దమనకుడు నోరు మూసుకొని వింటుంటే కరటకుడు కొనసాగించాడు: " నీకు స్వార్థం ఎక్కువైంది. అందుకే ఇంత చేటు తెచ్చావు. రాజును ఏకాకిని చేశావు. సేవకులను ఎవ్వరినీ ఆయన దగ్గరికి రానియ్యవు. ఎవ్వరినీ దగ్గరికి రానివ్వక, అందరి పనులనూ తన నెత్తినే వేసుకొని తిరిగేవాడు చివరికి రాజుకు కూడా శత్రువౌతాడు.

చెడ్డవాళ్ళకు మంచిచేసినవాడు ఏ విధంగా అయితే కష్టాల పాలౌతాడో, అదే విధంగా‌ మంచి వాళ్ళకు కీడు తలపెట్టిన వాడు కూడా- దాని ఫలాన్ని తప్పక అనుభవిస్తాడు.

సేవకుడు తన యజమాని మేలును కోరుకొని, ఆ మేలు కారణంగా తనూ సంపన్నుడైతే, అలాంటి సంపద ఎన్నటికీ తరగదు. అలాకాక యజమానికి కీడు తలపెట్టి సంపాదించినది ఏదీ నిలిచేది కాదు.

కొందరు సగం పాండిత్యం ఉన్నవాళ్ళు- తెలిసీ తెలియక, తమను తాము పండితులుగా భావించుకొని, ఏది మంచో‌ ఏది చెడో‌ నిర్ణయించి చెప్పేస్తుంటారు- గానీ తమ అజ్ఞానాన్ని మాత్రం గుర్తించరు. తాము చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు 'దైవం‌ ప్రతికూలించింది' అని సాకులు చెప్పి తప్పించుకో-జూస్తారు.

అట్లాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పాలని పోయేవాడు, కోతులకు బుద్ధి చెప్పబోయిన పిట్ట లాగా నష్టపోతాడు. నీకు ఆ కథ చెబుతాను, విను:

కోతులు-పిట్ట

హిమాలయ పర్వతాల ప్రాంతంలో చక్కని అడవి ఒకటి ఉండేది. పళ్లతోటీ, పూలతోటీ ఎప్పటికీ నిండుగా ఉండేది, ఆ అడవి. ఒకసారి, చలికాలం వచ్చింది- వాతావరణం బాగా చల్లగా ఉంది; కోతులన్నిటికీ చాలా చలి పెడుతున్నది. ఆ సమయంలో వాటికి మిణుగురు పురుగుల గుంపు ఒకటి కనబడింది.

కోతులన్నీ వాటిని చూసి, నిప్పు దొరికిందని చాలా సంబరపడ్డాయి- ఆ పురుగులను పట్టుకొచ్చి, వాటి చుట్టూ కట్టెలు పోగుచేసి కప్పి పెట్టి, చుట్టూ కూర్చున్నాయి- చలి కాగేందుకు.

వాటికి దగ్గర్లోనే ఉన్నదొక పిట్ట- దాని పేరు సూచీ ముఖం- అది వాటిని చూసి నవ్వింది: "అయ్యో! వెర్రి కోతులారా! ఇవి నిప్పు కణికలు కావు- మిణుగురు పురుగులు. కావలిస్తే చూడండి. అదిగో- అక్కడ- ఆ నల్ల చెట్టు దగ్గర నిజం మంట కానవస్తున్నది. అక్కడికి పోయి చలి కాచుకోండి" అన్నది.

పిట్ట మాటలు వినగానే ఆగుంపులోని కోతికొకదానికి విపరీతమైన కోపం వచ్చింది. "నువ్వా, మాకు చెప్పేది?! మేమేం చెయ్యాలో మాకు తెలీదనుకుంటున్నావా?!" అని అది పిట్టను వెక్కిరించింది. అంతలోనే అది గబుక్కున దాని మీదికి దూకి, దాన్ని పట్టుకొని, నేలకు కొట్టి చంపేసింది.

అలాగ, తెలివిలేని మూర్ఖులకు బుద్ధిమంతులు చెప్పే మాటలు నచ్చవు. ఈ‌ ప్రపంచంలో తియ్యగా మాట్లాడేవాళ్ళు చాలామంది కనబడతారు- మేలు కోరి చెప్పేవాళ్ళే అరుదు. అలా మేలు కోరి చెప్పేవాళ్లకంటే అరుదు, ఆ చెప్పింది వినేవాళ్ళు!

తనమేలుని మాత్రం చూసుకుంటూ ఇతరులకు కీడు తలపెట్టేవాడు తప్పక చెడిపోతాడు.

