అనగనగా ఒక ఎడారిలో ఒక ఒంటె ఉండేది. దానిపేరు మిట్టూ. దాని యజమాని దానికి మాట్లాడటం నేర్పించాడు. ఒకరోజు దాని యజమాని ఇంట్లో లేడు.
అప్పుడు ఆయన స్నేహితుడు వచ్చాడు. ఇంట్లో ఉన్న బంగారం అంతా దోచుకెళ్లాడు. అదంతా గమనించింది మిట్టూ.
కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చాడు యజమాని. చూస్తే ఇంట్లో బంగారం లేదు!
ఇంట్లో బంగారం అంతా పోయిందని చాలా విచారించాడు ఆయన.
దిగులుతో ఉన్న యజమానిని చూసి మిట్టూ చాలా బాధ పడింది. ఎలాగైనా దొంగని పట్టివ్వాలని అనుకున్నది.
యజమానితో అన్నది- "మీరు తిరిగి వచ్చిన సందర్భంగా మీ స్నేహితులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరినీ ఆ విందుకు ఆహ్వానించండి. ఆపైన ఏం జరుగుతుందో చూడండి" అని.
ఆయన సరేనని, ఒక విందు ఏర్పాటు చేశాడు. దానికి తన స్నేహితులు అందరినీ ఆహ్వానించాడు.
ఒంటె విషయం తెలీదు కదా, దొంగ స్నేహితుడికి? అందుకని ఆ దొంగ స్నేహితుడు కూడా వచ్చాడు విందుకు.
అక్కడే నిలబడి అందర్నీ గమనిస్తూ ఉన్నది మిట్టూ. విందుకు వచ్చిన దొంగని చూడగానే గుర్తు పట్టిందది. యజమాని దగ్గరికి పోయి ఆ దొంగ ఆనవాళ్ళు చెప్పింది, ఆయన చెవిలో.
అయినా అది చుట్టూ ఉన్న వాళ్ళు అందరికీ వినబడింది. ఒంటె మాట్లడటం చూసి ముందు ఆశ్చర్యపోయారు అందరూ.
అటుపైన అందరూ కలిసి దొంగను పట్టుకున్నారు. అతను దొంగిలించిన బంగారాన్నంతా తిరిగి రాబట్టారు.
పోయిందనుకున్న బంగారం దొరికినందుకు యజమాని చాలా సంతోషించాడు.
మిట్టూని ప్రేమగా నిమిరాడు.
మిట్టూ ఎంతో ఆనందించింది.