'అయ్యో, తెలుగు రాదే!', 'నీతిచంద్రిక', 'ధర్మ సంకటం', సుచరిత సేకరించిన 'జోకులు',..ఈ నెల పుస్తకంలో హైలైట్‌లు- అదేవరసలో.
వెనక అట్ట పేజీలోని 'అయ్యో! తెలుగు రాదే!' లోని సంభాషణ ఎంత సుపరిచితంగా అనిపించిందంటే, ప్రతి ఒక్కరం ఆ మాట్లాడుకున్న ఇద్దరు వ్యక్తులలో తప్పకుండా ఎవరో ఒకళ్ళమై ఉంటామేమో! "పాపం! ఇంగ్లీషులో అచ్చేయకపోయారూ!" అని బామ్మగారు జాలిపడిన తీరు చమత్కారంగా నవ్విస్తూనే చురకలు కూడా పెట్టింది.
నీతిచంద్రిక కథనం ఈసారి పదునుగా, చురుకుగా కదం తొక్కింది. ముఖ్యంగా సింహానికీ, సంజీవకుడికీ మధ్య జరిగిన భీకర యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు, రోమాంచితంగా వర్ణించటంలో రచయిత నూటికి నూరు మార్కులు కొట్టేశారు. సంఘటనల పట్ల గంభీరమైన ఆలోచన చెయ్యకుండా, అప్పటికప్పుడు, ఎలాతోస్తే అలా స్పందించే వ్యక్తుల పొగడ్తల్నీ, విమర్శల్నీ ఎలా తీసుకోవాలో పర్తాప్ అగర్వాల్ గారు లోతుగా, బలంగా చెప్పారు. నారాయణ గారి అనువాదం బాగుంది, కానీ కథ చివరలోని గాంభీర్యం పిల్లల స్థాయికి అందదేమో అనిపించింది. మాతృకలో లేకపోయినా, ఉదాహరణలతోగానీ, వివరణతో గానీ చెప్పి ఉంటే బాగుండేదేమో.
జోకులు ఎప్పటికంటే బాగా, హాయిగా నవ్వుకునేలా ఉన్నాయి. కీపిటప్ సుచరితా!
పిల్లల జీవితంలో చదువుకున్న విలువ ఈసారి 'థీమ్ ఆఫ్ ది బుక్' లాగా అనిపించింది. బళ్ళు తెరుస్తున్న నేపథ్యమో, మరి కాకతాళీయమోగాని, ఎక్కువ కథలు ఈ అంశం చుట్టూనే అల్లబడ్డాయి.
నిర్మలాబాయి వ్రాసిన ఐక్యత చదివితే "ఎవరో ఒకరు..ఎప్పుడో అప్పుడు- నడవరా ముందుగా.. అటో, ఇటో, ఎటో వైపు.." అనే మంచి పాట గుర్తుకు వచ్చింది. శైలి బావుంది.
'కుందేలు-తాబేలు' పవన్ చక్కగా వ్రాశాడు. తాబేలు పాత్రని పెద్దగా వర్ణించకుండానే గొప్పగా చిత్రీకరించాడు. ప్రతీకారభావం లేకపోవటం బావుంది.
బడి-పిల్లలు-ప్రకృతి- మూడింటినీ ఎంత అందంగా, ఆప్యాయంగా కలిపారు వెంకట్రావుగారు! రంగుల పువ్వులు పాటని పిల్లల మనసుల్లో పరకాయ ప్రవేశం చేసి వ్రాశారాయన.
ఇక 'జేజిమామయ్య ' రజనీ గారిగురించి చెప్పేంత అర్హత, అనుభవం ఐతే లేవుగానీ, అతి తేలికైన పదాలతో అంత లయబద్ధంగా ఆడుకున్న ఆయన మేధస్సుకీ,ప్రతిభకీ అబ్బురపడటం మాత్రం తప్పదు. 'యక్షగానం, శతపత్ర సుందరి' వంటివి రాసిన కలమేనా, క్వాక్ క్వాక్ అంటూ ఈ పాటని రాసింది?! జేజి మామయ్యకు జేజేలు!
ఇక చంద్రుడికీ మచ్చలున్నట్లు, ఈసారి కొత్తపల్లిలో ఎక్కువ కథలు చదివించటంలో కాస్త వెనకబడ్డట్లు అనిపించింది. బొమ్మల్లో కూడా భావం, జీవం ఇంకా బావుండాలనిపించింది. 54వ పేజీలో ఇచ్చిన కార్టూన్లకు, ప్రక్కనే ఇచ్చిన ప్రశ్నలకు సంబంధం ఉందని డిజైనింగులో అనిపించలేదు! కార్టూన్లలోని అక్షరాలైతే మరీ చిన్నవిగా ఉన్నై. ఈసారి వీటిని సరి చేసుకోవాలి.
సుష్టుగా కథలు భోంచేసి వచ్చేశాం. మళ్ళీ విందు కోసం ఎదురు చూస్తుంటాం.
థాంక్యూ కొత్తపల్లీ!