చిలమత్తూరు సామాన్యంగా పచ్చగానే ఉండేది. అయితే ఏమైందో ఏమో, ఈమధ్య కొన్నేళ్ళుగా వర్షాలు లేవు. పచ్చదనం బాగా తగ్గిపోయింది; పంటలు పండక ఊళ్ళో జనాలంతా బాధలో కూరుకుపోయారు. బాధలో బాధ- ఇంకోటి పట్టుకుంది. అదేంటో చూడండి-

ఆరోజున చిలమత్తూరు పిల్లలు కొందరు క్రికెట్ ఆడేందుకు వెళ్ళారు. రెండు జట్టులుగా విడిపోయి ఆటను ప్రారంభించారు. బౌలర్ వేసిన బంతిని చాలా గట్టిగా కొట్టాడు సర. అది గాలిలోకి ఎగిరి, ఎక్కడో నేలమీద పడి దొర్లుకుంటూ చాలా దూరమే వెళ్ళింది. అటువైపు ఉన్న ఫీల్డర్ దాని వెంట పరుగుతీశాడు- మిగిలిన వాళ్లంతా అక్కడే నిలబడి చూస్తున్నారు. ఎంతసేపటికీ ఫీల్డర్ వెనక్కి తిరిగి రాలేదు. చివరికి అందరూ వెళ్ళి చూసారు- అక్కడ నేలకు ఒక పెద్ద రంధ్రం ఉంది. ఫీల్డర్ రోహిత్ ఆ రంధ్రం ప్రక్కన కూర్చొని తల పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. అందరూ వాడి దగ్గరికి వెళ్ళి "అరేయ్, ఏమిరా, బంతిని వెతకటం మానేసి ఈ రంధ్రం వద్ద కూర్చొని ఏమి చూస్తున్నావురా?" అని అడిగారు.

వాడు అన్నాడు "అరేయ్, ఈ రంధ్రంలో ఏముంటుందా అని ఆలోచిస్తున్నాను. మన అయ్యవారు చెప్పారు కదరా, 'పూర్వకాలంలో రాజులు బంగారాన్ని , వజ్రాలను రకరకాల చోట్ల దాచిపెట్టారు 'అని? నాకు ఎందుకో చాలా నమ్మకంగా ఉందిరా, ఇది కూడా అలాంటి చోటే అని!" అని.

ఇంకేముంది, అందరూ వాడి చుట్టూ మూగారు. అందరూ ఆ రంధ్రంలోకి నిక్కి నిక్కి చూశారు. అందరికీ రోహిత్‌కు వచ్చిన అనుమానమే వచ్చింది. అందరూ వాళ్ల పెద్దవాళ్లకి చెప్పారు- ఊళ్ళో పెద్దవాళ్లంతా వచ్చి చూసారు- ఇంకా అనుమాన పడ్డారు.

"ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ చూడనిదాన్ని పిల్ల వాడు రోహిత్ కనుక్కోవటం- నిజంగా ఊరికి మంచి రోజులు రానున్నాయి" అనుకున్నారు అందరూ. 'అక్కడ నిజంగానే నిధి ఉంది. లేకపోతే ఇంతమంది పెద్దవాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారు?' అనుకున్నారు పిల్లలు.

సర్పంచి గారు గ్రామస్తులందరినీ పిలిచి మాట్లాడారు. "గ్రామస్తులారా! మనందరికీ తెలుసు. కొద్ది సంవత్సరాలుగా మనకు మంచి వానలు లేవు. ఈ ఏడాదైతే పంట పూర్తిగా నష్టమే అయ్యింది. ఇప్పుడు దేవుడు మనకోసం ఇదేదో మార్గం చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది. కాబట్టి అందరం కలసి ఇక్కడ త్రవ్వుదాం. దొరికినవాటిని అందరం సమంగా పంచుకుందాం. త్రవ్వడానికి అయ్యే ఖర్చును కూడా అందరం సమానంగా పంచుకుందాం" అన్నారు. అందరూ సరేనన్నారు; వెంటనే అక్కడ త్రవ్వకాలు మొదలు పెట్టేశారు కూడాను!

ఒక రోజు గడచింది.. త్రవ్వకాల్లో ఏమీ దొరకలేదు. రెండో రోజు ముగిసే సమయానికి ఆ ప్రదేశానికి ఒక ప్రక్కగా పెద్ద భోషాణం ఒకటి కనబడింది. అందరూ హడావిడి పడ్డారు; భోషాణాన్ని బయటికి తీసి చూశారు. దానిలో బంగారం, వజ్రాలు- ఏమీ లేవు! పూర్వ కాలపువి, ఏవో తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. అందరూ నిరాశ పడిపోయారు.

