ఇక్బాల్ మసీహ్ 1982లో పాకిస్తాన్ లోని లాహొర్ నగరం దగ్గరున్న మురిద్కె అనే కుగ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతనికి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అతని తండ్రి అతన్ని 400 రూపాయలకు అమ్మేశాడు- ఒక తీవాచీలు తయారు చేసే కర్మాగారానికి.
ఇక్బాల్ కు ఊహ తెలియక ముందే బానిస బ్రతుకులోని బాధ తెలిసింది. తనతో పాటు ఎందరో పిల్లలు అక్కడ వెట్టిచాకిరీ చేసేవాళ్ళు. వెట్టిచాకిరి అంటే పనికి జీతం ఉండదు- కేవలం తినడానికి, ఉండటానికీ చాలీ చాలని వసతి కల్పిస్తారు.
ఆ కర్మాగారంలో ఇక్బాల్, అతని తోటి పిల్లలు- అందరూ రోజుకు పన్నెండు గంటలు పని చేసేవాళ్ళు. 'పనివేళల్లో పిల్లలు పనిచెయ్యకుండా ఆడుకుంటే ఎలాగ?' అని వాళ్ళను దూరదూరంగా, మగ్గాల దగ్గర గొలుసులతో కట్టిపడేసే వాళ్ళు. ఈ పిల్లలందరూ అక్కడే అలా నిల్చోటానికి, కూర్చోటానికి- చివరకు కదలటానికి కూడా వీలులేని పరిస్థితుల్లో పని చెయ్యాల్సి వచ్చేది.
ఇక్బాల్‌కు పదేళ్ళ వయసు ఉన్నప్పుడు వాడు కొందరు స్నేహితులతో కలిసి తివాచీ పరిశ్రమనుంచి తప్పించుకున్నాడు. వాళ్ళందరూ ఒక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో మొట్టమొదటిసారి ఇక్బాల్‌కు తెలిసింది- పిల్లలకు కూడా స్వతంత్రంగా బ్రతికే హక్కు ఉందని, తనకు కూడా స్వేచ్ఛగా బ్రతికే అధికారం ఉందని!
అనుకోకుండా అక్కడ ఇక్బాల్ కు మాట్లాడే అవకాశం వచ్చింది. అనర్గళంగా, ఉద్వేగంగా సాగింది, అతడి ప్రసంగం! అది అక్కడున్నవాళ్ళను అందరినీ కదిలించింది. తివాచీల కార్ఖానాల్లో నలిగిపోతున్న తనలాంటి వాళ్ళ జీవితాల గురించి ఇక్బాల్ చెప్పిన మాటలకు పాకిస్తాన్ ప్రజల్లో అనూహ్య స్పందన లభించింది.
ఇక అక్కడనుంచి ఇక్బాల్ వెనుతిరగలేదు. తన వాక్పటిమతో ఎందరినో ప్రభావితం చేశాడు. కేవలం పాకిస్తాన్‌లోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో పర్యటించాడు. బాల కార్మికుల పరిస్థితులను వెలుగులోకి తెచ్చాడు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాడు. ఎందరో మేధావులను కలుపుకున్నాడు. పాకిస్తాన్ లోని తివాచీల పరిశ్రమ ఒక్కసారిగా గడగడలాడింది.
రెండు సంవత్సరాల తరువాత, 1995లో ఇక్బాల్‌ను "కొందరు గుర్తు తెలియని వ్యక్తులు" ఎవరో తుపాకులతో కాల్చి చంపారు. అప్పుడు ఇక్బాల్ వయసు కేవలం పన్నెండేళ్ళు.
"ఇంకెవరు చేస్తారు? ఇది తివాచీ పరిశ్రమలకు చెందిన దుండగుల పనే" అని ఎంతమంది అనుకున్నా, దేనికీ బలమైన సాక్ష్యాలు లేవు- అందుకని ఈ దుశ్చర్యకు బాధ్యులు ఎవరో నిర్ధారణ కాలేదు.
అలుపెరగకుండా పోరాడిన చిన్నారి విప్లవకారుడు ఇక్బాల్ అలా కన్నుమూసినా, అతను రేకెత్తించిన విప్లవం మాత్రం ఆగలేదు. అమెరికా, కెనడా దేశాలలో అతని వల్ల ప్రభావితమైన విద్యార్థులు ఎందరో అతడి కలను నిజం చెయ్యాలని దీక్షబూనారు. ఇక్బాల్ స్ఫూర్తితో మసాచుసెట్స్ విద్యార్థులు కొందరు పాకిస్తాన్‌లో బాలకార్మికుల కోసం ఒక బడి నిర్మించారు. వారి పట్టుదల చూసి ఇంకొందరు తోడైనారు. ఆ సమూహం ఇప్పుడు పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో బాల కార్మికుల కోసం ఎనిమిది బడులు నడుపుతున్నారు. ఇక్బాల్‌కు రీబాక్ మానవ హక్కుల అవార్డు, మరణానంతరం World's Children's Prize for the Rights of the Child అవార్డు లాంటివి ఇచ్చారు. అమెరికా దేశం అయితే ఇక్బాల్ పేరు మీద Iqbal Masih Award for the Elimination of Child Labor అనే ఒక వార్షిక పతకాన్నే నెలకొల్పింది!
దారిద్ర్యంలోంచీ , దుర్మార్గంలోంచీ బాల కార్మికుల వ్యవస్థల్లాంటివి తలెత్తుతాయి. అలాంటివేవీ లేని మంచి ప్రపంచం ఉంటే ఎంత బాగుండు! అలాంటి ప్రపంచం కోసం మరెందరు ఇక్బాల్‌లు తయారు కావాలో, మరి?