భద్రాపురం బడిలో చదువుకునే రాము చాలా తెలివైన పిల్లాడు. వాడు బాగా చదివేవాడు, చక్కగా రాసేవాడు, అందరి మెప్పూ పొందేవాడు.
కొత్తగా బడిలోకి వచ్చిన మ్యాజిక్ పుస్తకం వాడికి చాలా నచ్చింది. ఒకసారి వాడు చక్కని మ్యాజిక్ ఒకటి నేర్చుకొని, దానికి కావలసిన సామాన్ల గురించి ఆలోచించుకుంటూ ఒళ్ళుమరచి నడుస్తూ పోతుంటే అకస్మాత్తుగా నల్లటి కారు ఒకటి వాడి ప్రక్కన వచ్చి ఆగింది. బలంగా, మొరటుగా ఉన్న చేతులు నాలుగు కార్లోంచి బయటికి వచ్చినై. రెండు చేతులు వాడి నోరు మూసి తలను పట్టుకుంటే, మరో రెండు వాడి కాళ్లను ఎత్తి కార్లో పడేసినై. కన్నుమూసి తెరచేలోగా వాడు కార్లో ఉన్నాడు; కారు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది!
ఇక రాము అరిచేందుకు, గీపెట్టేందుకు, పెనుగులాడేందుకు దేనికీ వీలుకాని పరిస్థితి- కార్లో డ్రైవరు కాక ఉన్నది మరో ఇద్దరు బలశాలులు. తనలాంటి పిల్లల్ని వాళ్ళు ఒక్కసారి మోదారంటే తల పగిలిపోవాల్సిందే. వాళ్ళు రాము నోట్లోబట్ట కుక్కి, కాళ్ళు చేతులు వెనక్కి వంచి కట్టేస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా తలవంచాడు రాము.
ఆ సమయంలో వాడికి తెలిసింది- అక్కడ ఆ పరిస్థితిలో ఉన్న పిల్లవాడు తనొక్కడే కాదు- తనలాంటి పిల్లలు మరో నలుగురు ఉన్నారా కార్లోనే. ఆలోగా కిడ్నాపర్లు వాడినీ మిగతా పిల్లలతోబాటు కారు డిక్కీలో పడేసారు.
ముందు మెత్తటి రోడ్డు మీద పోయిన కారు ఏదో గతుకుల రోడ్డును అందుకున్నది. గతుకులు, గుంతలు ఎత్తి ఎత్తి పడేస్తుంటే పిల్లలకు ప్రాణాలు కడబట్టినట్లవుతున్నది. అయినా అరిచేందుకు కూడా వీలు లేకుండా నోళ్ళలో గుడ్డలు కుక్కి ఉన్నవాయె! చాలా సేపటి తర్వాత కారు ఆగింది. ఇక తలుపులు తీస్తారని ఆశిస్తూ పిల్లలంతా చాలా సేపే ఎదురుచూశారు. చూసీ, చూసీ చివరికి ఎవరికి వాళ్ళు నిద్రపోయారు!
నిద్రలేచేసరికి వాళ్ళందరూ ఏదో రేకుల షెడ్డులో ఉన్నారు. షెడ్డునిండా సిమెంటూ, సున్నమూ, దుమ్మూనూ! షెడ్డుకు ఒక కిటికీ కూడా లేదు. తలుపుకి బయటినుండి గొళ్ళెం పెట్టి ఉన్నది. పిల్లలు ఆకలికీ దాహానికీ- దేనికి ఎంత అరచి గీపెట్టినా వినే నాధుడెవడూ అక్కడ ఉన్నట్లు లేదు. నీరసించి పోయిన పిల్లలు అట్లా మరో రోజు గడపాల్సి వచ్చింది.
మూడవ రోజున షెడ్డు తలుపులు తీసి, పిల్లలందరికీ తలా ఒక గ్లాసెడు నీళ్ళిచ్చాడు ఒక మొరటు మనిషి. వాళ్ళందరినీ బయటికి రమ్మని, ముఖాలు కడుక్కునేందుకు చోటు చూపించాడు. అందరికీ తలా ఒక గ్లాసెడు గంజి పోశాడు త్రాగేందుకు.
పిల్లలందరూ పాపం, ఆకలితో ఉన్నారు కదా, చప్పరించుకుంటూ త్రాగారు గంజిని.
