అనగనగా ఒక ఊళ్ళో రాజేష్ అనే పిల్లవాడు ఉండేవాడు. వాడు చాలా మంచివాడు. ఒకసారి వాళ్ల మిత్రులందరూ కలిసి ఒక విహారయాత్రకు వెళ్దామనుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు.
తెల్లవారు జాముననే ప్రయాణం... అందరూ కలిసి బయలుదేరారు. కాకపోతే వాళ్ళు వెళ్ళింది విహారయాత్రకు కాదు- ఒక అడవిలోకి! అడవిలో ఒక రహస్య ప్రదేశంలో రాజుల కాలంనాటి నిధి ఒకటి ఉన్నదని తెల్సింది వాళ్లకి. అందుకని వాళ్ళంతా ఆ అడవికి ప్రయాణం అయ్యారు.
అడవిలో అందరూ తలా ఒక దిక్కుకూ వెళ్ళారు. ఎవరికి వాళ్ళు మ్యాపులు పట్టుకొని వెతకటం మొదలు పెట్టారు. మెల్లగా చీకటిపడసాగింది. అందరూ అడవిలోంచి బయటికి వచ్చేశారు.
అట్లా అడవిలోంచి బయటికి వచ్చిన పిల్లలకు లోపలినుంచి సింహాల గర్జనలు వినిపించాయి. తమను తాము లెక్కించుకొని చూసుకుంటే రాజేష్ లేడనే విషయం తెలిసింది. రాజేష్‌ను సింహాలు తినేసి ఉంటాయని అనుకొని, అందరూ బాధతో ఏడుస్తూ తిరిగి ప్రయాణం అయ్యారు.
అయితే అక్కడ అడవిలో రాజేష్‌కు నిజానికి ఏమీ కాలేదు. వాడు ఆ అడవిలోంచి వెనక్కి తిరిగి వస్తుంటే అక్కడొక పొదలో కూర్చొని వాడివైపే చూస్తున్న కుందేలు పిల్ల ఒకటి కనిపించింది వాడికి. దాన్ని రాజేష్ మచ్చిక చేసుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఆ కుందేలుకు కూడా రాజేష్ ఎంతగానో నచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆడుతూ‌ పాడుతూ‌ హాయిగా ఆడుకుంటూ ఉండిపోయారు. సాయంత్రం అయినా రాజేష్‌కు 'ఆ కుందేలును విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్ళాలి' అనిపించలేదు!

ఆరోజు రాత్రి కుందేలు పిల్ల వాడికి క్యారట్లు, అడవిలో దొరికే దుంపలు తెచ్చి ఇచ్చింది. వాడు వాటిని తిని, తను ఏరుకొచ్చిన గడ్డి పరకలను కుందేలుకు తినిపించాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడే నిద్రపోయారు!
తెల్లవారు జామున లేచి చూస్తే రాజేష్‌కు కుందేలు పిల్ల కనిపించలేదు! అంతలోనే దబ్బుమని శబ్దం చేసుకుంటూ వాడు మంచం మీదినుండి క్రింద పడిపోయాడు. అంటే ఇదంతా వాడి కల అన్నమాట!