ఒక ఊరిలో రొట్టెలు చేసుకుని బ్రతికే ముసలమ్మ ఒకామె ఉండేది.
తనవారంటూ ఎవ్వరూ లేని అమె, ఒక అనాధ పిల్లవాడిని చేరదీసింది.
ప్రతిరోజూ ముసలమ్మ కట్టెల పొయ్యి మీద రొట్టెలు కాల్చేది. ఎప్పుడు రొట్టెలు కాల్చినా ఆమె చేతులు కాలేవి. అది చూసి ఆ పిల్లవాడికి బాధవేసేది.
ఊళ్ళో ముసలమ్మ పొయ్యి సంత జరిగే మైదానానికి దగ్గరలోనే ఉండేది. వారానికోసారి అక్కడ సంత జరిగినప్పుడు ఆమె రొట్టెలు మరిన్ని అమ్ముడయ్యేవి. ఆ రోజు వచ్చిన లాభాలతో అవ్వ వారమంతా నెగ్గుకొచ్చేది.
సంతలో వచ్చే రకరకాల వస్తువులు అమ్ముడయ్యేవి. సంతకు వచ్చిన పిల్లలందరికీ వాళ్ల తల్లిదండ్రులు ఏదో ఒక వస్తువు- తినేందుకో, ఆడుకునేందుకో కొనిపెట్టేవాళ్ళు. అలా వాళ్ళు తమకు నచ్చిన సామాన్లు కొనుక్కోవడం చూసినప్పుడు పిల్లవాడు గమ్మున నిలబడి గమనించేవాడు. వాడి కళ్లలోని బాధ, ఒంటరితనం ముసలమ్మను కలచి వేసేవి.
చూసీ చూసీ ఒకరోజున ఆ ముసలమ్మ తను దాచుకున్న పది రూపాయలు ఆ పిల్లవాడికి ఇచ్చి "ఒరే! వీటితో సంతలో నీకు నచ్చినవి ఏమైనా కొనుక్కో" అన్నది. పిల్లవాడు ముందు కొంచెం సంకోచించి, ఆపైన వాటిని అందుకొని ఉత్సాహంగా సంతకు పరుగుతీశాడు. వాడి కళ్లలో మెరుపును చూసి ముసలమ్మకు చాలా సంతోషమైంది.
అలా వెళ్ళిన పిల్లవాడు పది నిముషాలలో తిరిగి వచ్చాడు. వాడి ముఖం వెలిగిపోతున్నది. చేతుల్ని జేబులో పెట్టుకొని "నేను ఏం కొన్నానో కనుక్కో!" అన్నాడు వాడు.
"ఏమి కొనుక్కున్నావు, చూపించు!" అని చూసింది ముసలమ్మ.
పిల్లవాడి చేతిలో ఒక స్టీలు చిమట ఉన్నది.
"ఇది ఎందుకురా?" అడిగింది ముసలమ్మ.
"రోజూ నువ్వు రొట్టెలు చేస్తున్నప్పుడు నీ చేతులు కాలటంలేదా? దీనితో రొట్టెలు కాలిస్తే చేతులు కాలవు!" అన్నాడు పిల్లవాడు.
ఆనందంతో ముసలమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.