వేకువజామువేళ.

పక్షులు కిలకిలమంటూ ప్రపంచాన్ని నిద్ర లేపుతున్నాయి. పూజ చదువుకుంటున్నది. అప్పుడే రెండు పిచ్చుకలు పూజవాళ్ల ఇంటి వసారాలోకి వచ్చాయి. పూజ దృష్టి ఆ పిచ్చుకల వైపుకు మళ్ళింది. అదే సమయానికి ఇంట్లోంచి వసారాలోకి వచ్చాడు, పూజ వాళ్ళ నాన్న. పూజ పిచ్చుకలను చూడటం గమనించి, తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు-

“ఊళ్లో అలాంటి పిచ్చుకలు చాలా ఉండేవి. ఊళ్ళోవాళ్ళు ఈ ఊర పిచ్చుకల కోసమే జొన్నకంకులూ, సొద్ద(సజ్జ)కంకులూ తమ మొగసాలల్లో వేలాడదీసేవాళ్ళు. ఏటి గట్టున చెట్లమీద ఇంకా ఎన్నోరకాల పక్షులు ఉండేవి- వాటిని చూడటానికి ఊరి పిల్లలం అందరం ఏటిగట్టుకు వెళ్ళేవాళ్ళం. ” చెప్పాడు ఆయన.

“ఊళ్ళో పిల్లలు ఇప్పుడు కూడా ఏటి గట్టుకు వెళ్తుంటారు కదూ, నాన్నా?”అడిగింది పూజ.

"ఇప్పటి పిల్లలా ?! ఎవరూ వెళ్ళటం లేదు!” అన్నాడు నాన్న.

“అదేమి?! ఎందుకు వెళ్ళట్లేదు ఎవ్వరూ!?” ఆశ్చర్యంగా అడిగింది పూజ.

"చాలా కారణాలు ఉన్నై పాపా. ఒకటి, ఈ మధ్య పిల్లలకు తమదంటూ ఒక్క గంట సమయాన్నికూడా వదలటం లేదు పెద్దవాళ్ళు. ఎప్పుడూ ఏవేవో క్లాసులనీ, స్టడీ అవర్లనీ వాళ్లని బిజీగా ఉంచేస్తున్నారు. ఇంక వాళ్ళు ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించేదెన్నడు?

ఇక రెండోది, ఇప్పుడు అలాంటి పక్షులు చాలా వరకూ అంతరించి పోయాయి. మిగిలినవి అక్కడక్కడా తమకు నచ్చిన చోట్లు వెతుక్కొని దాక్కొని కూర్చుంటున్నాయి. అవి కూడా చాలా తక్కువే అని చెప్పాలి"

"అయ్యో, అలా ఎందుకు జరిగింది నాన్నా?" అడిగింది కరుణ.

"నానాటికీ లోపిస్తున్న పర్యావరణ సమతౌల్యం దీనికి ప్రధాన కారణం. మనుషులు తమ స్వార్థం కోసం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు.

ప్రకృతిలోని ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు, వృక్షాలు అంతరించిపోతున్నాయి. అలా అంతరించి-పోతున్న పక్షుల్లో- ఇవిగో, ఈ పిచ్చుకలు మొదటి వరుసలో ఉన్నాయి. సెల్‌ఫోన్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్ కారణంగా ఊర పిచ్చుకలు అధిక సంఖ్యలో చనిపో-తున్నాయట. ఇంక ఏమనాలి? అంతేకాదు, పూర్వం పూరిళ్ళ చూర్లలోను, ఇంటి పై కప్పు దంతెల మాటున, గోడలకు ఏర్పాటు చేసిన గూళ్ళలోను ఇవి నివాసం ఏర్పరచుకుని జీవిస్తూ ఉండేవి. ఇప్పుడు స్లాబు ఇళ్ళు వచ్చాయి కదా, పిచ్చుకలకు ఇవి అనువుగా ఉండవు; ఏతావాతా వాటి మనుగడకే ముప్పు ఏర్పడింది!” పూజ వాళ్ళనాన్న చెప్పాడు.

ఇది విని పూజ చిన్ని మనసుకు చాలా కష్టం కలిగింది. ఆరోజునే చెక్కలతో ఒక గూడును తయారు చేసి, వాళ్ల ఇంటి వసారా కప్పుకు కట్టింది పూజ . పిచ్చుకలు రోజూ ఆ గూటి చుట్టూ ఎగిరేవి; కానీ ఆ గూట్లోకి మాత్రం వెళ్ళలేదు! అదేమైనా వల అనుకున్నాయేమో, అవి. అయితే అటు తర్వాత మెల్ల మెల్లగా అవి గూట్లోకి వెళ్ళటం, రాత్రంతా అక్కడే ఉండిపోయి ఉదయాన్నే రివ్వున ఎగిరిపోవటం మొదలు పెట్టాయి. అది చూసి పూజ ఎంతగానో సంతోషపడింది.

'ఈ రేడియేషన్లు-అవీ లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో! మన ఇళ్ళు కొంచెం పిచ్చుకలకు కూడా అనువుగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!" అనుకున్నది పూజ.