అందరికీ తలా ఒక కత్తినీ ఇచ్చి, అక్కడున్న ముళ్ళ కంచెలు నరకమని సౌంజ్ఞ చేశాడు మొరటాయన. కాదనేందుకు లేదు; రాదనేందుకు లేదు. పిల్లలందరూ ఆపసోపాలు పడుతూ పని మొదలు పెట్టారు. ఇట్లా రోజులు గడవసాగాయి. ప్రతిరోజూ వీళ్లకు తిండి పెట్టటం, అటుపైన మట్టి త్రవ్వటం, కంపలు నరకటం, గడ్డీ గాదం తెచ్చి వాములు వెయ్యటం- ఇలా ఏ పనంటే ఆ పని వాళ్ళచేత చేయించుకునేవాడు. ఏ సమయంలోనూ మొరటాయన ఏమీ మాట్లాడేవాడు కాదు. అంతేకాదు- పిల్లలెవ్వరూ ఒకరితోఒకరు మాట్లాడు-కునేందుకు వీల్లేదు- మాట్లాడితే చాలు- వచ్చి కొట్టేవాడు.
ఆ ప్రదేశంలో మొరటాయన, నాలుగు వేటకుక్కలూ తప్ప మరే ప్రాణీ ఉన్నట్లే లేదసలు. ఆ ప్రదేశం ఏమిటో, ఎక్కడ ఉన్నదో, అక్కడికి తమను ఎందుకు తీసుకొచ్చారో, అసలు వీళ్ళెవ్వరో- ఎవ్వరికీ తెలీలేదు. మొరటాయన మూగవాడేమో- అతని నోట్లోంచి ఒక్క శబ్దమూ రాగా ఎవ్వరికీ వినబడలేదు. ఇక కుక్కలు, వీళ్ళలో ఎవరు కొంచెం అటు దూరంగా అడుగు వేసినా మీదపడి కరిచినంత పనిచేసేవి!
తాము కొట్టిన కంపల్ని చూసేసరికి రాముకి ఒక ఆలోచన వచ్చిందొకరోజున. పనిలో పనిగా కొంత బోద గడ్డిని తెచ్చి పరచి, వాటి మీద కొన్ని ముళ్ళ కంపల్ని వేసి మంట పెట్టాడు. ఆకులు మాత్రం కాలిపోయేట్లు కాల్చాడు వాటిని. ఆ కంపల్ని తడక మీద బిగించి కడితే, ముళ్ళన్నీ నిక్కపొడుచుకొని, 'ముళ్ళ పరుపు' ఒకటి తయారైంది.
ఆరోజు రాత్రి పని అంతా ముగిశాక, ఆ 'పరుపు'ను తాము పడుకొనే షెడ్డు ముందుకు లాక్కెళ్ళి పెట్టాడు రాము. మొరటాయన ఇదంతా చూసినట్లు లేడు- చూసినా మరి పట్టించుకోలేదేమో.
మర్నాడు తెల్లవారే సరికి రాము నిలువునా బొట్టు పెట్టుకుని, "మౌన ఉపవాస వ్రతం" అని ఒక బోర్డు రాసి పెట్టుకొని, ఆ ముళ్ళ పరుపు మీద పడుకొని కనబడ్డాడు మొరటాయనకు. నల్లగా, కోసుగా ఉన్న ఆ ముళ్ళు దిగితే రాము శరీరం చిల్లుల జల్లెడే అయిపోవాల్సిందే! అయినా మరి, ముళ్ళు ఎందుకనో రాముని ఏమీ చేయట్లేదు. కదలకుండా పడుకొని ఉన్న రాముకి ఆరోజున పనేమీ ఇవ్వలేదు మొరటాయన. తోటి పిల్లలు మటుకు, మధ్యలో రహస్యంగా చాలా సార్లు వచ్చి, నవ్వుతూ బొటనవేలు చూపించి, మొరటాయన తమకు తినేందుకు పెట్టినవేవో రాముతో పంచుకొని పోసాగారు.
మరునాడు రాము తన ముళ్ళ పరుపును ఎత్తిపెట్టేసి అందరితోపాటు పనిలోకి దిగాడు. అయినా ఎందుకనో, ఇప్పుడు మొరటాయన రాముని కొట్టటం ఆపేశాడు. 'కొంచెం భయపడుతున్నాడేమో' అనికూడా అనిపించింది రాముకు. మరో రెండు రోజులకు మళ్ళీ రాము మౌన ఉపవాస వ్రతం; ముళ్ళకంప శయనం చేశాడు. ఈసారి మొరటాయన ఎక్కువ సమయం రాము పడుకొని ఉన్న షెడ్డు ముందే తచ్చాడాడు. ఏం చేయాలో తెలీనట్లు వేళ్ళు విరుచుకున్నాడు, గోళ్ళు కొరుక్కున్నాడు. ఆరోజు రాత్రి వీళ్ళుండే చోటికి ఎవరో మరో నలుగురు మనుషులు వచ్చారు. అందరూ వచ్చి 'ముళ్ళపరుపు'ను దూరం నుండే భయభక్తులతో చూసి ఏవో సౌంజ్ఞలు చేసుకొని వెళ్ళారు.
