ఒక ఊరిలో ఒక బాతమ్మ ఉండేది. ఆ బాతమ్మకు ఒక పాప కూడా ఉండేది. ఆ పాప పేరు పండు.
ఒకరోజు ఒక కాకి ఆకాశంలో ఎగురుతుంటే చూసింది పండు.
తను కూడా దానిలాగా ఎగరాలని అనుకుంది. ఆ కాకినే చూస్తూ చూస్తూ మెల్లగా దాని వెంటనే వెళ్లసాగింది. కానీ ఎగరలేక పోయింది.
అలా అమ్మకు చెప్పకుండానే ఇల్లు విడిచి చాలా దూరం వెళ్లిపోయింది!
కొంచెం సేపటికి అమ్మ పండు కోసం చూసి, 'ఎక్కడికి వెళ్ళిందో కదా' అని కంగారుగా వెతకటం మొదలు పెట్టింది.
చూస్తే పండు ఎటువైపో నడచుకుంటూ పోతున్నది, పైకి పైకి చూసుకుంటూ.
అమ్మ దాన్ని ఆపి, అవీ ఇవీ చెబుతూ ఇంటికి తీసుకొచ్చింది.
అలా పండు తిరిగి ఇంటికి చేరుకుంది. సమయం చూసుకొని అమ్మ "ఇంతకీ నువ్వు ఎక్కడికమ్మా పాపా, వెళ్ళావు?" అని అడిగింది.
'నేను కాకి వెంట పోయాను. ఆ కాకిలాగా ఎగరలేకపోయాను, ఎంత ప్రయత్నం చేసినా" అంది పండు, విచారంగా.
"మనం బాతులం, పాపా! అందుకని మనం కాకిలాగా ఎగరలేము; ఆ కాకులు మనలాగా ఈదలేవు!" అంది బాతమ్మ.
బాతుపాపకు ఏదో కొంచెం అర్థం అయింది.