సిద్ధార్థుడిగా పుట్టటానికి అనేక జన్మల ముందు, బోధిసత్త్వుడు ఒకసారి సెస్సెన్ దోజి అనే సన్యాసిగా జీవించాడు. ఆ రోజుల్లో మోక్షాన్ని కోరేవాళ్ళంతా 'బ్రాహ్మణాలు, అరణ్యకాలు' లాంటి శాస్త్రాలను వల్లె వేస్తుండేవాళ్ళు. సెస్సెన్‌దోజి కూడా వాటినన్నిటినీ చదివాడు, వాటి ప్రకారం పవిత్రంగా జీవిస్తూ, తన పుణ్యసంపదను పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతని పారమితలు ఏ స్థాయిని చేరుకున్నాయంటే, ఇక అతనికి ఇంకా లోతైన సత్యాలు తెలియవలసి ఉన్నది.
అయితే అంత గొప్ప సత్యాలు అందరికీ అనుభూతిలోకి రావు. వాటిని తెలుసుకోవాలంటే కొంత అర్హత ఉండాలి. దోజికి ఆ అర్హత ఉన్నదో లేదో తెలుసుకోవాలనుకున్నాడు, దేవతలరాజు ఇంద్రుడు. ఒక రోజున అడవిలో కట్టెపుల్లలు ఏరుకునేందుకు పోయిన దోజి ముందు ప్రత్యక్షమయ్యాడు, భయంకరమైన బ్రహ్మ రాక్షసుడి వేషంలో.
"హహ్హహ్హహ్హ" నవ్వాడు బ్రహ్మ రాక్షసుడు- "నీ పేరు దోజి కదూ! నీకు పరిపూర్ణ జ్ఞానం సంపాదించుకోవాలని ఉన్నదటనే, నిజమేనా?" అన్నాడు దోజితో.
"అవునండి!" అన్నాడు దోజి.
"నువ్వు ఏవేవో శాస్త్రాలన్నీచదివావట గదా, పరమ సత్యాన్ని నేరుగా చూపించే శ్లోకం ఒకటుంది. అదేంటో చెప్పు, చూద్దాం" అన్నాడు రాక్షసుడు.
"నాకు అట్లాంటివేవీ తెలియదండి" ఒప్పుకున్నాడు దోజి.
"అయ్యో! నాకు తెలిసినపాటి సత్యం కూడా తెలీదా, నీకు?!" అన్నాడు బ్రహ్మరాక్షసుడు, ఒకింత వెటకరిస్తున్నట్లు.
"చూడగా తమరు గొప్ప జ్ఞానులనిపిస్తున్నది. మీరు ఆ శ్లోకం ఏదో చెప్పారంటే నేను దాని సారాన్ని అందుకొని, నాజన్మను ధన్యం చేసుకుంటాను" అన్నాడు దోజి శ్రద్ధను కనబరుస్తూ.
"సరే, అయితే చెబుతాను కొంచెం. చూడు, ఇప్పుడు నేను చెప్పేది పరమ సత్యమే తప్ప, వేరేమీ కాదు- అర్థం అవుతున్నదా?" అన్నాడు రాక్షసుడు.
దోజి ఆ సరికే తన మనసునంతా రాక్షసుడి మాటలమీద కేంద్రీకరించి ఉన్నాడు.
"ఈ విశ్వంలో ప్రతీదీ మార్పు చెందుతూనే ఉన్నది. స్థిరంగా ఉన్నదంటూ ఏదీ లేదు. జనన మరణాల రహస్యం ఇదే" అని శ్లోకంలో మొదటిభాగం చెప్పాడు రాక్షసుడు.
"ఓహో!" అనుకున్నాడు దోజి, రెండవ భాగం కోసం ఎదురు చూస్తూ.
బ్రహ్మరాక్షసుడు రెండో భాగాన్ని చెప్పనే లేదు!
కొంచెం సేపటికి తేరుకున్న దోజి మిగిలిన ముక్కను చెప్పమన్నాడు.
"ఉహుఁ. ఊరికే నేనెందుకు చెబుతాను?" అన్నాడు బ్రహ్మరాక్షసుడు, మొండికేస్తున్నట్లు.
దోజి హతాశుడయ్యాడు- "అయ్యో! ఇంతకాలంగా నేను వెతుకున్నది దానికోసమే. దానికోసం నేను ఏమైనా ఇచ్చేస్తాను. మీకు ఏం కావాలో అడగండి" అని ప్రాధేయపడ్డాడు.
"సరే, నేను నీకు ఆ శ్లోకంలో రెండో భాగాన్ని చెప్పినందుకుగాను నీ శరీరాన్ని నాకు ఆహారంగా ఇచ్చెయ్యాలి నువ్వు" అన్నాడు రాక్షసుడు, ఆశగా.
"దానిదేముంది, ఇచ్చేస్తాను" అని మాట ఇచ్చేశాడు దోజి.
"అయితే విను- జననమరణాల చక్రం నుండి బయటపడిన వాళ్లకు నిర్వాణం లభిస్తుంది" అని శ్లోకాన్ని పూర్తిచేశాడు రాక్షసుడు.
దోజి ఆ శ్లోకాన్ని, దాని భావాన్ని చాలాసార్లు మననం చేసుకున్నాడు. దాన్ని అర్థం చేసుకున్నకొద్దీ అతనికి మరింత లోతైన సత్యం ఏదో తెలుస్తున్నట్లు అనిపించింది.
అయితే తను ఇప్పుడు రాక్షసుడికి ఆహారం అవ్వవలసి ఉన్నది. "ఇంత గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నాక, వెంటనే వృధాగా మరణిస్తే ఏం ప్రయోజనం? ఆ సత్యాన్ని నాలోకి ఇంకించుకోవాలి గద! అయినా ఏమీ పరవాలేదు- ఈ శ్లోకాన్ని పదిమందికీఅందేలా చెట్లమీద, బండలమీద రాస్తాను. నాకు ఇప్పుడు అంత అదృష్టం లేకపోయినా, మరెవ్వరికో దీనివల్ల మేలు కలిగితే చాలు" అనుకున్నాడు దోజి.
అనుకున్నదే తడవు, దాన్ని అమలు పరచాడు. దగ్గర్లో ఉన్న బండలమీదా, చెట్లమీదా ఈ శ్లోకాన్ని చెక్కాక, అతను ఒక ఎత్తైన చెట్టు ఎక్కి, నేరుగా బ్రహ్మరాక్షసుడి నోట్లోకి దూకాడు.
మరుక్షణం అసలు రూపాన్ని ధరించిన ఇంద్రుడు దోజిని క్రిందపడకుండా పట్టుకొని నిలబెట్టాడు. "నిర్వాణం సాధించాలంటే చాలా పుణ్యం చేసుకోవాలి. 'నాకు కాకపోతే పోయె- ఇతరులకు ఏ కొంచెం మేలు కలిగినా చాలు' అన్న సద్భావనతో నువ్వు చేసిన ఈ పని వల్ల నీ అర్హత నిరూపితం అయ్యింది. నీ యీ పుణ్యఫలంగా ఏదో ఒక జన్మలో నువు తప్పక పరిపూర్ణ జ్ఞానివి అవుతావు!" అని ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు .
నిజంగానే అనేక జన్మల అనంతరం సిద్ధార్థుడు బుద్ధత్వాన్ని సాధించాడు!