రాము, పిల్లలు నవ్వుకున్నారు; ఆ తర్వాత రెండు రోజులకు ముచ్చటగా మూడోసారి 'మౌన ఉపవాస వ్రతం' మొదలయింది. ఆరోజు సాయంత్రం కల్లా వచ్చి ముళ్ళకంప మీద పడుకున్న రాముని భయ భక్తి యుతంగా చూసారు ఆ నలుగురూ. ఆ తర్వాత మొరటాయనా, వాళ్ళూ ఏవేవో చర్చించుకున్నారు- వింటున్న పిల్లలకు అర్థమైంది- మొరటాయనకు మాటలు వచ్చు! అతను డబ్బులిచ్చి తమను ఆ నలుగురి దగ్గరా కొనుక్కున్నాడు! ఇప్పుడు ఈ ముళ్ళకంప పరుపు పుణ్యమా అని 'తన డబ్బులు తనకు ఇచ్చేసి, పిల్లల్ని తీసుకెళ్ళిపొమ్మ'ని గొడవ పెడుతున్నాడు!
కొద్ది సేపటికి విసురుగా లోనికి వచ్చారు కిడ్నాపర్లు నలుగురూ. రాము దగ్గరున్న ముళ్ళపరుపును తీసి ఎక్కడో దూరంగా పారేసి, బెదిరిస్తూ తెలీని భాషలో ఏదేదో అన్నారు. వాళ్ళతోబాటు కారెక్కి వెళ్ళాడు మొరటాయన- వాళ్ళు అటు వెళ్ళిన మరుక్షణం ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పిల్లలు ఐదుగురూ బయటికి పరుగు పెట్టారు. ఏమంటే మొరటాయన కుక్కల్ని కట్టేసే ఉంచాడు; కంగారులో వాటిని విడచిపెట్టటం మరచాడు మరి!
అక్కడికి దగ్గర్లో అసలొక ఊరంటూ ఉన్నట్లు లేదు. చాలా చాలా దూరం నడిచిన తర్వాత, పిల్లలకు దూరంగా కనబడిన లైట్లు ఊరటనిచ్చాయి. చూడగా అది ఒక హైవే! పిల్లలు ఐదుగురూ అక్కడ నిలబడి వచ్చేపోయే వాహనాలను ఆపేందుకు చేతులు ఊపుతుంటే, హైవే పోలీసు జీపొకటి వచ్చి నిలబడింది వాళ్ళ ముందు.
ఇంకేముంది, పిల్లలు ఐదుగురూ గందరగోళంగా జీపును ఎక్కారు. వాళ్ళ పుణ్యమా అని ఎంతో కాలంగా తప్పించుకొని తిరుగుతున్న మొరటాయన, కిడ్నాపర్లు అందరూ పోలీసుల చేత చిక్కారు!
"ఇంతకీ నీది వజ్ర శరీరమా, రామూ!? ముళ్ళు దిగవా, నీ ఒంట్లో?" రాముని అడిగారు పిల్లలు, పోలీసులు అందరూ. "ఏమీ లేదు; ఓసారి కాలుస్తాం కదా, కంప చెట్ల ముల్లులన్నీ మొనలు పోగొట్టుకొని, చాలా మొండిగా తయారవుతాయి. అవి మన ఒంట్లోకి అంత సులభంగా దిగవు.
అంతే కాదు- మనంఎప్పుడైనా ఒక ముల్లుని తొక్కామనుకోండి, అప్పుడు మన బరువంతా ఆ ముల్లు కొనకే తగులుకొని, అది మన శరీరంలోకి దిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అలాకాక, ఇట్లా ముళ్ళ 'పరుపు' ఒకటి ఉన్నప్పుడు, ఆ ముళ్ళన్నీ కలిసి మన బరువును పంచుకుంటాయి- ఏ ఒక్క ముల్లుమీదా మన శరీరంలో దిగబడగల్గేంత ఒత్తిడి ఏర్పడదు!
అందుకని కొంచెం జాగ్రత్తగా, కదలకుండా పడుకుంటే ఎవరైనా పడుకోవచ్చు ఈ ముళ్ళ పాన్పు మీద! నేను చదివిన మ్యాజిక్ పుస్తకంలో ఉన్నది ఈ మ్యాజిక్" అన్నాడు రాము నవ్వుతూ.