"అనగనగా వెంకటాపురం అని ఒక ఊరు ఉండేదట. అది పూర్వకాలంలో పచ్చని పంటలతో హాయిగా ఉండేదట. ఈ కాలంలోనైతే ఎన్నో కొత్తవి కనిపెట్టారట వాళ్ళు- రేడియో, టివి, బైక్, కార్ మొదలైనవి. అయితే ఆ వూళ్ళో‌ చాలామంది ముఖ్యంగా టివి వల్ల చెడిపోయినారట- ఎల్లాగ అంటే, ఆ ఊళ్ళో రవి అనే పిల్లవాడు ఒకడు ఉండేవాడు. ఆ బాలుడికి మంచి విజ్ఞానం ఉంది. ఇష్టంగా చదువుకునేవాడు; చక్కగా మంచి మార్కులు తెచ్చుకునేవాడు (-ఇవన్నీ‌ వాళ్ల ఇంటికి టి.వి. రాకముందే).

వాళ్ల ఇంటికి మరి టి.వి. ఎలా వచ్చిందంటే, రవికి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు-శివ. ఆ శివకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడి పేరు రాము. రాము వాళ్ళ ఇంట్లో టి.వి. ఉంది. రోజూ శివకు తను ఇష్టంగా చూసే టి.వి.ప్రోగ్రాముల గురించి చెబుతుండేవాడు. శివకు కూడా వాటిని చూడాలని ఒక కోరిక కలిగింది. వాళ్ళ నాన్నమీద ఎంతో ఒత్తిడి పెట్టాడు. చివరికి వాళ్ల ఇంటికి టి.వి. రాక తప్పలేదు. శివ తన మిత్రుడు రాము చెప్పిన ప్రోగ్రాంలు చూస్తూండేవాడు. క్రమంగా రవికి కూడా ఆ వ్యాధి సోకింది. వెంటనే తన చదువు పోయింది! రాత్రులు పన్నెండు గంటలవరకు టి.వి. చూడటం, ఉదయం లేట్ గా లేవడం, సోమరిలాగా తయారు కావటం!

చూస్తూండగానే రవికి పరీక్షలలో మార్కులు తగ్గాయి. వాళ్ల ఉపాధ్యాయులు అందరూ ఆశ్చర్యపోయారు: అతనిలో ఇంత మార్పు రావటంతో‌అందరూ అతని గురించి రకరకాలుగా ఊహించుకున్నారు. కొంతమంది వాడు ఎక్కువగా ఆడుతున్నాడేమో అనుకునేవాళ్ళు. కొంతమంది వాడు ఎక్కువగా నిద్రపోతున్నాడేమో అనుకునేవాళ్ళు. కానీ అసలు విషయం ఎవ్వరికీ తెలియదు- తను టి.వి. చూస్తున్నాడని. తరువాత కొంతకాలానికి రవి పూర్తిగా టి.వి.మాయలో పడిపోయాడు. టి.వి.లో తనకు ఇష్టమైన ప్రోగ్రాం రాకపోతే ఏడ్చే పరిస్థితికి వచ్చాడు.

చివరికి వాళ్ల నాన్న సమస్యను అర్థం చేసుకొని, టి.వి.ని తీసుకెళ్ళి అమ్మేశాడు. 'టి.వి. పోయింది' అనే బాధ రవిని బాగా పీడించింది, కొన్నాళ్ళు. తర్వాత వాడు దాని గురించి మరచిపోయి మళ్ళీ హాయిగా తన పాత లక్షణాలకు తిరిగి వచ్చాడు. టి.వి. మనిషిని ఎన్ని ప్రమాదాలకు గురిచేస్తుందో చెప్పలేము" అని రాస్తున్నాడు, కుంచనపల్లి అరవింద స్కూలు నుండి 8వ తరగతి యోగి!

అమ్మానాన్నలు టి.వి.లను అమ్మేస్తే పిల్లలకు దానిమీద కోరిక మరింత ఎక్కువైపోయే ప్రమాదం లేదూ? అందుకని, ఈ సమస్యకు అసలు మందు 'అర్థం చేసుకోవటంలోనే' ఉన్నది. పరీక్షలు దగ్గరపడుతున్నై; అందుకని టి.వి. చూసే అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి పిల్లలందరూ. టి.వి.లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు- వీటిని విజ్ఞానాన్ని ఇచ్చే సాధనాలుగా వాడుకోవాలి తప్ప, ఎవ్వరూ వీటి ఆకర్షణలో పడిపోకూడదు. ఈ విషయంలో చైనా, జపాన్ దేశాల పిల్లలు మనకు ఆదర్శం కావాలి. వాళ్లలాగా మనమూ ఈ వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకొని, వీలైతే వాటిని మరింత నేర్పుగాను, ఉపయోగకరంగాను తయారు చేయటం‌ నేర్చుకోవాలి.

ఇంతకూ టి.వి. ఎలా పనిచేస్తుందో‌తెలుసా? అందులో ఏమేం ఉంటాయి? టి.వి. తయారు చెయ్యాలంటే అసలు ఏమేం కావాల్సి వస్తాయి? మరి సెల్ ఫోన్ లోపలి భాగాల్ని ఎలా తయారు చేస్తారు? ఏభాగం ఏం పని చేస్తుంది? పెద్ద ప్రశ్నలే, సమాధానాలు కనుక్కోండి మరి!

అందరికీ అభినందనలతో,
కొత్తపల్లి బృందం