వెంకటంపల్లిలో రవి అనే పిల్లవాడు ఉండేవాడు. వాడి స్నేహితులు కొందరు పట్టణంలో చదువుతున్నవాళ్ళు, వేసవి సెలవులలో వెంకటం పల్లికి వచ్చారు . వాళ్ళు రవి వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వచ్చేసరికి వాడు నర్సరీలో మొక్కలకి నీళ్ళు పడుతున్నాడు.
"ఏమిరా, రవీ! నువ్వేంటీ..ఆడుకోకుండా మొక్కలు పెంచుతున్నావు? వీటిని నేలలో గద, నాటాల్సింది- మరి నువ్వు కవర్లలో పెంచుతున్నావెందుకు?" అడిగారు వాళ్ళు.
"కొన్ని విత్తనాలమీద పెంకు చాలా గట్టిగా ఉంటుంది- చాలా రోజులు వరసగా తేమ తగిలితే తప్ప, అవి మొలకెత్తవు. మరికొన్ని విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి కదా, వాటిని వేరేగా నాటటం కష్టం. అలాంటి మొక్కలన్నిటినీ ఇలా కవర్లలో పెట్టి పెంచుతాం; అవి కొంచెం పెద్దవయ్యేసరికి వానలు పడతాయి- అప్పుడు వాటిని నేలలో ఎక్కడ కావలిస్తే అక్కడ దూరం దూరంగా నాటుకోవచ్చు" వివరించాడు రవి.
"అబ్బ! ఏం తెలివిరా!" మెచ్చుకున్నారు వాళ్ళు.
వాళ్లలో ఒకడికి రవి మట్టి చేతులు నచ్చలేదు. "ఈ చెట్లు ఎందుకు నాటాలిరా, మనకు అంత అవసరమా?" అని అడిగాడు.
రవికి నవ్వు వచ్చింది. "చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయిలేరా, పెద్దయితే తెలుస్తుంది నీకు కూడా. మా బాబాయి కొన్ని రోజుల క్రితం భలే కథ చెప్పాడు ఒకటి. నేను మీకందరికీ ఆ కథ చెబుతాను వినండి- ఒక ఊళ్లో ఒక రాజుగారు ఉన్నారట. ఓసారి ఆ రాజుగారు పొరుగూరికి వెళ్తుంటే బలంగా గాలి మొదలయిందట. అకస్మాత్తుగా ఆయన ముందు రెండు చెట్లు- ఫెళఫెళా విరిగి పడ్డాయి! రాజుగారు ఒక్క అడుగు ముందుకు వేసినా అవి సూటిగా ఆయన మీదికి వచ్చి పడేవి! సమయం బాగుంది- ఆయనకు ఏమీ కాలేదు.
అయితే ఆయనకు చాలా కోపం మాత్రం వచ్చేసింది- తనదారికి చెట్లు అడ్డు పడ్డాయని! వెంటనే ఆజ్ఞలు జారీ చేశారు: "ఇకపైన మన దేశంలో ఒక్క చెట్టుకూడా ఉండకూడదు-నరికేయండి అన్నిటినీ" అని.
ఇంకేముంది? రాజుగారి సైనికులు వచ్చిపడి, ఎక్కడెక్కడో ఉన్న చెట్లనన్నింటిని నరికేశారు. అంతే- మరుసటి సంవత్సరం ఆ రాజ్యంలో భయంకరమైన కరువు మొదలైంది. వానలు లేవు. బావులన్నీ ఎండిపోయాయి. సాగునీరే కాదు- త్రాగేందుకు కూడా నీళ్ళు కరువయ్యాయి. ప్రజలు ఇతర దేశాలకు వలస పోవటం మొదలు పెట్టారు.
ఒక రోజున రాజుగారు మారువేషంలో దేశాటనకు వెళ్ళారు. ఎక్కడ చూసినా ప్రజలు- అందరూ ప్రయాణాల్లో ఉన్నారు! రాజుగారు ఆశ్చర్యపోయారు. వాళ్ళదగ్గరికి వెళ్ళి "బాబూ! ఎక్కడికి వెళ్తున్నారు, మీరంతా?" అని అడిగారు. "మన రాజుగారు చేసిన తిక్క పని వల్ల ఎక్కడా వానలు లేవు; త్రాగేందుకు నీళ్ళు లేవు; పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇక ఈ రాజ్యంలో ఏమి తిని బ్రతకాలి? అందుకే పొరుగు దేశానికి వలస పోతున్నాం" అని చెప్పారు. ఎక్కడ చూసినా అందరూ రాజు గారిని తిడుతూనే ఉన్నారు.
రాజుగారికి తప్పు తెలిసివచ్చింది. తను తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల దేశంలోని ఎందరు పౌరుల జీవితాలు ఇక్కట్ల పాలయ్యాయో తెలిశాక ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది. పొరుగు దేశంనుంచి చెట్లు తెప్పించి దేశమంతా నాటించాడు. ఆ తర్వాత పదేళ్ళకి, చెట్లన్నీ పెరిగి పెద్దవయ్యాక గానీ ఆ రాజ్యం బాగుపడలేదు"
మా బాబాయి ఈ కథ చెప్పాక నాకు అర్థం అయ్యింది- మనం కూడా చెట్లు నాటాలి- మన వంతుగా కొన్ని. అందుకే నేను నర్సరీ మొదలు పెట్టాను. ప్రతిరోజూ కొన్ని చెట్లను నాటుతున్నాను" అని చెప్పాడు రవి.
"మేము కూడా చెట్లునాటుతాం! మా స్నేహితులతో కూడా చెట్లు నాటిస్తాం!" అన్నారు రవి స్నేహితులు. రెండు రోజులు గడిచే సరికి, ఊళ్ళో ఏ పిల్లను చూసినా, ఏ పిల్లవాడిని చూసినా మొక్కలు పెంచే పనే!
"ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు, ఇదేంటిరా వీళ్లంతా ఇట్లాగ?" అని పెద్దవాళ్ళు నవ్వుకున్నారు.
కొందరైతే తమ పిల్లల్ని మొక్కలు నాటద్దన్నారు: "మీరు పట్టణంలో చదువుతున్నారు; మీకు ఎందుకు బాబూ, ఈ పనులన్నీ?" అని.
కానీ పిల్లలు మాత్రం "అమ్మా !'పట్టణంలో పిల్లలు చెట్లు నాటకూడదు; పల్లెటూరి పిల్లలే నాటాలి'అని మీకు ఎవరు చెప్పారు? చెట్లని ఎవరైనా నాటవచ్చు. మన పట్నాలలో ఎంత కాలుష్యం ఉంటోందో చూడండి. అక్కడి గాలి బాగుపడాలంటే ఇంకా ఎన్నో చెట్లు అవసరం కదా? మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఈ పని?" అన్నారు మరిన్ని ప్యాకెట్లలో మట్టిని నింపుతూ.