన్నది.

అది విన్న కుందేలు రాజుకు దాని మీద చాలా అభిమానంకలిగింది. చల్లనైన చూపుల్ని దానిపై ప్రసరింపజేస్తూ, 'సరే' అన్నట్లు మొలక నవ్వులు చివురిస్తూ , తల ఊపింది అది- "వెంటనే వెళ్లి పనిని సఫలం చేసుకొని రా, నీ కోరికకు దైవం కూడా అనుకూలించు గాక!" అని దీవించింది. అప్పుడా ముసలికుందేలు 'మహా ప్రసాదం' అని రాజుకు మ్రొక్కి బయలుదేరి పోయింది.

అలా పోతూ, దారి మధ్యలో అది ఇలా అనుకున్నది- "చూడు, ఆ ఏనుగుల రాజు చాలా పెద్దది. నేనేమో చాలా చిన్న దానిని. ఆ ఏనుగును కలసి మాట్లాడటం అనేది నాకు ఎట్లాసాధ్యం? ఒకవేళ ఎట్లాగోఒకలాగా సాధ్యమే అయ్యిందనుకో- అయినా పని ఎట్లా నెరవేరుతుంది? నేను అందని మామిడిపళ్లను కోసుకోనెంచినట్లున్నదే; నా కోరిక నెరవేరుతుందో, నెరవేరదో!" అని. అలా కొంతసేపు దాని మనసు ఆ ఆందోళనతో ఊయలలూగాక, చివరికి దానికి ఒక చక్కటి ఉపాయం స్ఫురించింది.

అది ఆ ఆలోచననే కొంతసేపు జాగ్రత్తగా గమనించి, 'ఉపాయం బాగుంది. పనికి సరిపోతుంది' అని మనసుకు సమాధానం చిక్కాక, ఇక ఉత్సాహంగా ముందుకు సాగింది- "స్పర్శచేత ఏనుగు, వాసనచేత గుర్రం, పరిపాలన చేత రాజు, నవ్వుతో దుర్మార్గుడు ఇతరులను గెలుస్తారట- కాబట్టి నేను ఈ కొండ కొమ్మున ఎక్కి కూర్చొని, ఏనుగుల రాక కోసం వేచి చూస్తాను" అనుకున్నది.

ఇక ఆ ఏనుగుల రాజు తన సహచరు-లందరితోటీ వచ్చి చెరువులోకి దిగి, ఆటలాడి, నీళ్ళు త్రాగి, మళ్ళీ వెనక్కి మరలి బయటికి రాగానే‌ కొండ కొమ్మున కూర్చున్న ఆ కుందేలు గట్టి గొంతుతో "ఓ ఏనుగురాజా! నీకు అంతా మేలగు గాక! ఒక్క క్షణం అలా నిలచి నేను చెప్పే నాలుగు మాటలూ విని పో!" అన్నది.

అప్పుడు ఆ ఏనుగులరాజు ముఖం పైకి ఎత్తి చూసి "ఎవడివి నువ్వు? మాతో నీకు ఏం పని? ఎందుకు మాట్లాడవచ్చావు? సమయాన్ని వృధా చేయక, నీ‌ కథనంతా ఒకటి రెండు ముక్కల్లో‌ వివరించు! వెళ్ళాలి" అన్నది.

అప్పుడు ఆ కుందేలు ధైర్యం తెచ్చుకొని, గంభీరమైన గొంతుతో అన్నది- "ఎవ్వరి పేరు వినగానే శత్రు సమూహాలు ఎల్లప్పుడూ తల్లడిల్లిపోతాయో, భూమికంతటికీ‌ ఏకైక అధినాధుడెవ్వడో, ఆ నెలరాజు చంద్రుడి దూతను నేను! 'శత్రువుకు అంతులేని కోపం వచ్చి, చేతిలో‌ కత్తి పట్టుకొని ప్రాణాలు తీసేందుకు మీదికి దూకిన సమయంలో‌కూడా, దూత అన్నవాడు కొంచెం కూడా‌ భయపడక, మాట మ్రింగక, వాస్తవాన్నే చెప్పాలి'- కాబట్టి, దూతగా‌ నా బాధ్యతను నెరవేరుస్తాను. రాజా! రాత్రికి అధిపతియైన మా మహారాజు తమంతట తాముగా నీతో చెప్పవలసిందిగా నాకు చెప్పిపంపిన సమాచారం కొంత ఉన్నది; చెబుతాను- శ్రద్ధగా వినవలసినది:

"ఈ సరస్సు నా ఆధీనంలో‌ఉన్నది. అందువల్ల మంచి నీటితో నిండిన ఈ సరస్సులోకి నా అనుమతి లేకుండా ప్రవేశించేందుకు ఎంతటి భీమబలులైనా‌ జంకుతారు. మీరు నన్ను లక్ష్య పెట్టకుండా, 'ఇవాళ్ళ-రేపు' అనే జంకు లేకుండా ఈ కొలనులో‌కి ప్రవేశించారు; మమ్మల్ని చాలా కలతపరచారు.

అంతేగాక, దారి మధ్యలో‌ నా పాద దాసులైన అనేక కుందేళ్ళను రూపుమాపి, నా పట్ల గొప్ప అపరాధం చేశారు మీరు. మీకు బుద్ధిగా బ్రతకాలని ఆశ ఉన్నట్లైతే తక్షణం ఈ మడుగును విడిచి వేరే చోటికి పోండి. ఇది మొదలు మరెన్నడూ నా అనుమతి లేకుండా‌ కొలనులోకి ప్రవేశించకండి.
'తెలిసీ తెలియని వారులే, పాపం' అన్న భావనతో ఇంతవరకూ మీరు చేసిన తప్పుల్ని క్షమించాను. ముందు నా ఆజ్ఞను పాటించి ప్రాణాలు కాపాడుకోండి.

అట్లా కాక, గర్వాంధకారంలో కళ్ళుగానక, నా ఆజ్ఞను ఉల్లంఘించినట్లైతే- మిమ్మల్ని అందరినీ నా పరాక్రమాగ్నితో‌ ఒక్కసారిగా భస్మీపటలం చేస్తాను. అటుపైన మీ‌ ఇష్టం!" అని కోపంతో‌ ఎర్రబారి, ప్రళయకాలపు అగ్ని శిఖల మాదిరి మండిపడుతున్నాడు మా రాజు.
అందువల్ల ఇక ఆలస్యం చేయకండి- పరమ దయాళువైన ఆ చందమామను తక్షణం శరణు వేడండి. ఆయన దయకు పాత్రులు కండి" అన్నది.
(-మిగతా కథ మళ్ళీ...)