పచ్చటి చెట్ల మధ్య ఉన్నాను నేను. గాలి బాగా వీస్తోంది. ఈ రోజున అయితే ఎండ కూడా బాగానే ఉంది.
నా ప్రక్కన ఉన్న మిత్రులంతా గాలిని ఆస్వాదిస్తూ, సంతోషం పట్టలేక అటూ ఇటూ ఊగుతున్నారు.
నన్ను మటుకు ఒక బడుద్ధాయి పిట్ట పిల్ల ఏడిపిస్తున్నది- నాపైన వాలింది. చింపిరి చింపిరిగా నా జుట్టును లాగుతున్నది. నేను ఎంతతిట్టినా, ఎంత పొమ్మన్నా సరే; దానికి అసలు భయం అనేదే ఉన్నట్టు లేదు.
నన్ను చూసి అందరూ 'చాలా చండాలంగా, భయంకరంగా ఉంటావు' అంటారు- కానీ ఈ పిట్ట ఐతే నన్ను చూసి అసలు భయపడటమే లేదు!
అంతలో, నా అదృష్టం! చీకటి పడింది. పిట్ట పిల్ల వెళ్ళిపోయింది. ఎప్పటి లాగే నేను స్థిరంగా, కదలకుండా ఉండగలిగాను.
రెండో రోజునా తిరిగి వచ్చింది- పాడు పిట్ట పిల్ల. అయితే అది ఈ రోజు ఎందుకో బాధగా ఉంది. ఎంత అడిగినా కారణం చెప్పలేదు. చివరికి నేను గట్టిగా, గదమాయించి అడిగే సరికి, అప్పుడు చెప్పింది- "నేను నివసించే చెట్టును ఎవరో నరికేశారు" అని! నాకు కూడాచాలా బాధ అనిపించింది, అది విని. కొంచెం సేపు నా నోట్లోంచి మాటలే రాలేదు.
తర్వాత చెప్పాను- 'ఇంకో చెట్టు మీద ఇల్లు కట్టుకో, మరి!' అని.
కానీ అప్పుడు అది అన్న మాట నన్ను ఇంకా బాధించింది : "నేను ఇంకో చెట్టు మీద ఇల్లు కట్టుకున్నా, దాన్ని కూడా నరికేస్తారు కదా! మనుషులు నరకని చెట్టంటూ ఏదైనా ఉందా, చెప్పు!?" అని.
దానికి చెప్పేందుకు నాకు నోట మాట రాలేదు. నిజంగానే మనుషులు నరకని చెట్టంటూ ఏదీ లేదు కదా?
చివరికి ఆ పిట్టని నాపైనే ఇల్లు కట్టుకోమన్నా.
అప్పుడది నవ్వింది- "నిజానికి నీపైన వేరేగా గూడు కట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వే ఓ చక్కని గూడు లాగా ఉన్నావు కదా?" అన్నది.
అప్పుడు నాకు గుర్తు వచ్చింది- "నేనొక పొలంలో దిష్టిబొమ్మను- నన్నూ తీసేస్తారు త్వరలో " అని.