అనగా అనగా అమరాపురానికి దగ్గరలో అమరావతి దేవాలయం ఉండేది. ఆ గుడికి వెళ్ళాలంటే ఎవరైనా ఒక అడవిని దాటి వెళ్ళాల్సిందే.

గుడికి వెళ్ళే కాలిబాటకు దగ్గరలోనే ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టులో నివసించేవి, రెండు అల్లరి దయ్యాలు. వాటి అల్లరికి అంతులేదు: గుడికి వెళ్ళే వాళ్ళని అవి చాలా అల్లరి పెట్టేవి. ఆడవాళ్ళకు జుట్టుకత్తిరించేవి; మగవాళ్ళకు వెంట్రుకలు లేకుండా గుండు చేసేవి. వాళ్ళు కంగారు పడుతుంటే చూసి, వికవికా నవ్వి భయపెట్టేవి.

ఎలాగైనా వాటిని వదిలించుకోవాలని చుట్టు ప్రక్కల గ్రామాల్లో వాళ్లంతా కలిసి రకరకాల మంత్రగాళ్ళను పిలిపించారు. కానీ అవి రెండూ ఎవ్వరికీ చిక్కలేదు. ప్రతివాడూ వాటి అల్లరిని భరించలేక పారిపోయేవాడే.

అమరాపురంలో నివసించే చిట్టిబాబు చాలా తెలివైనవాడు. వాడి తెలివిని చూసి స్నేహితులందరూ "ఒరే! నీ తెలివిని మామీద కాదురా, అమరావతి గుడి దగ్గరున్న దయ్యాలమీద ప్రయోగించి వాటిని వెళ్ళగొట్టు చూద్దాం" అనటం మొదలు పెట్టారు. ఆలోచించగా వాడికి అదీ మంచిదేననిపించింది. ఎలాగైనా ఆ దయ్యాలను రెండింటినీ‌ పారద్రోలి తన తెలివితేటల్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాడు.

వెంటనే ఒక చిన్న పెట్టెని తీసుకుని గుడి దగ్గరికి బయలుదేరాడు చిట్టిబాబు. కాలిబాటన నడుస్తూ "ఇంకా రాలేదే! ఈ తెలివిలేని దయ్యాలు ఇంకా రాలేదే!" అనుకుంటూ పోతున్నాడు. దూరం నుండే వాడిని చూసి దయ్యాలు రెండూ చాలా సంబరపడ్డాయి. మర్రి చెట్టు ఊడల్ని పట్టుకొని ఊగి ఊగి ఉత్సాహంగా కేకలు పెట్టాయి. చిట్టిబాబుకి వాటిని చూస్తే ఏమాత్రం భయం వెయ్యలేదు సరికదా చాలా నవ్వు వచ్చింది. కాలి బాటను వదిలి నేరుగా ఆ దయ్యాలున్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు.

దయ్యాలు రెండూ మర్రి ఊడల్ని వదిలేసి వాడి దగ్గరికి వచ్చాయి కత్తెరలు, దువ్వెనలు చేతబట్టుకొని. "ఓహో ఓహో! బుజ్జిబాబు వచ్చాడే, గుండు చేయించుకోటానికి! నీకు ఏ రంగు దువ్వెన కావాలి నాన్నా?" అంది ఒక దయ్యం ఇకిలిస్తూ.

"నేను బుజ్జిబాబును కాదు- చిట్టిబాబును!" అన్నాడు చిట్టిబాబు. "అయినా బాగుందే, మీపని! నాకు గుండు ఇష్టం ఉండదమ్మా; చక్కగా క్రాపు చెయ్యండి చాలు" అని నవ్వాడు.

"ఓయ్! ఓయ్! మేం మా స్నేహితులందరికీ గుండే చేస్తాం చిట్టీ! నీకూ అదే ప్రాప్తి"అన్నది రెండో దయ్యం చాకును ఝుళిపిస్తూ.

