రామయ్య అనే రైతు వయసులో వున్నప్పుడు కష్టపడి బాగా సంపాదించాడు.
వృద్ధాప్యంలో, ఆ సంపాదనని అంతా బంగారు కాసులుగా మార్చి, ఓ మట్టి కుండలో పెట్టి, పెరట్లో గొయ్యి తవ్వి, ఆ గోతిలో పాతి పెట్టాడు.
రోజూ ఉదయం-సాయంత్రం పెరట్లోకి వెళ్ళి, పై మట్టి తీసి, కాసుల కుండను తనివితీరా చూసుకుని, మళ్ళీ మట్టి కప్పి పెట్టేసేవాడు. ఈ రహస్యాన్ని పసి గట్టాడు, ఒక దొంగ.
ఆ రోజు రాత్రే ఆ దొంగ వచ్చేసాడు. ముసలాయనకు తెలీకుండా గొయ్యి తవ్వి చూశాడు. మట్టి కుండ లోని బంగారు కాసులన్నీ తీసుకున్నాడు. దాని నిండా పెంకు ముక్కలు వేసాడు. ఒక్క క్షణం ఆలోచించి, ఆ పెంకుల పైన మాత్రం పది బంగారు కాసులు కప్పాడు!!
మర్నాడు ఉదయం యథాప్రకారం గొయ్యి పైన మట్టి త్రవ్వి కుండను బయటికి తీసాడు ముసలాయన. కుండ పై భాగంలో వున్న బంగారు కాసుల్ని తనివితీరా చూసుకున్నాడు. తృప్తిగా మట్టి కప్పేశాడు.
ఇలా రోజూ కుండ పైనున్న కాసులను చూసుకుంటూ సంతోషంగా బ్రతికిన ముసలాయన, ఒక రోజున తృప్తిగా తన జీవితం చాలించాడు . మంచి దొంగలకి మనసు ఉంటుందనమాట!