గోపాలపురంలో గోవిందుడు అనే పేద రైతు ఉండేవాడు. అతనికి 'నా' అన్న వాళ్లెవ్వరూ లేరు. గోవిందుడు ఆ ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు; ఎవరు ఏపని చెప్పినా కాదనకుండా చేసేవాడు. కోమటి కొట్టుకెళ్ళి సామాను తెచ్చిపెట్టడం దగ్గర నుండి- కొబ్బరి చెట్లు ఎక్కి మట్టలు, బోండాలు దించడం వరకూ అన్ని పనులూ చేసిపెట్టేవాడు గోవిందుడు. అయితే అట్లా పని చేసి పెట్టినందుకు ఎవరినీ డబ్బు అడిగేవాడు కాదు. పలహారమో, భోజనమో పెడితే మాత్రం తినేవాడు. అసలు వాడికి డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆ ఊరి వాళ్ళకు ఉండేది కాదు.
ఇలా ఉండగా గోవిందుడి పొలంలో వరి కోతకు కూలికి వచ్చిన రంగన్నకు అతని మంచితనం నచ్చింది. అతన్ని కొంచెం గమనించిన మీదట, తన కూతురు లక్ష్మిని వాడికిచ్చి పెళ్ళి చేసేశాడు రంగన్న. గోవిందుడి భార్య లక్ష్మి కూడా చాలా మంచిది. కుటుంబంకోసం, భర్త పేరు నిలబెట్టటంకోసం ఆమె కూడా ఒళ్ళు వంచి పని చేసేది.
అయితే భర్త ఇంతమందికి సాయం చేస్తూ కూడా ఎవ్వరి దగ్గరా డబ్బులు తీసుకోడే, ఆ సంగతి మటుకు ఆమెకు నచ్చలేదు. "పని చేస్తున్నందుకు డబ్బులు అడిగి తీసుకోరాదా?" అని ఆమె ఒకటి రెండు సార్లు భర్తను మందలించి చూసింది; కానీ గోవిందుడు- "సహాయం చేసి డబ్బు అడగటం నాకు చేత కాదు. అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతా-నులే. వీళ్ళు కాకపోతే నాకు ఇంకెవరున్నారు?" అని అనడంతో లక్ష్మి మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకు రాలేదు. అదనపు సంపాదన కోసం తనే కూలికి వెళ్ళటం మొదలు పెట్టింది.
కొన్నాళ్ళకి వాళ్ళకి పాప పుట్టింది. లక్ష్మి పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. ఇంటి ఖర్చులు కూడా పెరిగాయి. ఇబ్బందులు పడుతూ సర్దుకుని బ్రతకసాగారు; కానీ గోవిందుడు మాత్రం నోరెత్తి ఎవరినీ సహాయం అడగలేదు. లక్ష్మి తన ముసలి తండ్రిని రమ్మని, పాపకు తోడుగా ఆయన్ని ఇంట్లో ఉంచి, తను పనికి వెళ్ళసాగింది.
రోజులు గడుస్తున్నాయి. గోవిందుడి కూతురు సంధ్య ఊళ్ళో ఉన్న బడికి వెళ్లటం మొదలు పెట్టింది. గోవిందుడి లాగే సంధ్య కూడా పిల్లలందరికీ సహాయం చేసేది. చక్కగా చదువుకునేది.
ఆ సంవత్సరం పదో తరగతి పాసయ్యింది సంధ్య. ఊళ్ళో పదవ తరగతి పాసయిన పిల్లలందరూ పట్టణంలో ఉన్న కాలేజీలో చేరుతున్నారు. తన కూతురినికూడా బాగా చదివించాలనిపించింది గోవిందుడికి. కానీ సంధ్యని కాలేజీకి పంపాలంటే చాలా డబ్బులు కావాలి. గోవిందుడి దగ్గర అంత డబ్బు లేదు. ఇంతవరకూ ఎవ్వరినీ ఏమీ అడగని గోవిందుడు, పిల్లని కాలేజీకి పంపాలనేసరికి ఊళ్ళో అందరినీ సహాయం అడిగాడు: కానీ ఎవరికి వారు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు. కొంతమందికి సహాయం చేయాలని ఉండింది; కానీ సమయానికి చేతిలో డబ్బు లేక 'తరవాత చూద్దాంలే గోవిందా' అన్నారు.
'తనకు అంతగా అవసరమైతే అందరూ ముందుకొచ్చి సహాయం చేస్తారులే' అనుకున్న గోవిందుడు ఊహించని ఈ పరిణామానికి హతాశుడయ్యాడు. అందరినీ అడిగి, ఎవ్వరి దగ్గరా లేదనిపించుకొని, బాధతో ఇంటికి చేరి మంచంలో కూలబడ్డాడు. పరిస్థితి అర్థం అయింది లక్ష్మికి- ఇన్నాళ్ళూ ఓర్చుకున్న దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. ఏడుస్తూ భర్తని దూషించసాగింది.
సరిగ్గా అదే సమయానికి వాళ్ళింటి బయట నిలబడి ఉన్నాడు, ఊరి పెద్ద ధర్మయ్య కొడుకు- వేణు. చింతకాయలు కొట్టేందుకు గోవిందుడిని పిలుద్దామని వచ్చాడతను. అయితే వాళ్ళ మాటలు విన్నాక, అతను వెనక్కి తిరిగి వెళ్ళి తన స్నేహితులందరినీ పిలిచి గోవిందుడి సంగతి, సంధ్య చదువు సంగతీ చెప్పాడు. వాళ్ళందరూ సంధ్య తరగతి పిల్లలు. సంధ్య కాలేజీలో చేరలేకపోవడం అందరికీ బాధ కలిగించింది.
"ఇన్నాళ్ళూ మనందరికీ సంధ్య నాన్న ఎన్నో పనులు చేసిపెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అవసరమైతే ఒక్కరికి కూడా సహాయం చేయడానికి చేతులు రావడం లేదు. మనం మన పెద్దవాళ్ళకి చెబ్దాం " అన్నాడు వేణు. మిగతా పిల్లలందరూ కూడా వేణుతో ఏకీభవించారు.
పిల్లలు మాట్లాడుకునేదంతా విన్న ధర్మయ్య ఊరి వారందరినీ పిలవనంపించి, అందరితోటీ మాట్లాడాడు. ఈలోపు పిల్లలు కూడా పెద్దవారి దగ్గరకి చేరారు. పిల్లా పెద్దా అందరూ కలిసి కావలసిన డబ్బు వసూలు చేసారు. సంధ్యని కాలేజీలో చేర్పించి పుస్తకాలు కూడా కొనిచ్చారు. గోవిందుడు పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
ఇతరులకు సహాయం చేసేవాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడన్నది మరోసారి ఋజువయింది.