వానలు పడటం మొదలైంది.
వాతావరణం అంతా చల్లబడ్డది.
ఎండలతో అట్టు ఉడికినట్లు ఉడికిపోయాం, ఈ ఎండాకాలం అంతా. ఒక్కోచోట యాభై డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత నమోదైంది, మరి! అయితే వానాకాలం మొదలైందో, లేదో- ఒక్కసారిగా చల్లటిగాలులు వచ్చేశాయి- మబ్బుల్ని వెంటబెట్టుకొని. ఉరుములు- మెరుపులు! చిటపటమంటూ చినుకులు! ఫెళఫెళమంటూ వానలు!
అంతలోనే ఉత్తరాన హిమాలయాల్లో‌ పడ్డ వర్షాలకు నదులన్నీ ఉరకలెత్తాయని, కొండ చరియలు విరిగి పడుతున్నాయని, యాత్రలకని వెళ్ళిన వాళ్ళు చాలా మంది అక్కడే ఇరుక్కు పోయారనీ వార్తలు. పాపం ఎందరికో అనుకోని కష్టాలు...
"అబ్బ! నాలుగు రోజులౌతున్నది- సూర్యుడి దర్శనమే లేదు! ఎడతెరపి లేకుండా వానలు! బాగుంది- ఇట్లా పడాలి" అంటున్నాడొక చోట రైతు...
"ఇంకా వానలు బాగా పడనే లేదే?! వాతావరణం చల్లబడ్డది కానీ వానలు లేవే?!" కంగారుగా అంటున్నాడొక ప్రాంతపు రైతు..
"రాబోయే నెల రోజుల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వానలు పడతాయి" చెబుతున్నాడో వాతావరణ శాస్త్రజ్ఞుడు...
ఈలోగా అన్ని ఊళ్ళలోనూ చెట్లు పచ్చ పచ్చగా మారాయి. లేత లేత ఆకులు వేశాయి. మల్లె చెట్లు మొగ్గలు తొడిగాయి. జాజిపూల పందిర్లు నిండా పూలతో కళకళలాడటం మొదలుపెట్టాయి. గులాబీలు, పారిజాతాలు, నిత్యమల్లెలు- అన్నీ వచ్చేశాయి ఒక్కొటొక్కటిగా. పక్షులు రోజూ పోటీ పడి కూస్తున్నాయి.
పశువులిప్పుడు ఇష్టంగా పోతున్నాయి అడవి వైపుకు- వాటికి కడుపునిండా మేసేందుకు పచ్చగడ్డి దొరుకుతుంది కదా, ఇకమీద- అందుకని! రైతులందరూ విత్తనాలు సిద్ధం చేసేసుకున్నారు. నేల 'పదును' అయ్యిందోలేదో చూసుకొని విత్తుతున్నారు. ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా చెట్లు పెట్టొచ్చు. ఎక్కడ పెట్టిన చెట్టు అక్కడే నిలద్రొక్కుకుంటుంది. నిజంగానే ఇది చెట్లు నాటే కాలం! ఇంతకాలమూ ఎండిపోయి ఎడారిలాగా పొడారిపోయిన నేలలన్నీ ఇప్పుడు "రండి! రండి! చెట్లు నాటండి" అని పిలుస్తాయి మనల్ని. ఈ సమయంలో మనకు చేతనైనన్ని విత్తనాల్ని, చేతనైనన్ని మొక్కల్ని పట్టుకెళ్ళి, "ఖాళీగా ఉన్నాం, రండి!" అని ఆహ్వానించే నేలల్ని ఎక్కడికక్కడ నింపేయాలి.
ఇప్పుడు ఎన్ని మొక్కల్ని నాటితే రేపు అన్ని పూలు పూస్తై;ఎల్లుండి అన్ని కాయలు కాస్తై; తర్వాత మళ్ళీ అన్ని చెట్లు తయారయి, వేడెక్కిన వాతావరణాన్ని చల్ల బరుస్తై! వేడి ఎక్కువ అయితే ఒకవైపున హిమానీ నదాలు కరుగుతాయి; నదులు పొంగుతాయి; వరదలు వస్తాయి; మరో వైపున త్రాగేందుకు నీళ్ళుండవు, నిల్చునేందుకు నీడ ఉండదు.
వాతావరణం చల్లగా ఉంటేనే మనమూ చల్లగా ఉంటాం! అందుకని పదండి, మరి! చెట్లు నాటుదాం! చల్లగా ఉందాం!!

కొత్తపల్లి బృందం