కొందరు అన్నారు- "పర్వాలేదు- ఇదేదో దొరికింది కదా అని ఆపకూడదు. ఇంకొంచెం త్రవ్వితే నిజం నిధి దొరకచ్చు!" అని. మూడో రోజు పని నిస్సారంగా గడిచింది- ఏమీ దొరకలేదు. అప్పటికి ఖర్చు ఐదు లక్షల రూపాయల వరకు అయ్యింది. "పని ఆపెయ్యండి- చాలు! అసలు ఇక్కడ ఏమీ లేదు!" అన్నారు కొందరు. "కాదులే, ఇంకొక్క రోజు త్రవ్వి చూద్దాం; ఏమీ దొరక్కపోతే ఆపేద్దాం" అన్నారు కొందరు. ఆ తర్వాతి రోజు పని ముగిసే సమయానికి, గుంతలో లోతుగా ఇరుక్కుని కనబడింది- ఉండలాగా గుండ్రంగా ఉన్న వస్తువు ఒకటి! అయితే ఆ సరికే బాగా చీకటి పడింది. "దాన్నేదో రేపు తీద్దాం. మనకు అసలు ఈ ఆలోచన ఇచ్చింది రోహిత్ కదా, రోహిత్ చేత తీయిద్దాం, దాన్ని!" అన్నారు సర్పంచి గారు. ప్రజలందరూ ఆరోజు రాత్రి అక్కడే నిద్రపోయారు. ఎవ్వరూ భోజనానికి కూడా పోలేదు.

మరుసటి రోజు ఉదయాన్నే రోహిత్ టార్చిలైటు చేత పట్టుకొని రంధ్రం దగ్గరికి వెళ్ళాడు. తాడు సహాయంతో రంధ్రంలోకి, వీలైనంత క్రిందికి జారాడు. అక్కడినుండి లోనికి చెయ్యి చాపితే రోహిత్‌కు అందింది, ఆ వస్తువు! 'ఎంత బరువు ఉంటుందో' అనుకున్నాడు గానీ, వాడు దానిని సులభంగానే తీయగలిగాడు!

"ఏంటిరా, దొరికిందా ఉండ?" అడిగారు పెద్దవాళ్లందరూ, పైనుండి.

"దొరికిందండీ" అన్నాడు రోహిత్ నీరసంగా.

"మరేది, అందివ్వు, దాన్ని ఇలా!" అన్నారు జనాలు. రోహిత్ దాన్ని పైకి అందించాడు.

ఏంటనుకున్నారు, అది క్రికెట్ బంతి!

"ఒరేయ్! ఈ బంతితోనేరా, మనం ఆ రోజు ఆడింది! మన బంతి మనకు దొరికిందిరోయ్!" అని సంతోషంగా అరిచారు పిల్లలంతా.

పెద్దలంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అందరూ మౌనంగా గుంతకేసి చూశారు. "ఒరేయ్, రోహిత్!‌నిజంగా అక్కడ ఇంకేమీ కనబడటం లేదా?" అన్నారు నిరాశగా.

"ఇక్కడ కొంచెం తేమ తప్ప మరేమీ లేదు. ఏదీ, గడారి (గునపం) ఇటివ్వండి ఓసారి!" అన్నాడు రోహిత్. ఎవరో గడారిని అందించారు వాడికి. తేమ ఉన్న చోట వాడు గునపంతో ఒక పోటు పొడిచాడో, లేదో- పెద్ద నీటి జల ఒకటి బయలు దేరింది అక్కడినుండి! ఉవ్వెత్తున లేచిన నీళ్ళు ఏనుగు తొండంలోంచి పడుతున్న ధార మాదిరి అందరినీ ముంచెత్తాయి. కరువుతో నీటికి ముఖం వాచి ఉన్న జనాలు ఆ నీళ్లలో తడుస్తూ గంతులు వేశారు.

పిల్లలు నీళ్లలో ఉత్సాహంగా ఈతలు కొట్టారు.

మరునాటికల్లా దానిచుట్టూ ఒక మంచినీటి సరస్సు తయారైంది. ప్రభుత్వం వారి సహాయంతో దానిచుట్టూ అవసరమున్న చోట్లల్లా కట్టలు, గేట్లు తయారయ్యాయి. అటుపైన చిలమత్తూరుకు ఇక నీటి సమస్యే లేకుండా పోయింది. ఊరి బీళ్ళన్నీ సస్యశ్యామలాలైనాయి.

పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి పనులు అప్పుడప్పుడూ సమాజానికి బాగా ఉపయోగపడతాయి!