రత్నపురం అనే పల్లెటూళ్ళో ఒక చిన్న పెంకుటింట్లో కాపురం ఉండేవారు, సుబ్బారావు అతని భార్య సూర్యకాంతం. సుబ్బారావు ఆ ఊరి బళ్లో మాష్టారు- గొప్ప శాంత స్వభావి. అయితే ఆయన భార్య సూర్యకాంతం మాత్రం నిజంగా సూర్యకాంతమే: పరమ గయ్యాళి. భర్త ఏం చెప్పినా వినేది కాదు; ఎప్పుడూ పొరుగు వాళ్ళతో తగాదా పడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పుచ్చులు చెప్పడంతో సమయం గడిపేది. అయితేనేమి, ఆమె చేసే గుత్తివంకాయ కూర అంటే మటుకు సుబ్బారావుకు ప్రాణం. అది లేకుండా తను ఉండలేడు! ఒక రోజు సుబ్బారావు చాలా కంగారు పడుతున్నాడు.
"ఏంటండీ, అంత కంగారుగా ఉన్నారు?" అంది సూర్యకాంతం, రెండు ఇడ్లీలు పెట్టి కాస్త పచ్చడి విదిలిస్తూ.
సుబ్బారావు కోప్పడకుండా "ఈ రోజు స్కూలు ఇన్స్పెక్టర్ రామారావు గారు వస్తున్నారు..." అని ఇంకేదో చెప్పబోయాడు. ఆయన చెప్తున్నది వినిపించుకోకుండా బయట ఏవో మాటలు వినబడుతుంటే అటు పరిగెత్తింది సూర్యకాంతం.
'ఈసారైనా హెడ్ మాష్టర్‌గా ప్రమోషన్ ఇప్పించమని ఇన్స్పెక్టర్ని అడగాలి' అనుకుంటూ బడిని చేరాడు సుబ్బారావు. తరగతి గదిలో పిల్లలకి హాజరు వేయసాగాడు-
"లక్ష్మి!"
"ఎస్ సర్!"
"బాలూ!"
"ఎస్ సార్!"
"వినయ్..!"
హఠాత్తుగా పిల్లలందరూ లేచి నిలబడ్డారు. "ఏమయిందిరా?" అని సుబ్బారావు అడిగేలోపు ఇన్స్పెక్టర్ రామారావు లోపలకి వచ్చేశాడు.
"ఇహిహి. రండి సార్. మీ కోసమే ఎదురు చూస్తున్నా" అన్నాడు సుబ్బారావు. "ఇదిగో లక్ష్మీ! సార్ కి మంచినీళ్ళు తీసుకురా" అని పురమాయించి, సారుకు కుర్చీ చూపించాడు.
"ఈ మర్యాదలు సరేనయ్యా! ఏదీ ఈ పాఠం చెప్పు. ఎలా చెప్తావో చూద్దాం" అన్నారు ఇన్స్పెక్టర్ గారు విసుగ్గా, లక్ష్మి తెచ్చిన మంచినీళ్ళు తాగుతూ.
సుబ్బారావు పాఠం చెప్తుండగా ఆయన తన నోట్ బుక్ లో ఏవేవో రాస్తున్నారు.
సుబ్బారావు చిన్నపిల్లాడిలాగా 'ఎప్పుడెప్పుడు సాయంత్రం గంట మోగే టైం అవుతుందా' అని ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఆఖరికి గంట మోగింది. పిల్లలందరూ వెళ్ళిపోయాక, సుబ్బారావు ఇన్స్పెక్టర్ గారిని తన ఇంటికి రాత్రి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు.
"నేను అలా ఊరంతా తిరిగి చూసి వస్తాను. ఈలోపు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకోండి!" అంటూ రచ్చబండవైపు వెళ్ళారు ఇన్స్పెక్టర్ గారు.
అప్పుడు గుర్తొచ్చింది సుబ్బారావుకు- ఇంట్లో ఉన్నది సూర్యకాంతం! ఆమెకి తను ఈ వంట సంగతి ఇంకా చెప్పలేదు! చేస్తుందో, చెయ్యదో, ఏమంటుందో?! 'వంట చేయడానికి తనను ఎలా ఒప్పించాలా' అని ఆలోచిస్తూ ఇంటివైపు వేగంగా నడిచాడు సుబ్బారావు.
"ఏమేవ్! ఒకసారి ఇలా రా. నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి" అన్నాడు.
పక్కింటి రాములమ్మతో మాట్లాడుతున్న సూర్యకాంతం విసుక్కుంటూ "ఏమిటో అంత ముఖ్య విషయం" అంది చేతులు ఊపుకుంటూ బయటే నిలబడి.
అయితే సుబ్బారావు అదృష్టం కొద్దీ రాములమ్మ తన ఇంటికి వెళ్ళిపోయింది- సూర్యకాంతం లోపలకి వచ్చింది.
"ఇంకాసేపట్లో ఇనస్పెక్టర్ గారు మనింటికి భోజనానికి వస్తున్నారు" అన్నాడు సుబ్బారావు, నిబ్బరంగా.
"వస్తే ..? మీరే వండుకోండి- నా వల్లకాదు, ఇప్పటికిప్పుడు వంటలు చేయాలంటే!" అంది సూర్యకాంతం తటాలున.
