పొంచి, బుజ్జగించి, పొగడి, టక్కరిమూక
మంచివారి మోసగించుచుండు
కాకి జున్ను ముక్క కాజేసెరా నక్క
లలిత సుగుణజాల! తెలుగుబాల!
టక్కరి దొంగలు పొంచి ఉంటారు; బుజ్జగిస్తారు; పొగడుతారు; చివరికి మిమ్మల్ని మోసగించేస్తారు. కాకి నోట్లో ఉన్న జున్ను ముక్కని నక్క ఎలా కాజేసిందో తెలుసుగా? అందుకని జాగ్రత్తగా ఉండాలి!
సాటివానితోడ జగడమాడగరాదు
తీరుపులకు పరుల జేరరాదు
కొంటెకోతి గడ్డకొట్టె పిల్లులనోట
లలిత సుగుణజాల! తెలుగుబాల!
పిల్లులు రెండూ పోట్లాడుకుంటుంటే కొంటె కోతి వచ్చి ఏం చేసిందో తెలుసుగా? అందుకని తెలుసుకోండి, మీ తోటి వాళ్ళతో పోట్లాడకండి; పోట్లాడి తీర్పుకోసం పరాయి వాళ్ల దగ్గరికి పోకండి. వాళ్ళు మీ ఇద్దరినీ కలిపి మోసగిస్తారేమో, జాగ్రత్త!
నీళ్ళలోన మీను నెర మాంసమాశించి
గాలమందు జిక్కు కరణి భువిని
ఆశ దగిలి నరుడు అలాగు చెడిపోవు
విశ్వదాభిరామ వినురవేమ
నీళ్ళలో ఉన్న చేప ఎరను చూసి ఆశపడుతుంది; గాలానికి తగులుకొని నశిస్తుంది.
అట్లాగే ఆశ అనే గాలానికి తగులుకొన్న మనిషి కూడా నాశనం అవుతాడు.