ఒక ఊళ్లో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అదే ఊళ్లో శేషయ్య అనే వడ్డీ వ్యాపారి కూడా ఒకడు ఉండేవాడు.
రామయ్య రోజూ భగవంతుడికి శ్రద్ధగా పూజ చేసి, "సర్వే జనాః సుఖినో భవంతు!-జనులందరూ సుఖంగా ఉందురు గాక!" అంటూ పూజ ముగించే వాడు.
శేషయ్య కూడా దేవుడికి రోజూ పూజ చేసేవాడు. "నా వడ్డీ వ్యాపారం బాగా సాగాలి!" అని కోరుకునేవాడు.
రామయ్య స్థాయిలో పెద్ద మార్పులు లేవు; కానీ రోజులు సుఖంగానే గడిచేవి.
ఇక ఊళ్ళో వాళ్లకు ఎవరికి ఏ అవసరం వచ్చినా శేషయ్య దగ్గర అప్పు ఖచ్చితంగా దొరికేది. అట్లా అతని వ్యాపారం మూడు పువ్వులు- ఆరు కాయలు అయి, బాగా విస్తరించింది.
ఒక రోజున రామయ్య తన పిల్లలిద్దరినీ జాతరకు తీసుకు వెళ్ళాడు. పెద్దమ్మాయి తనకు ఒక బొమ్మ కావాలని అడిగి, కొనిపెట్టించుకున్నది. చిన్నమ్మాయి మటుకు మళ్ళీ మళ్ళీ రంగుల రాట్నం ఎక్కుతానని పేచీ పెట్టింది. "మరి నువ్వు అన్ని సార్లు రంగుల రాట్నం ఎక్కితే, ఇక నీకు బొమ్మ కొనుక్కోవడానికి డబ్బులు మిగలవు!" అన్నాడు రామయ్య.
"పరవాలేదు, నాకు అదే సంతోషం!" అంది చిన్నమ్మాయి.
అయితే సాయంత్రం ఇంటికి వచ్చాక, చిన్నమ్మాయికి అక్కని చూస్తే అసూయ వేసింది. 'తనకేమో బొమ్మ లేదు; మరి అక్కేమో బొమ్మతో ఆడుకుంటున్నది'! అయితే అదేమంత పెద్ద సమస్య కాలేదు- పెద్దమ్మాయి తన బొమ్మని చెల్లెతో బాగానే పంచుకున్నది. ఇద్దరూ కలిసి చక్కగా ఆడుకున్నారు!
ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో దేవుడు కనిపించి- "శేషయ్య 'నా వ్యాపారం బాగా సాగాలి' అని కోరుకుంటాడు. నేను అతని కోరిక తీరుస్తున్నాను. అందువల్ల ఊళ్ళో వాళ్ళకి కూడా లాభం కలుగుతోంది. కానీ నువ్వు మటుకు నీ ఒక్కడి కోసం కాక అందరి కోసం అడుగుతున్నావు. నీ కోరికని నెరవేర్చేందుకు నేను ఆగకుండా శ్రమించాల్సి వస్తున్నది; అయినా ఎంత శ్రమపడ్డా, మరి, నీ పనిలో ఏమంత ఎదుగుదల కనబడటం లేదు! చూస్తుంటే నీ పద్ధతి కంటే శేషయ్య పద్ధతే మెరుగు అనిపిస్తున్నది" అన్నాడు.
మర్నాడు ఉదయం రామయ్య ఎప్పటిలానే దేవుడికి శ్రద్ధగా పూజ చేశాడు. పూజ చివర్లో ప్రసాదం తీసుకోవడానికి పిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చారు.
"నాన్నా, నువ్వు దేవుడిని ఏం కావాలని అడుగుతావు?" అని అడిగింది చిన్నమ్మాయి.
"బోలెడు డబ్బులు కావాలంటే ఇస్తాడా?" అని అడిగింది పెద్దమ్మాయి.
"మనం ఏది అడిగినా దేవుడు అది ఇస్తాడు. కానీ మన సంతోషం మాత్రం మన చేతిలోనే ఉంటుంది" అని చెప్పాడు రామయ్య, పొలం దున్నేందుకు బయలుదేరుతూ.