ఎంత గొప్ప ప్రయోజనం కోసమైనా సరే, మూసలో పోయబడ్డవాళ్ళు చైతన్య వంతులు కాలేరన్నది నిజం. కొత్త సంవత్సరాన్ని మంచి అంశంతో ప్రారంభించింది కొత్తపల్లి బృందం. మరియా మాంటిస్సోరీ అందించిన విద్యా సేవల గురించి మరికొంత స్పష్టమైన సమాచారం ఉంటే బాగుండేది రాజశేఖర్ గారి 'జ్ఞానం-పాండిత్యం' గురించి మొదటగా చెప్పకపోతే అన్యాయమే. చక్కని కథ చదివామన్న తృప్తి కలిగింది. ఆయనకు ప్రత్యేక అభినందనలు.
బజరాగారి 'భయం' కూడా బాగుంది. మనలో మనకే ఎన్ని భయాలు! ప్రక్కవాడు హానిచేస్తాడనో, ఎదుటివాడు ఎగతాళి చేస్తాడనో, తోటివాడు నవ్వుతాడనో ? భయం లేని చోటనే కదా, స్నేహానికి తావు ఉండేది! 'కథ లోతులు పిల్లలకు అర్థం అవుతాయా' అనిపించింది.
రాధగారి కథకు ముగింపు బాగుంది. కార్తీక్ లాంటి గొప్ప మనసున్నవాడికి స్టేట్ ర్యాంకు రాకపోయినా వాడి గొప్పతనమేం తక్కువవదు కదా! నీతి చంద్రికలో పక్షులు కొంగని తిడుతూనే ఎన్ని నీతులు చెప్పాయి! 6వ పేజీలోని ఒక్కోవాక్యం ఒక్కో సూక్తిలా ఉంది.
స్వచ్ఛమైన మనసు, స్పష్టమైన పరిశీలన ఉన్న వారెవరైనా అత్యంత సామాన్యమైన విషయాలనుండీ స్ఫూర్తిని పొంది తమ జీవితాన్నే మార్చేసుకోగలరు. సరితగారు మంచి కథనిచ్చారు.
లలిత గారి బొమ్మ ఉత్సుకతని రేపేదిగా ఉంది. మరి పిల్లలు ఎలా స్పందిస్తారో చూడాలి. బొమ్మలకి పిల్లలు కథలు రాయటం లేదెందుకు?
ఎమర్ జోన్స్ లాంటి వాళ్ల గురించి తెలియటం, 'సైంటిస్టులంటే అచ్చు పుస్తకాల్లో ఉండే వారే' అనే భావనని పోగొట్టి, 'మనలో ఒకరు అవ్వచ్చు!' అన్న అభిప్రాయం కలగ జేస్తుంది. సౌమ్య గారికి ధన్యవాదాలు.
స్రవంతి వ్రాసిన స్నేహితుడి సలహా లాంటివి గతంలో వచ్చినా, క్రొత్తగా ఆలోచించి, పాత్రలను ఆసక్తికరంగా సృష్టించింది. సాయి కార్తీక్ కథ 'రాము తెలివి'లో 'అరే! ఇంత చిన్న విషయం పెద్దవాళ్ళెవరికీ తట్టలేదే!' అనిపించింది. 'మారిన మనసు'లో రంగమ్మ, కరుణలు సహనంతో రంగయ్యని మార్చిన తీరు బాగుంది. అంత సులువుగా మనుషులు మారతారని శరత్ చంద్రిక పసి మనసుకు ఎలా తట్టిందో అనిపించింది.
ప్రగతి వ్రాసిన కథలోలాగా స్నేహితులతో కలిసి చదువుకోవటంలోని సరదా, సంతోషం ఇప్పటి పట్నం పిల్లలకు తెలిసే అవకాశం లేదు. స్టడీ అవర్స్ పేరిట ప్రొద్దున్న ఎనిమిది గంటలనుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ లైన్లో కూర్చోబెట్టేసి, బెత్తం పట్టుకొని తిరిగే టీచర్ల పర్యవేక్షణలో చదవటం, పాపం ప్రగతికి తెలియదు కదా.
కీర్తి వ్రాసిన 'అన్న-తమ్ముడు'లో ఆవుచర్మం మీద చినుకులు పడటం, దొంగలు పారిపోవటం, ఇటీవలే ఎక్కడో చదివినట్లుంది. కొత్తపల్లిలోనే కాదుగదా..?
చివరగా, 'పగటికల' గురించి. ఉత్సాహం ఉరకలేసే వయసులో ఈ 'పగటి కల' పుస్తకం చదివితే "అర్జంటుగా టీచరైపోయి గిజూభాయి అయిపోదాం" అని అనిపించకమానదు- నిజంగా అదొక కమ్మటి కల!
కొత్తపల్లి బృందానికి అభినందనలు.