నర్సయ్య అన్ని పనులకూ ఇతరుల మీదే ఆధారపడేవాడు. తన పని కూడా తను చేసుకునేవాడు కాదు. నాగలి పట్టి దున్నే దగ్గరినుండి కోత కోసి కుప్ప నూర్చేవరకూ ఏదీ సొంతగా చేసేవాడు కాదు.
ఒక సంవత్సరం వానలు బాగా పడ్డాయి. పొలం ఏపుగా పండింది. "పంటను సకాలంలో కోయకపోతే వెన్ను నేల రాలిపోతుంది" అని చుట్టు ప్రక్కల రైతులందరూ నర్సయ్యకు చెప్పారు.
"మరి మీరే వచ్చి కొంచెం కోసి పెట్టచ్చు కదా?" అన్నాడు నర్సయ్య. "అది వీలయేట్లు లేదురా అబ్బీ, మా పంటలు కూడా ఇప్పుడే కోతకు వచ్చాయి కదా!ముందు మా పని చేసుకుని, ఆ తర్వాత వీలునుబట్టి నీ పనీ చేసి పెడతాం" అన్నారు రైతులు.
నర్సయ్య తన బంధువులకు కబురు చేశాడు. ఎవర్నడిగినా అదే సమాధానం- "వీలయ్యేట్లు లేదు" అని.
రోజులు గడుస్తున్నాయి. పంట బాగా ఎండింది. నర్సయ్య కంగారు పడుతున్నాడు; చేతికొచ్చిన పంట నేలపాలు అవుతుందని దిగులు పడుతున్నాడు. తెలిసినవాళ్ళను అందరినీ మళ్ళీ మళ్ళీ అడుక్కున్నాడు. లాభం లేకపోయింది.
ఆ తర్వాతి రోజున గింజ రాలటం కూడా మొదలైంది. నర్సయ్యకు ప్రాణాలు పోయినట్లయింది. అయినా గత్యంతరం లేదు. ఇక ఆలస్యం చేసేందుకు లేదు. సొంతగానే పంటను కోయటం మొదలు పెట్టేశాడు.
అలవాటు లేని పని అవ్వటంతోమొదట్లో చాలా కష్టం అనిపించింది. కానీ కొంతసేపటికల్లా పని సులువు అయ్యింది. రెండు రోజులు నిద్రాహారాలు లేకుండా పని చేశాడు నర్సయ్య. అయితేనేమి, కోతలువిజయవంతంగా పూర్తయ్యాయి.
మరో రెండు రోజులకు పంట ఇంటి కొచ్చింది. ఆరోజు సంతృప్తిగా నిద్రపోతూ అనుకున్నాడు నర్సయ్య- "కష్టం అయితే అవ్వనీ: మన పని మనం చేసుకుంటేనే, పని జరిగేది!" అని.