ఇదివరకు నందిగుప్తుడనే వర్తకుడు సుదర్శన గుప్తుడనే వాడిని మోసగించాలని పోయి డబ్బుతోబాటు తన తండ్రినీ కోల్పోయాడు గద! నీకు ఆ కథ చెబుతాను విను" అని ఇట్లా చెప్పసాగింది.

వర్తకులు

జనావతి అనే పట్టణంలో సుదర్శనగుప్తుడు, నందిగుప్తుడు అనే వ్యాపారులిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు.

ఒకసారి వాళ్ళిద్దరికీ డబ్బు బాగా సంపాదించాలని కోరిక కలిగింది. ఇద్దరూ కలిసి దూర దూరదేశాలు తిరిగి వ్యాపారం చేసారు; కోరినంత డబ్బు సంపాదించారు. ఇక ఇద్దరికీ ఇంటికి తిరిగి వెళ్ళాలనిపించింది.

అలా ఇద్దరూ తిరుగు ప్రయాణం మొదలు పెట్టే ముందు నందిగుప్తుడు సుదర్శన గుప్తుడితో "మిత్రమా, మనం డబ్బు సంపాదించిన సంగతి అందరికీ తెలియటం‌ బాగుండదు. 'ఇదంతా మనం న్యాయంగా సంపాదించిన సొమ్మేకదా, ఎవరికి తెలిస్తే ఏమి?' అనకు. తేనెటీగలు కష్టపడి సంపాదించిన తేనెను మనుషులు జాలి అనేదే లేకుండా తీసేసుకోవటం లేదా? అందుకని మన ఊరికి దగ్గర్లోనే ఎక్కడైనా మన డబ్బును మొత్తాన్నీ భద్రంగా దాచి పెట్టుకొని పోదాం. మళ్ళీ ఎప్పుడైనా డబ్బు అవసరం పడ్డప్పుడు వచ్చి తీసుకొని పోవచ్చు' అన్నాడు. సుదర్శనగుప్తుడు దానికి ఒప్పుకున్నాడు.

ఇద్దరూ తమ డబ్బునంతా ఒక బిందెలో పెట్టి, ఊరి దరి దాపుల్లోకి చేరగానే అక్కడున్న ఒక మర్రిచెట్టు క్రింద, ఎవ్వరూ చూడకుండా గుట్టుగా దాన్ని పాతిపెట్టి, ప్రశాంతంగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.

ఇట్లా కొంతకాలం గడిచాక ఒకరోజున నందిగుప్తుడు రహస్యంగా వెళ్ళి, పాతిపెట్టిన ఆ బిందెను త్రవ్వుకొని వచ్చి, వేరేచోట భద్రంగా దాచుకున్నాడు.

ఆ తర్వాత కొంతకాలానికి అతనే సుదర్శన గుప్తుడితో "ఇంక మనం పోయి మన డబ్బును తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు ఇక అనుమానించాల్సిన పనిలేదు- మన దగ్గర డబ్బేమీ లేదని అందరికీ నమ్మకం‌ఏర్పడింది. ఇకపైన తెలిసినా, వచ్చే నష్టం ఏమీ ఉండదు. మనరాజు మంచివాడు. మన డబ్బు ఇంక ఎక్కడికీ పోదు. పద" అన్నాడు.
ఇద్దరూ పోయి, గుర్తుల ప్రకారం మర్రిచెట్టు క్రింద త్రవ్వి చూస్తే అక్కడ ఏమీ లేదు!

సుదర్శనగుప్తుడు నిర్ఘాంతపోయి, ఏం చెయ్యాలో తెలీక నిల్చుండిపోయాడు. నందిగుప్తుడు మాత్రం గుండెలు బాదుకుంటూ ఏడ్చి, తన ముందు విచారంగా నిలబడి ఉన్న సుదర్శన గుప్తుడిని చూసి "ఓరోరి మిత్రద్రోహీ! ఎంత పని చేశావురా!? ఎప్పుడో ఒంటరిగా వచ్చి డబ్బునంతా ఎత్తుకొని పోయావు; ఇప్పుడు ఏమీ‌ తెలీనివాడిలా నా ముందు విచారాన్ని నటించి, మొత్తం సొమ్మును అప్పనంగా మింగేద్దామని చూస్తున్నావే! మనం ఇక్కడ డబ్బుని దాచిన సంగతి మన ఇద్దరికీ తప్ప వేరే వాళ్లెవ్వరికీ తెలియదు గదరా?! అంత డబ్బుకూ కాళ్ళొచ్చి నడచుకొని పోయాయటరా?! కానివ్వురా, నిన్ను ఊరికే వదులుతాననుకోకు. వాళ్లు వీళ్ళలాగా ఈ నందిగుప్తుడు అంత తేలికగా ఓడిపోయేవాడు కాదు. నా సొమ్ము మొత్తాన్నీ‌ నయాపైసలతో సహా నీచేత క్రక్కించకపోతే నా పేరు నందిగుప్తుడే కాదు" అని కోపం నటిస్తూ మీదికి దూకాడు.