చిట్టిబాబు "అయ్యయ్యో! చూస్తుంటే నీ తెలివంతా అడుగంటి పోతున్నట్లున్నది. నాకు క్రాపు చేసేందుకు నీకెందుకంత తొందర? శ్శ్..ఆగు నేస్తం! మనం స్నేహితులం. నేను వచ్చిన పని వేరు. ఊరికే గుడికి పోతున్నాననుకున్నారా? కానే కాదు. ముందు నేను మీకు ఒక పోటీ పెడతాను. దానిలో ఎవరు గెలిస్తే వారికి బహుమానం ఇస్తాను" అని చెప్పాడు. దయ్యాలు రెండింటికీ బహుమానం అనగానే ఆశ పుట్టింది. "ఏంటా పోటీ?" అన్నాయి రెండూ ఒకే గొంతుతో.

ఆ కొండ మీదికి ఒక్క గెంతు గెంతాలి- ఎవరు ముందు గెంతితే వాళ్లకే బహుమతి" అన్నాడు చిట్టి బాబు. దయ్యాలు రెండూ ఒక్క గెంతులో కొండ మీదికి గెంతేసాయి. మరొక్క గెంతులో వెనక్కి వచ్చేశాయి. "మేం ఇద్దరమూ ఒకే సారి గెంతేసాము! ఇద్దరిదీ బహుమతి!" అన్నాయి ఉత్సాహంగా.

"అట్లా కుదరదమ్మా! ఒక్కరికే బహుమతి! ఒకళ్ళే గెలిచేటట్లు వేరే పోటీ ఏదైనా పెట్టాలి మీకు" అన్నాడు చిట్టిబాబు. "తొందరగా పెట్టెయ్! తొందరగా పోటీ పెట్టెయ్!" అన్నాయి దయ్యాలు రెండూ గబగబా.

చిట్టిబాబు కొంచెం సేపు ఆలోచించినట్లు నటించి "సరే! మీ ఇద్దరిలో ఎవరు ముందుగా ఈ అడవి చివరికంటా వెళ్లొచ్చి నన్ను ముట్టుకుంటారో వాళ్లదే బహుమానం" అన్నాడు.

మరుక్షణం అవి రెండూ మాయమయ్యాయి. ఇంకో క్షణానికల్లా తిరిగి ప్రత్యక్షమయ్యాయి. చిట్టిబాబుని పట్టుకొని "మళ్ళీ ఇద్దరం గెలిచాం! ఇద్దరం ఒకేసారి అడవి చివరికి వెళ్ళొచ్చాం!" అన్నాయి.

"సరే ఆగండి. నేను ఆలోచించాను- ఈసారి పోటీ పెద్దది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు" అన్నాడు చిట్టిబాబు . "ఈ పోటీలు బాగున్నాయ్! తొందరగా చెప్పు! ఏమిటా పోటీ, ఈసారి?" అన్నాయి దయ్యాలు కుతూహలంగా.

"మీరు ఇద్దరూ ఈ పెట్టెలోకి పోయి కూర్చోవాలి. బయటికి రాకుండా ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటే వాళ్ళది, బహుమానం!" అన్నాడు చిట్టిబాబు. "ఓస్! ఇదీ ఒక పోటీయేనా!?" అని మరుక్షణం దయ్యాలు రెండూ ఒకే సారి పెట్టెలోకి దూరి కూర్చున్నాయి.

చిట్టిబాబు వెంటనే ఆ పెట్టెకు మూత పెట్టి తాళం వేసేశాడు. ఊరి జనాలందరికీ దయ్యాల్ని బంధించిన పెట్టెను చూపించాడు. పెద్ద గొయ్యి తవ్వించి, పెట్టెను అందులో పెట్టి, మన్నుతో కప్పేశాడు.

అయితే ఈ సంగతి ఏమాత్రం తెలీదు దయ్యాలకు. అవి రెండూ పంతం కొద్దీ పెట్టె లోపలే కూర్చొని ఉన్నాయి ఇంకా. ఎవరైనా గొయ్యిని తవ్వి, పెట్టె మూత తెరచినా అవి మాత్రం బయటికి వచ్చేట్లు లేవు. బహుమానం అంటే అంత మోజైంది మరి! ముందు బయటికి వచ్చినవాళ్ళు ఓడిపోతారు గద!

దయ్యాల బెడద వదిలిందని జనాలందరూ సంతోషపడ్డారు. చిట్టిబాబు తెలివికి ఎక్కడలేని పేరూ వచ్చింది. అమరావతి గుడికి వెళ్ళే వాళ్లకు బలవంతపు గుండ్ల మోత తప్పింది!