ఒక ఊరిలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. ఎందుకో తెలీదు, కానీ వాడికి 'గుర్రాలు' అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూర్చొని గుర్రాల బొమ్మలు వేస్తూ ఉండేవాడు.
వాడి స్నేహితులందరూ వాడి బొమ్మల్ని బలే మెచ్చుకునేవాళ్ళు. 'ఇట్లాంటి గుర్రం నాది, అట్లాంటి గుర్రం నీది' అని మాట్లాడుకునేవాళ్ళు. మెల్లగా రాముకి కూడా ఆ ఆలోచన మొదలైంది. 'ఒక గుర్రం కొనుక్కోగలిగితే బాగుండు' అనుకున్నాడు.
దాని కోసం కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టసాగాడు రాము. ఒకవైపున చదువుకుంటూనే, ఆ డబ్బుల్ని సంపాదించటం కోసం చాలా కష్టపడి పనిచేశాడు. చాలా రోజుల తరువాత అతనికి కావలసినంత డబ్బు సమకూరింది. దాన్ని పెట్టి ఒక తెల్లరంగు గుర్రం పిల్లని కొన్నాడు వాడు. తను చూసిన ఓ సినిమాలోకూడా ఒక తెల్లగుర్రం ఉంది- దాని పేరు 'స్పిరిట్'. ఆ గుర్రాన్ని తలచుకొని, రాము తన గుర్రప్పిల్లకు 'స్పిరిట్' అని పేరు పెట్టాడు.
రాము తల్లిదండ్రులకు కూడా స్పిరిట్ చాలా నచ్చింది. వాళ్ళు గుర్రాల గురించిన చాలా పుస్తకాలు కొనిపెట్టారు రాముకు. అందరూ స్పిరిట్‌కి బాగా బలమైన తిండి పెట్టారు. ఆ గుర్రం కూడా చాలా బలంగా పెరిగింది. తను కూడబెట్టిన డబ్బుతో రాము ఆ గుర్రానికి ఒక జీను కొన్నాడు. రాము రోజూ ఇంటికి రాగానే అది వాడి దగ్గరకొచ్చి నిలబడేది. వాడు దాని మీద ఎక్కి స్వారీ చేస్తే దానికీ చాలా సంతోషంగా ఉండేది.
రాము బాగా చదువుకున్నాడు. ఇప్పుడు వాడు ఉద్యోగంలో చేరాడు. ఈలోగా ఇంట్లో వాళ్లకు అందరికీ స్పిరిట్ బాగా దగ్గరైపోయింది. జంతువు అయినా వాళ్ళింట్లో మనిషిలాగానే ఉండసాగింది.
మీకు తెలుసుగా, గుర్రాలు మనుషులంత కాలం బ్రతకవు. మహా అయితే 20-25ఏళ్ళు బ్రతుకుతాయంతే. అట్లా, రాము కొంచెం పెద్దయ్యేసరికి, స్పిరిట్ ముసలిది అవసాగింది.
కొన్నాళ్ళకి అది చనిపోయింది!
రాము చాలా బాధపడ్డాడు- ఎప్పుడూ ఆ గుర్రాన్ని గురించే ఆలోచించటం మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడికి ఏదన్నా ఇష్టం లేకుండా అయింది. చివరికి తన ఉద్యోగం కూడా చేయబుద్ధి కాలేదు. ఇంట్లోనే కూర్చొని నిశ్శబ్దంగా ఉండసాగాడు.
అది చూసిన రామువాళ్ల అమ్మ "రామూ! ఎప్పుడూ అలా బాధ పడకూడదు. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు ఎంత చక్కగా బొమ్మలు వేసే వాడివో? ఒకసారి స్పిరిట్ మనింటికి వచ్చాక, ఇక సమయం లేదని నువ్వు బొమ్మలు వేయటం మానేశావు. ఇప్పుడు నువ్వు మరోసారి బొమ్మలు వేయటం మొదలుపెట్టు. ముందుగా నీ మనసులో నిలచిపోయిన స్పిరిట్ బొమ్మని అందంగా చిత్రించి, నీ గదిలో పెట్టుకో. మరి నువ్వు బొమ్మలు వేసి చాలా కాలం అయ్యింది గదా, అందుకని ముందు కొంతకాలం ఎక్కడయినా పెయింటింగ్ క్లాసులకి వెళ్తావేమో, చూడు" అంది.
రాము లేచి నిలబడ్డాడు. ఆ రోజు నుండే పెయింటింగ్ క్లాసులకి వెళ్ళటం మొదలు పెట్టాడు. కొద్ది రోజుల్లోనే తన చేతిలోని కళ మళ్ళీ పైకి వచ్చింది. చక్కని బొమ్మలు తయారవ్వసాగాయి.
చిత్రకళలో మనసు నిల్చినకొద్దీ వాడి బాధ దూరమైంది. సంతోషం వచ్చింది. తన గుర్రం బొమ్మని పెద్దకాన్వాస్ మీద చిత్రించి అమ్మకి చూపించాడు రాము.
అమ్మ వాడిని చాలా మెచ్చుకున్నది. "మన చుట్టూ ప్రకృతిలో అద్భుతమైన వింతలున్నాయి రామూ; తెలీని అందం ఉంది. ప్రశాంతంగా గమనిస్తూ ఉంటే ఆ అందం మన మనసు లోతుల్ని తట్టి, సంతోషంతో నింపుతుంది. చిత్రకారుడు తనకు తట్టిన ఆ అందాన్ని కుంచె ద్వారా మళ్ళీ వ్యక్తీకరిస్తాడు. అట్లా తన సంతోషం రెండు రెట్లవుతుంది. నువ్వు ఇంకా గొప్ప చిత్రకారుడివవ్వాలి" అన్నది.
తన చుట్టూ ఉన్న పరిసరాలను, జంతువులను, మనుష్యులను, భవనాలను ఎంతో అందంగా చిత్రించసాగాడు రాము. గొప్ప పెయింటర్ అని పేరుతెచ్చుకోవటమే కాదు; గొప్ప సంతోషాన్ని సంపాదించు-కోగలిగాడు!