అనగా అనగా ఒక చీమ ఉండేది.

ఎప్పుడూ పనే చేసుకుంటూ ఉండేది అది. ఎండాకాలం అంతా ఆహార సంపాదనలో గడిచిపోయేది. వానాకాలం అంతా అది ఆ ఆహారాన్ని భద్రం చేసుకునేది. ఇక చలికాలం మొత్తం ఆకలిగా తింటూ, నిద్ర మత్తులో ఉండేది. అట్లా అది ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో మునిగిపోయే ఉండేది. అస్సలు బయటి ప్రపంచాన్నే చూసేది కాదు.

ఒకసారి దానికి ఎవరో చెప్పారు- 'ఈ దేశపు రాజుగారు ప్రతి చలికాలంలోనూ ఒక పోటీ‌ పెడతారు. ఆ పోటీలో గెలవటం అంటే మాటలు కాదు. గెలిస్తే మాత్ర్రం ఇంక మన పంట పండినట్లే: జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది. అయితే పోటీలో గెలిచేందుకు చాలా తెలివితేటలు ఉండాలి. ఒక్క తెలివితేటలుంటే చాలదు- చాలా‌ సాధన కూడా అవసరం'.

చీమ వాళ్ళింటికి దగ్గర్లోనే ఒక గడ్డిచిలక (మిడత) ఉండేది. దానికి పాటలంటే చాలా ఇష్టం. వీలు చిక్కిందంటే చాలు, పాడటం మొదలుపెట్టేది. వాన చినుకులన్నా, ప్రొద్దునే చెట్ల ఆకులమీద నిలిచే మంచు బిందువులన్నా దానికి అమితమైన ప్రేమ. కధలంటే- ఇంకేమి, చెవులు కోసుకుంటుంది. ఎన్నెన్ని కథలు చదివిందో లెక్కలేదు. వాళ్ల అమ్మమ్మ దానికి తనెప్పుడో విన్న చీమ-గడ్డిచిలక కథ చెప్పి- "ఒరే, నువ్వు ఏమైనా పాడుకోరా, కానీ చలికాలానికి తిండిని సేకరించి పెట్టుకోవటం మాత్రం మరువకు. మనందరం బద్ధకస్తులమని ఇప్పటికే చెడ్డపేరు వచ్చేసింది. నువ్వే ఆ పేరును తుడిచెయ్యాలి" అంటుండేది.

"నువ్వు చూస్తూండు అవ్వా, రాజుగారు పెట్టే పోటీలో నేను నెగ్గి ఎంత మంచిపేరు సంపాదించి పెడతానో. నాకు మాత్రం లేదా, బాధ్యత!" అంటుండేది గడ్డిచిలక. పోటీకోసమని వాళ్ల నాన్న ఏవేవో పుస్తకాలు తెచ్చిపెడితే, అది వాటినన్నిటినీ త్వరత్వరగా చదివేసి, మళ్ళీ పాటలు, ఆటలు, ఎగరటాలు అన్నీ కొనసాగించేది.

"అప్పుడే చదివేశావా? ఇవేమన్నా కథల పుస్తకాలనుకున్నావా?" అని ఆయన మందలించేవాడు. "నిజం నాన్నా, నాకు వచ్చేసినై, కథల్ని వేగంగా చదివీ చదివీ వేటినైనా వేగంగానే చదువుతున్నాను నేను" అనేది అది.

అంతలో చలికాలం రానే వచ్చింది. రాజుగారు పెట్టే పోటీకి వెళ్ళాయి చీమా, గడ్డిచిలకా రెండూనూ.

చీమ "నేను గెలవాలి-నేను గెలవాలి" అని జపం చేసుకుంటూ, గోళ్ళు కొరుక్కుంటూ, భయం భయంగా నిలబడింది.

గడ్డిచిలక నవ్వుకుంటూ, చిలకపాటలు పాడుకుంటూ‌ కులాసాగా నిలబడింది.

హడావిడిపడి, గందరగోళంపడి పోటీ‌ జరిగే సమయానికి చతికిలబడిపోయింది చీమ.

గడ్డి చిలక ఆడుతూ పాడుతూ పోయి, పోటీలో చక్కగా గెలుచుకొని వచ్చింది.

కాబట్టి, చదువుల్లో హడావిడి, గందరగోళం అవసరం లేదు. ఇష్టంగా, ధైర్యంగా, మెల్లగా, బాధ్యతగా రోజూ చదువుకుంటే చాలు.

ఆటలు ఉంటే చదువులు రావని అనుకోకూడదు. నిజానికి ఆడుతూ పాడుతూ ఉన్న చిలక పిల్లలే బాగా చదువుకునేది.

చదువుల్లోగాని, ఆటపాటల్లోనేగాని- చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోకూడదు. మనందరం కలిసి బ్రతుకుతున్నాం కద, అందుకని ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలి.

పాత కాలంలో చీమలే గొప్పవని అనుకునేవాళ్ళు. గడ్డిచిలకలే గొప్పవనేది ఇవాల్టి మాట.

ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుందాం.

మనందరికీ దారి చూపుతున్న గడ్డిచిలకలకు అభినందనలతో,

కొత్తపల్లి బృందం.