చాలా పూర్!
రాం: నువ్వేమైనా విదేశాలు చూసావా?
వాసు: లేదు. నేను చాలా‌ పూర్!
రాం: అయితే సింగపూర్ వెళ్ళి రావచ్చుగా..?

తెలీదు!
రవి: డ్రైక్లీనింగ్ అంటే ఏంటిరా?
సోమేష్: బట్టల్ని ఉతక్కుండా ఎండలో ఆరబెట్టటం అయ్యింటుందిరా!

వేరేవాడి సమస్య!
విలేకరి: మీకు ఫైటింగ్ సీన్లంటే‌ఎందుకు అంత ఇష్టం?
హీరో: అవన్నీ నేను చేయక్కర్లేదుగా, డూప్ చేస్తాడు, అందుకని!

నరవానరం!
టీచరు: నరుడికి వానరుడికి తేడా‌ఏంటిరా?
విద్యార్థి: 'వా' సార్!

అర్థ తెలివి!
టీచరు: అర్థరాత్రికి వ్యతిరేకపదం ఏంటిరా?
విద్యార్థి: అర్థ పగలు సార్!

నిలువెక్కడ?! హెడ్మాస్టరు గారు: అడ్డగాడిదలు ఎక్కడుంటాయి?
మాస్టారు: కాలేజీలో బ్యాక్ బెంచీలో ఉండి కూస్తుంటాయి!

పుస్తక స్నానం! ఒకసారి వెంగళప్ప వ్యవసాయ అధికారిగా ఉన్న కాలంలో ఆయనకొక ఫోను వచ్చింది:
ఫోనులో‌ వ్యక్తి : మా యింట్లో ఉన్న వ్యవసాయ పుస్తకాలకు బాగా చెదలు పడుతున్నాయి. ఏం చేయమంటారు?
వెంగళప్ప టక్కున జవాబిచ్చాడు: మలాథియాన్ పురుగుమందు వంద మిల్లీ లీటర్లకు గాను నూరు లీటర్లు నీళ్ళు కలిపి పిచికారీ చెయ్యండి!

ముద్రా రాక్షసం!
"ఈసారి పరీక్షల్లో పిల్లలెవ్వరూ జవాబులు వ్రాయలేదు. దానికి కారణం పూర్తిగా ప్రభుత్వం వారిదే” విన్నవించుకు-న్నారు ఓ బడి ప్రధానోపాధ్యాయులవారు.
“ఏమైంది? ఎందుకు రాయలేదు?” అడిగారు డి యీ వో గారు.
“ప్రశ్నపత్రంలో‌ అచ్చు తప్పు పడింది: 'ఈ క్రింది జవాబులకు సరైన ప్రశ్నలు ఇవ్వండి' అని పడింది. పిల్లలందరూ ప్రశ్నలు రాసి బయటికి వచ్చేశారు!” బాధగా చెప్పారు ప్రధానోపాధ్యాయులవారు!”

ఎన్ని పాకెట్లు? రామారావు: మీవాడికి ఎప్పుడూ అంతంత పాకెట్ మనీ ఇస్తుంటావు కదా, వాడు ఏం చేస్తుంటాడు, దాంతో?
సుబ్బారావు: ఏముంది, మరిన్ని పాకెట్లు ఉండే డ్రస్సులు కొనుక్కుంటాడు!

వాస్తు పూజ! రామారావు: మా ఆవిడకి వంట సరిగ్గా రాకపోవటం పెద్ద సమస్యగా ఉందిరా!
సుబ్బారావు: ఏమయిందిరా, టీవీలో వంటల కార్యక్రమాలు ఎక్కువ చూస్తున్నదా?
రామారావు: అట్లా అయితే పర్లేదు; వంటింటి వాస్తు సరిగ్గా లేదని గొడవ చేస్తున్నది!

పోలిక!
సీత: నిన్ను కోతి కరిచిందట గదే, ఏమన్నావు దాన్ని?
సుమతి: దాన్నేం అనలేదే; మా వాడిని తిట్టాను-”కోతిలా చెయ్యకు” అని. అంతే- కోతి పరుగెత్తుకొని వచ్చి నన్ను కరిచి పోయింది!

హైపరాక్టివ్!
నాన్న: చింటూ! నీ మార్కులు సరయినవే అంటావా?
చింటూ: నీకెందుకు నాన్నా, అనుమానం?
నాన్న: ఏం లేదు; మా చిన్నప్పుడు ఎవ్వరికీ‌ నూటికి నూటొక్క మార్కులు వచ్చేవి కాదు...
చింటూ: నేనూ అదే అంటే “నువ్వు 'హైపరాక్టివ్' లేరా, నీకంతే" అన్నది, మా టీచర్!

తెలివి సమస్య! పేషంటు: అన్నం తిన్నాక కొద్ది సేపటికి కడుపు బాగా నొప్పిగా ఉంటోంది డాక్టర్!
డాక్టరు: ఏం లేదమ్మా, గ్యాస్ ప్రాబ్లం అంతే!
పేషంటు: మాకు గ్యాస్ బానే ఉంటుందండీ, రెండు సిలిండర్లు ఉన్నాయి- సమస్య ఏమీ లేదు మరి!

వాస్తవ వాది!
రామారావు: కాశీకి వెళ్ళొచ్చావటగా? కాశీలో ఏం వదిలేశావురా?
సుబ్బారావు: చక్కెర!
రామారావు: అదేంటి, ఏదో పండు వదిలిపెడతారుగా అందరూ?
సుబ్బారావు: ఏం లేదు, నాకు చక్కెర వ్యాధి ఉంది కదా, ఎట్లాగూ తినగూడదని, చక్కెర వదిలేసి వచ్చా, ఎంచక్కా!

ఆఫీసు పక్షి!
సుబ్బారావు ఎప్పుడూ గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. ఓసారి అతనికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు.
దేవుడు: సుబ్బారావూ! నిన్ను నేను స్వర్గానికి తీసుకెళ్తాను ఇవాళ్ళ.
సుబ్బారావు: సరే స్వామీ! ముందుగా ఎంత ఖర్చవుతుందో చెప్పండి.

సాఫ్ట్ వేర్ సంబంధం!
ఇల్లు కట్టిన తెలుగాయన అడిగాడు: 'గేట్స్' కీ, 'విండోస్' కీ ఏం సంబంధం?
కంప్యూటర్ల ప్రపంచంలోని యువకుడు చెప్పాడు: సాఫ్ట్ వేర్ సంబంధం!

లంచావతారం! కుర్ర ఆఫీసరుతో ముసలి అటెండరు చెబుతున్నాడు: "అట్లా బోర్డు పెట్టడం బావోదు సార్! 'బహుమతి లేనిదే లోనికి రాకూడదు' అని బోర్డు రాస్తే మరీ తెగించినట్లు ఉంటుందేమో!” అని.

అజాగ్రత్త!
కొత్తగా ప్రాక్టీసు పెట్టుకున్న సైకియాట్రిస్టు ఉత్సాహంగా‌ ముందుకు వంగి అడిగాడు:
"అయ్యా, మీ సమస్య ఏంటో చెప్పండి!” అని,
పేషంటు: నా ముందున్నవాళ్లను కొరికేద్దామనిపిస్తుందండి!
సైకియాట్రిస్టు: ఆఁ.. ఐతే ఇట్లా నా ప్రక్కకు వచ్చి కూర్చోండి, ముందు ఆ కుర్చీలోంచి లేవండి..