సుదర్శనగుప్తుడు కప్పుకున్న అంగవస్త్రాన్ని దొరకపుచ్చుకొని, మరొకచేత్తో అతని పంచెను లాగుతూ "పద, దివాణానికి నడు! అక్కడగానీ నువ్వు దారికి రావు!" అని లాక్కుపోసాగాడు.

సుదర్శన గుప్తుడికి అతని ఈ ప్రవర్తన చాలా ఎబ్బెట్టుగా తోచింది. అతను మిత్రుడికి సర్దిచెబుతూ "ఆగు- ఊరికే ఎందుకు, నేల విడిచి సాము చేస్తావు? కొంచెం ఆగి ప్రశాంతంగా నేను చెప్పేది విను- ఆ తరువాత నీకు తోచినట్లు చెయ్యి. ముందు నన్ను వదులు" అన్నాడు.

నందిగుప్తుడు ఈ మాటలకు మరింత రెచ్చిపోతూ "నాలిక జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నీకు ఓర్పు ఉంటే ఉండచ్చు గానీ, డబ్బంతా పోగొట్టుకున్న నాకు ఇంక ఓర్పు ఎక్కడినుండి వస్తుంది? అబ్బ! ఇంత చాలదన్నట్లు ఇంకా నీ‌ మాటలు కూడా వినాలేం!? ఇక నిన్ను విడిచేది లేదు. రా, దివాణానికి!" అని లాక్కుపోయాడు.

సుదర్శనగుప్తుడు "నువ్వు రమ్మన్నచోటికి వస్తాను. ముందు నా చెయ్యి వదులు" అని బలవంతంగా చెయ్యి విడిపించుకొని అతని వెంట దివాణానికి పడి పోయాడు.

అక్కడ రాజుగారిముందు నిలబడి నందిగుప్తుడు తను చెప్పదలచుకున్నదంతా ఏకరువు పెట్టాడు. ఆపైన సుదర్శనగుప్తుడు తనవంతుగా "ప్రభూ! అతను చెప్పినట్లు మేం ఇద్దరం డబ్బును దాచిపెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి చూస్తే డబ్బు అక్కడ లేదు. నాకు తెలిసింది ఇంతమాత్రమే- మరే పాపమూ ఎరుగను" అన్నాడు.

రాజుగారు న్యాయాధికారులను రప్పించి వాది-ప్రతివాదులను వాళ్ళకు అప్పగించాడు. "వీళ్ళ తగవును పరిష్కరించండి" అని ఆదేశించారు.

న్యాయాధికారులు వాళ్ళిద్దరి వాదనలనూ విని, నందిగుప్తునితో "అంతా బాగానే ఉన్నది. కానీ నీ ఈ మిత్రుడే డబ్బును త్రవ్వుకొని పోయినట్లు చూసిన సాక్ష్యులు ఉన్నారా, ఎవరైనా ?" అని అడిగారు. "అయ్యలారా! దొంగ అందరికీ తెలిసేట్లు దొంగిలిస్తాడా? మేము డబ్బును పాతిపెట్టిన చోట మర్రి చెట్టు ఒక్కటీ తప్ప, వేరేదేదీ లేదు. అయ్యో! ఇంక నేను సాక్షిని ఎక్కడినుండి తేగలను?" అని ముఖాన్ని దీనంగా పెట్టుకున్నాడు నందిగుప్తుడు.

న్యాయాధికారులు తర్జన భర్జన పడటం చూసి, కొంత సేపయిన తర్వాత అతనే గట్టిగా, అందరికీ‌ వినబడేట్లు "అయ్యా!‌ ఇదిగో, నా ప్రతిజ్ఞను వినండి- నేను నా తల్లిదండ్రుల భక్తుడినే అయితే, కలలోనైనా ఇతరుల వస్తువుల్ని దొంగిలించటానికి ఇష్టపడని సత్యవంతుడినే అయితే, మంచినెంచే స్వభావంగల మీరంతా ఉండగా ఆ మర్రిచెట్టు పలుకుతుంది! స్వయంగా సాక్ష్యం చెప్పి, సత్యం ఏమిటో వివరిస్తుంది!" అన్నాడు ధైర్యంగా.

