రామనగరంలో ఉండే చలపతికి ఆఫీసులో ఏదో ముఖ్యమైన పని పడింది. ఇంట్లోంచి బయలుదేరే ముందు హడావిడిగా ఇంటి తాళం కోసం వెతికాడు చలపతి. తాళమూ కనపడలేదు; తాళపు చెవీ లేదు! ఇంట్లో చాలా డబ్బులు, బంగారు నగలు ఉన్నై.
చలపతి ఇంటి ముందే ఉంటాడు గణపతి. గణపతి ఏమంత మంచివాడు కాదు- వాడికి లేని అలవాటు లేదు. అయినా అవసరం గణపతిది.
ఆఫీసుకు వెళ్ళకుండా ఉండనూ లేడు; తాళం వెయ్యకుండా ఇంటిని వదిలి వెళ్ళనూ లేడు- 'కానీలే' అనుకున్నాడు. గణపతిని పిలిచాడు.
'ఇంట్లో విలువైన సామాను ఉన్నది; ఇల్లు కాసేపు చూసుకో'మని చెప్పి, గబగబా ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
చలపతి ఆఫీసు పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. చూడగా ఇంట్లో లైట్లు వెలగటం లేదు. ఇంటి తలుపులు బార్లా తీసి ఉన్నాయి!
చలపతి హడావిడిగా లైట్లు వేసి చూశాడు. లోపలికి పోయి చూస్తే గణపతి ఒక స్తంభానికి కట్టివేసి వున్నాడు! లోపల బీరువాలో సామాన్లన్నీ చెల్లా చెదరుగా పడేసి ఉన్నాయి. డబ్బులు, నగలు అన్నీ మాయం!
చలపతి గబగబా గణపతి కట్లు విప్పి వణుకుతున్న గొంతుతో అడిగాడు "ఏమైంది, ఎవరు, నిన్ను ఇట్లా కట్టేసింది?" అని.
గణపతి భోరుమని ఏడ్చాడు. ఏడుస్తూనే చెప్పాడు- "నువ్వు ఇలా వెళ్ళావుగదా, ఆఫీసుకు? నేను మా ఇంటి తలుపులు వేసి మీ ఇంట్లోకి వచ్చానో లేదో- ఓ దొంగ లోపలికి దూరి తలుపులు వేసేశాడు. నేను నోరు తెరిచేంతలో నా మీదికి దూకాడు. నన్ను కట్టివేసాడు- తీరుబడిగా బీరువా తెరచుకొని, నగలు, డబ్బులు, విలువైన వస్తువులు- అన్నీ దోచుకొని పోయాడు! నేను ఉండీ ఏమీ చెయ్యలేనివాడినయ్యాను!" అన్నాడు.
చలపతికి అనుమానం వచ్చింది- "ఇన్నేళ్ళుగా తమ కాలనీలో దొంగతనం అన్న మాటే లేదు. అకస్మాత్తుగా, అదీ తనకు ఆఫీసు పని పడగానే ఇలా ఎందుకు జరుగుతుంది? ఏదో మోసం ఉంది!"- వెంటనే గణపతిని, అక్కడికి చేరిన ఇరుగు పొరుగు వాళ్ళను అక్కడే ఉండమన్నాడు; తన స్నేహితుడు లాయర్ జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి టూకీగా జరిగినదంతా చెప్పాడు- "గణపతినీ నమ్మేట్లు లేదు" అని జోడించాడు.
జగన్నాథ్ చాలా తెలివైనవాడు. లాయర్‌గా అతనికి చాలా మందితో పరిచయం ఉన్నది; అతను స్వయంగా చాలా నేరాలను పరిశోధించి ఉన్నాడు కూడాను. చలపతిని అతను కొన్ని ప్రశ్నలు అడిగాడు- "గణపతిని తాడుతో కట్టేశాడు కదా, దొంగ? ముడి ఎటువైపు వేశాడు?" అని కూడా అడిగాడు. చలపతి గుర్తు చేసుకొని చెప్పాడు- గణపతి కాళ్ళు, నడుము, చేతులు- కట్టేసి ఉన్నై..ముడులు ముందువైపుకే ఉన్నట్లున్నై" అన్నాడు.
