టెక్కలి బళ్ళో చదివే సుందర్, మాధవ్‌లు మంచి స్నేహితులు. ఇద్దరికీ జీవశాస్త్రం అంటే చాలా ఇష్టం. జీవశాస్త్రం బోధించే రమేష్ సార్ అంటే మరీ ఇష్టం.
రమేష్ సార్ పిల్లలకు అచ్చుపుస్తకాల్లోంచి బోధించటం మాత్రమే కాదు- వాళ్లచేత రకరకాల సైన్సు పుస్తకాలు చదివిస్తారు. ఇతరులతో ప్రేమగా మెలగటం ఎట్లాగో నేర్పిస్తారు. ఇక ఆయనంటే పిల్లలకు ఇష్టం ఎందుకుండదు?
ఆరోజు సాయంత్రం బడి మూసేస్తారనగా గుర్తొచ్చింది సుందర్-మాధవ్‌లకు. రమేష్ సార్ ఆరోజున ఏదో మంచి పాఠం చెప్తానన్నారు. ఆటల్లో పడి తాము ఆ సంగతి మరచారు!
సుందర్, మాధవ్ ఇద్దరూ ఆయాసపడుతూ పరుగెత్తుకొని వచ్చేసరికి రమేష్ సార్ పుస్తకాలు సర్దుకుంటున్నారు.
"సార్! 'ఇవాళ్ళ ఏదో ప్రత్యేకమైన రోజు- మీకు ఓ మంచి పాఠం చెప్తాను' అన్నారు, మీరు. ఆటల్లో పడి మేం మరచేపోయాం సార్! క్షమించాలి" అన్నారిద్దరూ వగరుస్తూ.
"ఒళ్ళంతా మట్టేమిట్రా, వెళ్ళి కడుక్కొని రండి!" అన్నారు రమేష్ మాస్టారు.
"ఈ సమయానికి రోజూ ట్యాంకులో నీళ్ళు అయిపోతున్నాయి సార్. అందుకని ఇక రోజూ ఇంటికెళ్ళాకే కాళ్ళు చేతులు చక్కగా కడుక్కునేది" అన్నాడు సుందర్.
"అదే, ఇవాళ్ళ నేను చెప్తానన్న పాఠం! అటు చూడండి జాగ్రత్తగా- మీరంతా లంచ్ బాక్సులను కడుక్కున్నాక నీళ్ల కుళాయిలు కట్టెయ్యలేదు, గమనించారా? రోజూ అలా వదిలేస్తూనే ఉన్నారు. అందుకనే సాయంత్రానికి ఇక ట్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి. అవ్వవామరి!?" అన్నారు రమేష్ మాస్టారు.
అంతలోనే మరికొందరు పిల్లలు వచ్చి చేరుకున్నారు మాస్టారి చుట్టూ.
"ఇది ఏ ఒక్కరి బాధ్యతో కాదు సుందర్! ఉమ్మడి బాధ్యత. మన దేశంలో నీటి వాడకం కంటే వృధానే ఎక్కువ- తెలుసా?" మాస్టారి మాటలకు పిల్లలందరికీ సిగ్గనిపించింది.
"నిజమే మాస్టారూ! మా ఊళ్ళోకూడా మొన్న మొన్నటి వరకూ అదే సమస్య. అయితే మేం పిల్లలం నీళ్లని వృధా చేయకుండా జాగ్రత్త పడటం చూసి, ఊళ్ళో పెద్దవాళ్ళు కూడా చాలా మారిపోయారు. ఇప్పుడు అందరూ నీళ్ళని పొదుపుగానే వాడుతున్నారు" చెప్పాడు క్రాంతి.
"నా పుట్టిన రోజున ఒక మంచి మాట విన్నందుకు నాకెంతో సంతోషంగా ఉందిరా" అన్నారు మాస్టారు, ముఖంలో ఆనందం తళుక్కుమనగా.
విద్యార్థులందరూ గట్టిగా ఆశ్చర్యపోయారు- "నిజంగానా?! జన్మదిన శుభాకాంక్షలు మాస్టారూ!" అన్నారు.
"ఈ సందర్భంగా మీరు మాకో పార్టీ ఇవ్వాలి మాస్టారూ" అడిగారు క్రాంతి, మాధవ్ చనువుగా.
రమేష్ మాస్టారు నవ్వుతూ "ధాంక్యూ. నేను పార్టీ ఇస్తాను..మరి మీరంతా నాకు ఏం బహుమతి ఇస్తారు?" అడిగారు.
"ఇక మీదట బడిలో ఎన్నడూ ఒక్క చుక్క నీరు కూడా వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం మాస్టారూ" అన్నారు, రమేష్ మాస్టారి అంతరంగం తెలిసిన క్రాంతి.
"ఆహా! బాగుంది. ఇక్కడే కాదు పిల్లలూ! రోజూ కాలేజీ పిల్లలు లంచ్ బాక్సులు కడిగే చోట చాలా నీళ్ళు మడుగు అవుతున్నాయి. ఆ నీరంతా మొక్కలకు మళ్ళించేందుకు నేను ఇవాళ్ళ కాలవలు తీస్తాను. అది నేను మీకిచ్చే పార్టీ" అన్నారు మాస్టారు.
"మేం ఒప్పుకోం సార్... అది మా పని!" అరిచాడు మాధవ్.
"సరేలే. మరి మీరు ఆదా చేసిన నీళ్ళతో మన బడిలో కూరగాయలు, పండ్లు పండిస్తాను- అవే నేను మీకిచ్చే చాక్లెట్లు!" అన్నారు మాస్టారు నవ్వుతూ.
పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. "మేము సైతం ఈ పనిలోచేతులు కలుపుతాం.. దయచేసి కాదనకండి మాస్టారూ" అని అరిచారు.
మాస్టారు ఆనందంగా "సరే, మీలాంటి విద్యార్థులు అందరూ మేము సైతం అంటూ ముందుకు వస్తే పర్యావరణాన్ని కాపాడటం చిటికెలో పని. ఇంతకంటే నాకు పుట్టినరోజు బహుమతి ఏముంటుంది?!" అన్నారు క్రాంతి భుజాన్ని ప్రేమగా తడుతూ.