ఈ సారి కొత్తపల్లిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సంపాదకీయం. చాలా గొప్పగా ఉంది. నసీరుద్దీన్ కథని చెప్పిన తీరూ, దానిని అమెరికా సంగతికి అన్వయించడమూ ఎంతో బాగున్నాయి. మౌలికంగా మనుషుల్లో ఉండే గుణాలే దేశాల స్థాయిలో మనకి కనిపించే మంచి చెడ్డలుగా రూపు కడతాయన్న గొప్ప తాత్త్విక సత్యాన్ని పరోక్షంగా తెలియజేసిందీ సంపాదకీయం. ప్రతి సంచికనీ సంపాదకీయం కోసమే తెప్పించుకొని ఆవురావురుమని చదివే పాఠకులు ఏర్పడతారేమో బహుశా - ఇలాంటివి ప్రతి నెలా వ్రాస్తే.
ఈ కొత్త పల్లి సంచిక గురించి ప్రముఖం గా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం - కొంచెం బాధ కల్గించేదే - అచ్చుతప్పులు. మునపటి సంచికలలో అసలు అచ్చు తప్పులు లేవని చెప్పలేమేమో కాని, ప్రస్తావించాల్సినంతగా అవి ఎప్పుడూ లేవేమో! ఈ సంచికలో కూడా, అక్కడక్కడా కన్పించిన వాటిని "పోనీలే" అని సరిపెట్టుకోవచ్చునేమో కానీ - విషయ సూచికలో కథల పేర్లలో, ఇంకా ఈ సంచిక లో ప్రతి పేజీలో పైన ముద్రించిన బుల్లి మకుటం లోనే అచ్చుతప్పులు ఉండటం చూసి బాధ పడకుండా ఉండలేం.
లోపల బొమ్మల విషయానికొస్తే ఫర్వాలేదని మాత్రమే అనగలమేమో… ముఖచిత్రం బాగుంది. నీతి చంద్రికలో మండే పుల్లల్ని కాకులు చేతుల్తో పట్టుకున్నట్టు వెయ్యడం బాగాలేదు (కథలో ముక్కు న కరచుకొన్నట్టు స్పష్టం గా ఉన్నా).
రిత్య వ్రాసిన కథలో అద్భుతాలు ఎక్కువయిపోయినట్టు ఉన్నా కథ తమాషాగా ఉంది. పనినైనా, ఆటనైనా ఆనందిస్తూ ఉంటే ఎప్పటికో అప్పటికి విజయం తథ్యం అన్న విషయాన్ని చక్కగా చెప్పింది శ్రీరాం వ్రాసిన కథ (చెస్ విజేత ).
పెద్ద వాళ్ళకి అసలు సమస్యలుగానే అనిపించని విషయాలు కొన్ని చిన్న పిల్లలకి ఎలా సమస్యలుగా కనిపిస్తాయో ప్రవీణ్ తన కథ (స్నేహితులు) ద్వారా చక్కగా చెప్పాడు.
అమరేశ్వరి వ్రాసిన ' ఉంగరం పోయిన కథ' రాథ వ్రాసిన 'వ్యక్తిత్వం' కథలు కొంచెం పెద్దవాళ్ళ కథల్లాగానే అనిపించినా బాగున్నాయి. పిల్లల కోసం అక్కర పడే చాలా మంది పెద్దవాళ్ళు కూడా కొత్తపల్లి శ్రద్ధగా చదువుతారు కాబట్టి ఇలాంటి కథలు ఎన్ని వేసినా ఫర్వాలేదనిపిస్తుంది.
జంతువులూ మనుషులూ ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం, కష్టం వస్తే ఆదుకోవడం- ఇలాంటి హృద్యమైన విషయాలు చక్కగా చెప్పి హాయిగా చదివించిన కథలు ఈ సంచికలో నాలుగు ఉండడం విశేషం ! (నాగజయంత్ - మంచి ఏనుగు, సుష్మ - బొమ్మకి కథ, జానకి ; ఒంటె -కుందేలు, రాధ - రాము చేసిన తప్పు)
కొద్ది బుద్ధులున్న పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పే కథలు - 'నీవు నేర్పిన విద్యయే', 'దురాశ పిల్లి '. ఇలాంటి కథలు చదివి కొందరైనా పెద్దలు మారతారేమో ! ' ఉమ్మేస్తే మంటలు' కథ బాగుంది; కానీ ఇంద్రజాలం కథలు ఎప్పుడూ మూఢ నమ్మకాల చుట్టూ నే తిరగాలా అన్పిస్తోంది. ఇలాంటి కథలు ఇప్పటికే చాలా చదివేసి ఉండడంవల్లనేమో ! ఏదైనా శాస్త్రీయ విషయాన్ని ఆసక్తి కలిగించే ఇంద్రజాలం సహాయంతో విపులీకరిస్తూ కథలు ప్రచురిస్తే బాగుంటుందేమో ! సుష్మ వ్రాసిన 'మూఢ నమ్మకాలకు స్వస్తి' పెద్దదైనా బాగానే చదివించింది.
'సామెత ఎలా వచ్చింది' అనేది ఒక శీర్షికగా ప్రతినెలా వస్తే బాగుంటుంది. ద్విజేంద్ర జోకులు బాగా నవ్వించాయి. 'మంచి పుస్తకం' శీర్షిక కింద వేస్తున్న పుస్తకాలు చాలా విలువైనవి. బహుశా ఇప్పుడు ఎక్కడా దొరకవేమో (దొరుకుతాయా?) కానీ, ఇలాంటి పుస్తకాలు ఒకప్పుడు ప్రచురితమయ్యాయని తెలుసుకోవడం కూడా ఆనందం! సంతోషం!!
మొత్తం మీద ఈసారి కొత్తపల్లి ఎప్పటిలాగే ఓ కలగూర గంప! మిశ్రమ భావనల కాత!