దానితో జగన్నాథ్ అనుమానం మరింత బలపడింది. అతను ఎవరెవరికో ఫోన్లు చేసి, అటుపైన ఒక మనిషిని పంపి గణపతిని వెంటబెట్టుకు రమ్మన్నాడు. చలపతి ఇంటికి తిరిగి వచ్చేంతవరకు ఇరుగు పొరుగు వాళ్ళను కొందరిని ఇల్లు గమనించుకుంటూ అక్కడే ఉండమన్నాడు.
అంతలో ఎవరో నలుగురు మనుషులు వచ్చారు. జగన్నాధ్ వాళ్లతో మాట్లాడి, నలుగురినీ పెడరెక్కలు విరిచికట్టి, వాళ్లను తమ ఇంటి ముందుగదిలో వరసగా నిలబెట్టాడు. తను పంపిన మనిషి గణపతిని వెంటబెట్టుకొని వచ్చేసరికి, జగన్నాధ్ అతన్ని ఏం జరిగిందో అడిగి, "చూడు బాబూ!
జాగ్రత్తగా చూడు- వీళ్లందరూ ఈ రోజు పగలు దొంగతనం చేసిన వాళ్ళు. వీళ్లలో ఎవరు, నిన్ను కట్టేసి చలపతి ఇంటిని దోచుకుపోయింది?" అని అడిగాడు.
గణపతి కొంచెం సేపు అందరినీ తేరిపార చూసాడు- అటుపైన అక్కడ నిలబెట్టినవాళ్లలో ఒకడిని చూపించి- "సందేహంలేదు- వీడే, ఈ గడ్డం వాడే, నన్ను కట్టేసింది!" అన్నాడు. మరుక్షణం జగన్నాథ్ గణపతి చేతికి సంకెళ్ళు వేసేసాడు!
"నాకు ఎందుకు సంకెళ్ళువేస్తావు, దొంగని నీ ఎదురుగా పెట్టుకొని?!" అన్నాడు గణపతి, గింజుకుంటూ.
"ఓరి పిచ్చి నాయనా! ఈ నలుగురూ నీకోసం వచ్చిన పోలీసులురా! ఇంక నువ్వు ఒప్పుకోవచ్చు- నువ్వే దొంగతనం చేసావని మాకు తెలిసిపోయింది. మర్యాదగా డబ్బులు, నగలు ఎక్కడదాచావో చెప్పకపోతే వీళ్ళు నిన్ను ఏం చేస్తారో నాకూ తెలీదు మరి!" అన్నాడు జగన్నాథ్ సన్నగా నవ్వుతూ.
గణపతి ఆట కట్టు అయ్యింది. డబ్బు దస్కాలను తనే వేరే చోటికి తరలించి, అటుపైన తనని తాను కట్టేసుకొని, వేరే ఎవరిమీదో ఆ దొంగతనాన్ని నెట్టేద్దామనుకున్న గణపతి పథకం ఫలించలేదు. అతను ఇంక చేసేదేమీ లేక తన తప్పును తాను ఒప్పుకున్నాడు. చలపతి ఇంట్లో దోచిన డబ్బు, నగలు పూర్తిగా వెనక్కి ఇచ్చేసాడు.
"వీడు చాలా మందిని మోసం చేసాడని విన్నాను గానీ, నన్నూ ఇంతగా మోసం చేస్తాడనుకోలేదు చూడు!
-తనదాకా వస్తేగానీ తెలీదంటారు అందుకే!" ఇల్లు సర్దుకుంటూ అనుకున్నాడు చలపతి, బాధగా.