ఒక రోజు, ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారుతుందనగా, శివుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో శనిదేవుడు వచ్చాడు తన దగ్గరికి. "నేను ఇవాళ్ళ- సాయంత్రం ఆరు గంటలలోపల- నీ నెత్తినెక్కి నా ప్రభావం చూపిస్తాను- అదీ కనీసం 4-5గంటల పాటు!" అన్నాడు.

శివుడికి మెలకువ వచ్చింది- దాంతో పాటు కోపం కూడా. "ఈ శని నన్నేం చేయగలడు? అయినా నేను ఎవరనుకుంటున్నాడు, వీడు? మామూలు ప్రాణులతో ఆడుకున్నట్లు నాతో ఆడుకోగలనననుకుంటున్నాడేమో- ఈసారి వీడికి ఒక మంచి గుణపాఠం లభిస్తుంది- గొప్పవాళ్ళతో‌ పెట్టుకోకూడదని తెలుస్తుంది" అనుకున్నాడు శివుడు. కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ శివుడికి కంగారు ఎక్కువైంది: "శని చిలిపి చేష్ఠల వల్ల ప్రమాదం పెద్దగా ఉండదుగాని, కష్టం మాత్రం బాగానే ఉంటుంది. అందుకని ముందుగానే అన్నిటికీ సిద్ధపడి ఉండటం అవసరం" అనుకున్నాడు.

వెంటనే పార్వతిని స్నేహితుల ఇంటికి ఎక్కడికో పంపించాడు హడావిడిగా. పిల్లలిద్దరినీ‌ బంధువుల ఇళ్లకు పంపించాడు. తన వాహనం-ఎద్దు-ను పశువైద్యుడి దగ్గరికి పంపించాడు.

మరి తను?- తనకోసం కైలాసంలోనే ఒక మూలన, లోతైన గుంతను ఒకదాన్ని త్రవ్వించుకున్నాడు. అనుకున్న సమయానికి కొంచెం ముందుగానే ఆ గుంతలోకి దిగి, లోపల లోతుగా కూర్చొని, పైన మూత పెట్టేసుకున్నాడు. అక్కడ మట్టి అంతా కొంచెం తడి తడిగా, వాసనగా, అసౌకర్యంగా ఉన్నది. అయినా ఆ గుంతలోనే కూర్చొని, శనికోసం ఎదురుచూడటం మొదలు పెట్టాడు శివుడు.

"ఈ శనికి పంతం ఎక్కువ..మాట నెగ్గించుకోవటంకోసం‌ ఏమైనా చెయ్యగలడు వాడు. ఇప్పుడు నన్ను ఏం చేద్దామని అనుకున్నాడో, మరి- చూద్దాం" అనుకుంటూ కూర్చున్నాడు. గంట..రెండు గంటలు..మూడు గంటలు గడిచాయి- అయినా శని జాడలేదు!

శివుడు అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు.."ఏమై ఉంటుంది? శని ఈ చుట్టు ప్రక్కలే ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటాడు. నేను ఇక్కడ దాక్కున్న సంగతి తెలీలేదేమో. లేకపోతే నాతో తలపడేందుకు ధైర్యం చాలట్లేదేమో, పిరికి పందకు!" అనుకున్నాడు.

ఇంకో రెండు గంటలు గడిచాయి- "వట్టి వదరుబోతు! ఎంతలేసి మాటలు మాట్లాడాడు?! ఇప్పుడు వాడి గర్వం పూర్తిగా అణగిపోయి ఉంటుంది. మంచిదేలే, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అర్థం అయి ఉంటుంది కొంచెం. నాతో పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని తెలిసి ఉంటుంది" అనుకున్నాడు.

అంతలో సమయం ఆరు గంటలు అవ్వనే అయ్యింది. శని రానే లేదు! "పిరికివాడు- మాటలన్నీ మూటగట్టుకొని ఏ మారు మూలనో దాక్కొని ఉంటాడు- శివ కోపాగ్నిని ఎదుర్కొంటే ప్రమాదం అని గ్రహించి, ఎక్కడో నక్కి ఉంటాడు, పాపం!" నవ్వుకున్నాడు శివుడు. గుంతలోనుండి బయటికి వచ్చి, మెల్లగా వాళ్ల ఇంటివైపుకు నడవటం మొదలు పెట్టాడు, చిరునవ్వుతో.

అంతలో అక్కడే ఒక చెట్టు క్రింద దర్జాగా కాలుమీద కాలు వేసుకొని పడుకున్న శని కనబడ్డాడు. శివుడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. శివుడిని చూడగానే శని నమస్కారం చేశాడు. శివుడు కులాసాగా నవ్వుతూ అడిగాడు- "ఏమైంది, చిన్నోడా?! నువ్వన్న మాటలు మర్చిపోయావా, లేకపోతే భయపడి వెనక్కి తగ్గావా? అయినా నువ్వు ఇంకాచాలా నేర్చుకోవాల్సింది ఉందిలే- ఎవరినన్నా పీడించాలని అనుకునే ముందు, నువ్వు 'వాళ్లు ఎంత బలవంతులు' అనేది జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి. ఎదుటివాళ్ళ శక్తి సామర్ధ్యాలను తెలుసుకోకుండా ఊరికే బీరాలు పలుకకూడదు- అర్థమైందా? ఈ మాత్రం గుణపాఠం అయితే దొరికింది గద, నీకు!?" అన్నాడు పెద్దమనిషిలాగా. శని గట్టిగా నవ్వాడు. "పరమ శివా! నమస్కారం! నువ్వు వట్టి 'భోళా శంకరుడివి' అని విని ఉన్నాను గానీ, మరీ ఇంత అమాయకుడివని కలలో కూడా ఊహించలేదు.

నేను నిన్ను అన్ని కష్టాల పాలు చేసినా, ఇంకా నువ్వు నా ప్రభావాన్ని గుర్తించనే లేదంటే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నీ భార్యను, పిల్లలను, చివరికి నీ వాహనాన్నికూడా ఎక్కడికో పంపించాల్సి వచ్చింది; నేలలో, అంతలోతు గుంతలో, తడి తడిగా, వాసన వాసనగా ఉండే మారు మూల ప్రదేశంలో- ఒకటి రెండు కాదు- ఆరు గంటల పాటు నక్కి కూర్చోవాల్సి వచ్చింది! ఇదంతా నా ప్రభావం వల్ల కాకుంటే మరి దేనివల్ల?!

మిత్రమా, నిన్ను చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలీటం లేదు నాకు. పట్టణాల్లోను, నగరాల్లోను, ఆ ఘోరమైన- మురికి, దుర్వాసన, ఇరుకు కూపాల మధ్యన పడి బ్రతుకుతూ, అయినా తమకు కార్లు ఉన్నాయనీ, ఎయిర్ కండిషనర్లు ఉన్నాయనీ, టివిలున్నాయనీ సంబరపడుతూ, తమను తాము అదృష్టవంతులుగా భావించుకునే వెర్రి మనుషులకంటే నువ్వూ ఏమంత తెలివైన వాడివి కావని నాకు అర్థమైంది. కానియ్యి స్వామీ, ఏం చేస్తాం?" అన్నాడు శని, ఎగతాళిగా నిట్టూరుస్తూ.