"అది కాదే, ఈరోజు నువ్వు గుత్తి వంకాయ కూర చెయ్యి. ఎన్నాళ్ళగానో ప్రమోషన్ అడుగుదామనుకుంటున్నాను కదా! ఇప్పుడు నీ వంకాయ కూర తిన్నాడంటే ప్రమోషన్ గ్యారంటీగా ఇచ్చేస్తాడు" అన్నాడు సుబ్బారావు మెత్తగా.
"మీకు ప్రమోషన్ రావడానికి నేను వంకాయ కూర వండాలా, నాకేం లాభం?" అంది సూర్యకాంతం పళ్ళు బిగబట్టి.
"ఈ ఒక్కసారీ నా మాట వినవే, ఈ ప్రమోషన్ కోసం ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నాను. నాకు ప్రమోషన్ రాగానే కంచి నుండి రెండు పట్టు చీరలు తెప్పిస్తానులే, నీకు!" అన్నాడు సుబ్బారావు, చివరి అస్త్రం‌ ప్రయోగిస్తూ.
మొదటి మాటకి ముఖం తిప్పుకున్న కాంతం, 'పట్టు చీరలు' అనగానే ఇటు తిరిగింది- "సరే! నేను వంకాయ కూర చేస్తాను. అయితే ఇంట్లో నాలుగు కాయలే ఉన్నాయి. మొదట ఆయనకొకటి, మీకొకటి వేస్తాను. నేను చేసిన కూర ఆయనకి తప్పకుండా నచ్చుతుంది, కనక మారు అడుగుతారు; వేస్తాను. మీరు మటుకు మారు అడగకూడదు. మిగిలే ఆ ఒక్క వంకాయా నాది. నా వంకాయని మీరు గనక మారు అడిగారో- నేనేం చేస్తానో నాకే తెలియదు-జాగ్రత్త!" అంది .
"నేను మారు అడగనే అడగను. నీ వంకాయ నువ్వే తిందువు గాని!" అన్నాడు సుబ్బారావు, ఎట్లాగో భార్య వంట చేయడానికి ఒప్పుకున్నది కదా అని పొంగిపోతూ.
అన్నట్లే సూర్యకాంతం నాలుగు వంకాయలతో గుత్తి వంకాయ కూర వండింది. వంట వాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడింది. ఇన్స్పెక్టర్ గారు రాత్రి భోజనానికి వచ్చారు. కాంతం దీపం వెలిగించి నట్టింట్లో పెట్టింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, ఇన్స్పెక్టర్ గారిని భోజనానికి లేవమన్నాడు సుబ్బారావు.
అతిధి చేతులు కడుక్కోవడానికి బక్కెట్లో నీళ్ళు తెచ్చి పెరట్లో పెట్టింది సూర్యకాంతం. అక్కడ కాస్తంత కూడా వెలుగు లేదు. ఎలాగో చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నారు సుబ్బారావు, ఇనస్పెక్టరూ.
సూర్యకాంతం వడ్డించింది. వంకాయ కూరని మెచ్చుకుంటూ తింటున్న ఇనస్పెక్టర్ని చూస్తే సుబ్బారావుకి చాలా ఆనందంగా ఉంది- 'ప్రమోషన్ తప్పకుండా ఇస్తాడు. మా కాంతం గుత్తి వంకాయ కూర తింటే ఇక అంతే, మనం చెప్పినట్లు వింటారు ఎవరైనా' అని అనుకుంటూ 'మారు అడక్కూడదు' అన్న సంగతి మర్చిపోయాడు!
ఇన్స్పెక్టర్ గారికి మారు వేసినప్పుడు తను కూడా మారు వేయించుకున్నాడు సుబ్బారావు: పళ్ళు కొరుక్కుంటూ వడ్డిస్తున్న సూర్యకాంతాన్ని అసలు చూడనే లేదు!
ఇద్దరూ భోజనాలు ముగించి, చేతులు కడుక్కోవడానికి లేచారు.
ముందుగా చేతులు కడుక్కోవడానికి ఇనస్పెక్టర్ గారు వచ్చారు. చీకట్లో ఏమీ కనబడటం లేదు. అంతలో బరువైన వస్తువేదో ఆయన నెత్తిమీద ఠపాలుమని పడింది- ఆ వెంటనే మళ్ళీ.. మళ్ళీ! నక్షత్రాలు కనిపించినై ఆయన కళ్ళకి!
"నాకు లేకుండా కూర అంతా తినేస్తావా! మారు అడగనని చెప్పి మారు అడుగుతావా! మారు అడుగుతావా!" అంటూ ఇత్తడి చెంబుతో నెత్తి మీద మొట్టికాయలు వేసింది కచ్చగా సూర్యకాంతం, ముందుగా చేతులు కడుక్కునేందుకు వచ్చింది సుబ్బారావు అనుకుని.
ఆవిడ దెబ్బలకి అదిరిపోయిన ఇన్స్పెక్టర్ గారు ఒక్క పరుగున వీధిలోకి వచ్చి పడ్డారు.
"ఏమయింది సార్? ఆగండి సార్! ఆగండి సార్!" అంటూ సుబ్బారావు అతని వెంట పడ్డాడు.
కానీ ఏం లాభం? జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు సుబ్బారావు ప్రమోషన్ గాలిలో కలిసిపోయినట్లే!