"ఓహో! ఇతను ఎంతటి మహానుభావుడో గదా, లేకపోతే ఇంతటి శపథాన్ని సామాన్యులు ఎవరైనా ఎలా చేయగలరు?" అనుకున్నారు అక్కడ చేరినవారిలో‌ కొందరు. కొందరేమో "ఊరికే శపథం చేస్తే ఏమౌతుంది, చివరికంటా ఏం జరుగుతుందో చూడకనే ఇది-అది అని తేల్చలేం. నిజమేదో అబద్ధమేదో దేవునికే ఎరుక" అని, ఇంకొందరు "చూస్తుంటే ఇతనే డబ్బుని దొంగిలించి, తన మిత్రుడిపైన నిందమోపి, తను మాత్రం గొప్ప సత్యశీలుడిగా పేరు పొందాలని ఈ ప్రయత్నం‌ఆంతా చేస్తున్నట్లున్నాడు!" అని అనుకున్నారు.

సభలో తలెత్తిన ఈ కలకలాన్ని విన్న న్యాయాధికారులు ముఖాముఖాలు చూసుకొని- "ఇలాంటి శపథం‌ ఇప్పటి వరకూ ఎవ్వరూ చేసిఉండలేదు" అని ముచ్చటించుకుంటూ, వ్యాపారులిద్దరినీ చూసి "సరే, ఈ రోజు చాలా ప్రొద్దు పోయింది. రేపు ఉదయాన్నే రండి; మీ వివాదాన్ని పరిశీలిస్తాం!" అని సభను మరునాటికి వాయిదా వేశారు. అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

ఆరోజు రాత్రి నందిగుప్తుడు తన ఇంటి కిటికీలు, తలుపులు మూసేసి, ఇంటి లోపలి గదిలోకి తన ముసలి తండ్రిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, తను చేసిన దొంగపనితో సహా మొత్తం అతనికి వివరించి "నాన్నా! ఈ లోకంలో ఏది సాధించాలన్నా డబ్బు అవసరం. డబ్బుతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. కులం, చదువు, అందం, గుణం- ఏవి లేకపోయినా సరే, ఒక్క డబ్బు ఉంటేచాలు- ప్రజలందరూ వాడిని 'సర్వ గుణ సంపన్నుడు' అని కీర్తిస్తారు.

అన్ని చెడ్డపనులకూ దారిద్ర్యం ఎలా మూలకారణమో, అన్ని తప్పులూ‌ మాఫీ అయ్యేందుకు డబ్బు అంత అవసరం. ఆ డబ్బును సంపాదించేందుకు చేసే చెడ్డ పనులన్నీ ప్రాయశ్చిత్తం చేసుకుంటే తొలగిపోతాయి- అందుకనే మనిషన్నవాడు 'ఏ విధంగానైనా సరే, డబ్బును సంపాదించాలి' అని పెద్దలు చెబుతారు. ఇదంతా ఆలోచించి చాలా పెద్ద మొత్తాన్ని సంపాదించాను.

చేత చిక్కిన డబ్బును దక్కించుకునే ఉపాయాన్ని దగ్గర పెట్టుకొని, వెర్రిబాగులతనంతో దాన్ని జార విడిచేది ఎందుకు? అందుకని నేను ఒక ఉపాయాన్ని ఆలోచించాను, విను. ఇప్పుడే, ఇంకా తెల్లవారకనే పోయి ఆ మర్రి చెట్టు తొర్రలో వంగి ముడుచుకొని కూర్చో. ఎవ్వరికీ కనబడకు. రేపు తెల్లవారాక, న్యాయాధిపతులు వచ్చి ఆ చెట్టును అడిగినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకు- "ఇక్కడి డబ్బును సుదర్శనగుప్తుడే దొంగిలించాడు" అని గట్టిగా పలుకు- తొర్రలోంచే, బయటికి రాకు! నేను చెప్పింది చెప్పినట్లు ఇంత మాత్రం పలికావంటే చాలు- మన పక్షం గెలుస్తుంది " అన్నాడు.

అప్పుడు వాళ్ళ నాన్న "ఒరే! ఉపాయాన్ని ఆలోచించినప్పుడు రాగల అపాయాన్ని కూడా ఆలోచించాలి. లేకపోతే పిల్లల్ని కాపాడుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్న కొంగలాగా అవుతావు. నీకు ఆ కథ చెబుతాను విను- అని 'ఉపాయం-అపాయం' కథ చెప్పసాగాడు.

(మిగతాది మళ్ళీ..)