ఒక ఊరి గుమ్మడికాయ,టమోట,సొరకాయ, క్యారెట్, వాళ్ళలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలనుకున్నాయి.
ఒకరోజు బాగా గొడవపడ్డాయి.
టమోట "నేను ఎర్రగా బుర్రగా ఉంటాను కదా! అందుకని నేనే రాజును" అనింది.
గుమ్మడికాయ "నేను లావుగా, గుండుగా ఉంటాను, కాబట్టి నేనే రాజును" అని అన్నది.
క్యారెట్టు "నేను బాగా చిన్నగా ఉంటాను, కాబట్టి నేనే రాజును" అన్నది.
సొరకాయేమో "నేను బాగా పచ్చగా ఉంటాను, కాబట్టి నేనే రాజును" అనింది.
ఒక మూలన కూర్చొని ఉన్న వంకాయ వచ్చి "ఆగండి! నేను రెండు ప్రశ్నలు అడుగుతాను- చెప్పండి!"అన్నది.
అన్నీ గొడవ పడటం మాని వంకాయ వైపు చూశాయి.
వంకాయ అడిగింది-"రాజు తలపైన ఏముంటుంది ?" అని.
"మాకుతెలుసులే, కిరీటం!" అన్నాయి మిగిలిన కూరగాయలు.
"మరి నా తలపైన ఏముంది?" అడిగింది వంకాయ.
"కిరీటం!" అన్నాయి కూరగాయలు.
"మరైతే ఇంకేమి? నేనే గద, రాజును!" అన్నది వంకాయ.