పిల్లలూ! కాయగూరల్లో 'రాజు'అని దేన్ని అంటారో తెలుసా? వంకాయని! ఆ వంకాయ ఎలా వుంటుందో మీ అందరికి తెలుసు కదా?

కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వంకాయ ఒకప్పుడు ఇలా ఉండేది కాదట- కోడిగుడ్డులా గుండ్రంగా ఉండేదట! పైన తొడిమ కాని , కాడ కాని ఉండేవి కావట! ఐతే మరి దానికి తొడిమ,కాడ ఎలా వచ్చాయి?

అదో పెద్ద గాథ!

అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు.

ఆ రాజుగారు అంటే రాజ్యంలో ప్రజలందరికీ చాలా ఇష్టం.

ఆయన ఒక రోజు కొలువు తీరివున్నాడు.

అంతలో రాజుగారికోసం ఒక బహుమానం తీసుకొని వచ్చాడు ఒక రైతు: "మహారాజా! ఇది నా పొలంలో ఒక చెట్టుకు కాసిన కాయ. దీనిని మన ప్రాంతంలో‌ ఎవరూ చూడలేదు ఇప్పటివరకూ. మొదటగా మీ కోసమే తెచ్చాను" అన్నాడు.

రాజుగారు చాలా సంతోషించారు. రైతుకు బహుమతి ఇచ్చి పంపించారు. కొలువులో ఉన్న శాస్త్రజ్ఞులందరినీ పిలిచారు. ఆ కాయ మీద పరిశోధనలు చేయమన్నారు. అది ఎందుకు పనికి వస్తుందో కనుక్కోమన్నారు.

వాళ్ళు పరిశోధనలు చేసి, అది 'వంకాయ' అని, తినడానికి పనికి వస్తుందని, కూర వండుకుంటే దాని రుచి అమోఘమని తేల్చేసారు.

దానితో ఆ వంకాయ రాజుగారి వంటశాలకు చేరింది.

వంకాయ కూర రాజుగారికి తెగ నచ్చేసింది. రోజూ వంకాయ తీసుకు రమ్మని రైతును ఆజ్ఞాపించారు. రోజూ మధ్యాహ్నంగానీ, రాత్రిగానీ- రాజుగారి భోజనంలో వంకాయ ఉండాల్సిందే.

దానితో రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది: 'రాజుగారు ఇష్టంగా తింటున్న కూరగాయ' అని అందరికీ తెలియాలని, వంకాయ మీద కిరీటాన్ని పెట్టమని అజ్ఞాపించారు. అప్పటినుండి వంకాయకు నెత్తి మీద కిరీటం వచ్చి చేరింది. అదే కాలక్రమేణా తొడిమ అయ్యింది.

అయితే మరి ఆ తొడిమకు కాడ ఎలా వచ్చింది? ఇంకా ఉంది కథ:

అట్లా చాలా రోజులు గడిచాయి గానీ రాజుగారు మాత్రం రోజూ వంకాయ కూరను ఇష్టంగా తింటూనే పోయారు.

ఇంకా చాలా రోజులు గడవగా గడవగా ఇంక ఆయనకు భరించలేనంత కడుపు నొప్పి మొదలైంది.

రాజవైద్యులు ఆయన్ని పరీక్షించి, "కడుపు నొప్పికి కారణం వంకాయను ఎక్కువగా తినడమే" అని తేల్చేసారు.

దాంతో రాజు గారికి వంకాయ మీద ఒళ్ళు మండింది.

తన కడుపు నొప్పికి కారణమైన వంకాయను ఇప్పుడు ఆయన కఠినంగా శిక్షించాలి అనుకున్నాడు.

వెంటనే భటులను పిలిచి వంకాయ నెత్తి మీద మేకు దిగ్గొట్టమని అజ్ఞాపించారు.

రాజుగారు తలచుకుంటే జరగనిది ఏముంది?

దానితో వంకాయ తొడిమ మీదికి మేకులాంటి కాడ వచ్చి చేరింది.

అదన్నమాట, వంకాయ తొడిమ-కాడల కిరీటం కధ!