పసిఫిక్ మహాసముద్రం మధ్యలో 176 ద్వీపాలతో కూడిన టాంగా అనే దేశం ఉంది. 2009లో ఈ దేశాన్ని సునామీ ముంచెత్తింది. అప్పుడు అమెరికాలో పనిచేస్తున్న కాటో అనే అమ్మాయి టాంగాలోని తన బంధువుల గురించి ఖంగారు పడి వాళ్లకి ఫోన్ చేసినప్పుడు, అన్నింటికంటే ముందు వాళ్ళు బాధపడ్డ విషయం - "మా పుస్తకాలన్నీ తడిసి పాడైపోయాయి." అని. అలా, "మాకు కొన్ని పుస్తకాలు పంపగలవా?" అని బంధువుల నుండి వచ్చిన విజ్ఞప్తి ని విన్నాక, టాంగా దేశంలో ఇప్పటి దాకా ఒక "పబ్లిక్ లైబ్రరీ" అన్నది లేదన్న విషయం తట్టింది కాటోకు. "నా దేశంకోసం నేనొక చిన్న లైబ్రరీ కడతాను" అనుకుంది కాటో. ఆమె కథే ఇప్పుడు చెప్పబోయేది.
కాటో పూర్తి పేరు కాటో-కకాల. అమెరికా దేశంలోని అలాస్కా ప్రాంతంలో టాంగా దేశస్థులకి పుట్టింది. అయితే, చిన్నప్పుడే తల్లీ, తండ్రీ విడిపోవడంతో, టాంగాలో తన అమ్మమ్మ దగ్గర పెరిగింది. పెద్దయ్యాక చదూకోడానికి అమెరికా వచ్చి, వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, మంచి పేరు తెచ్చుకుని అక్కడే స్థిరపడింది. ఇలా జీవితం కొనసాగుతూ ఉండగా, 2009లో టాంగా దేశంలో ఒక పెద్ద సునామీ వచ్చింది. దీని వల్ల తన వాళ్లకి ఏమైందో అని ఫోన్ చేసినప్పుడు మొదలైంది అసలు కథ- తన దేశానికి ఒక లైబ్రరీ నిర్మించాలన్న కల!
అలా అనుకున్నాక, ఒకసారి ఆమె అమెరికాలో తన విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ లైబ్రరీ వారు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు అని తెలిసిందామెకు. వెళ్లి ఓ నాలుగు పుస్తకాలు తీసుకుంది. తన దేశంలోని గ్రంథాలయం కోసం పుస్తకాల సేకరణ అట్లా మొదలైంది. ఈ ప్రయత్నం గురించి తెలిసి, చాలా మంది వ్యక్తులు స్పందించారు. కొన్ని సంస్థలు కూడా సహకరించడం మొదలుపెట్టాయి. అలా, ఇప్పుడు ఎన్ని పుస్తకాలు పోగు చేసిందో తెలుసా? 35000 పుస్తకాలు! మరి ఇన్ని పుస్తకాలు జాగ్రత్త చేయాలంటే మాటలా?? బోలెడు సొంత డబ్బు ఖర్చు చేసి, వాటిని ఇన్నాళ్ళూ జాగ్రత్త చేసి, ఇప్పుడు వాటినన్నిటినీ తన దేశానికి తరలించడానికి కావాల్సిన నిధులు సేకరించింది!
ఈ లైబ్రరీ కోసం దేశం నడిబొడ్డు అనదగ్గ ఒక ద్వీపాన్ని ఎంచుకుని, దానికి Northern Lights Library అని పేరు పెట్టింది. భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ లైబ్రరీ శాఖలు తెరవాలని ఆమె ఆలోచన. మరొక ఇరవై సంవత్సరాల్లో ఈ లైబ్రరీ ఒక పెద్ద విద్యా సంస్థ కావాలని ఆమె కోరికట!
"నేను చేసే పనిని గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి కానీ, గొప్ప కలలు కనడం, ఒక ప్రణాళిక ప్రకారం పని చేసుకుని వాటిని సాధించుకోవడం నాకు ఇష్టం" అంటుంది కాటో. ఇది కాక, ఆమెకి డాన్స్ చేయడం, బొమ్మలు గీయడం కూడా ఇష్టమట. ప్రస్తుతం మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టి, డిగ్రీ చదువుతోంది. త్వరలో న్యాయశాస్త్రం చదవాలి అనుకుంటోందామె.
తన దేశం కోసం ఒక లైబ్రరీ నిర్మించుకుంటున్న ఈ యువతి కథ స్పూర్తివంతంగా లేదూ? మా చిన్నప్పుడు మా క్లాసులో ఉన్న వాళ్ళం కలిసి, నెలకి తలా ఐదు రూపాయలు వేసుకుని, వార్తా పత్రికల లైబ్రరీ ఒకటి రూపొందించుకున్నాము. తరువాత అది చూసి స్కూల్లో వేరే తరగతుల వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసారని విన్నాము: ఆ సంగతి గుర్తు వచ్చింది నాకు, ఈ కథ చదివితే. అందరం దేశాలకి లైబ్రరీలు కట్టనక్కరలేదు కానీ, మన కోసం, మన చిన్న గుంపుల కోసం ఇలాంటి ఉపయోగకరమైన పనులు ఏవైనా చేసుకోవచ్చు కదా, ఏమంటారు?