ఒక రాజుకు ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు. ఇద్దరూ ఆడపిల్లలు.
ఒక రోజున గాలి పెద్దగా వచ్చింది. కవల పిల్లలిద్దరూ గాలికి కొట్టుకు పోయారు. రాజు ఎంత వెతికించినా వాళ్ళిద్దరూ ఇంక దొరకనేలేదు.
తర్వాత రాజుకు మళ్ళీ‌ ఒక కొడుకు పుట్టాడు. చాలా విద్యలు నేర్చుకున్నాడు వాడు.
వాడు పెద్దయినాక, ఒక రోజున రాజు వాడికి వాడి అక్కల గురించి చెప్పాడు. అది వింటూనే వాడు తన అక్కలను వెతికేందుకు బయలుదేరాడు.
వెతుకుతూ వెతుకుతూ ఆ రాజకుమారుడు ఒక అడవికి చేరుకున్నాడు. అక్కడ ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసెలోకి వెళ్ళి చూస్తే ఒక ముసలమ్మ కనిపించింది, పొయ్యిలోకి గాలి ఊదుతూ. రాజకుమారుడు వెళ్ళి అవ్వకు పొయ్యి వెలిగించి పెట్టాడు.
ముసలమ్మ వాడిని అడిగింది "నువ్వెవరు, ఇక్కడికెందుకొచ్చావు?" అని. వాడు ముసలమ్మకు విషయమంతా చెప్పేశాడు.
"ఓహో వాళ్ళేనా నీ అక్కలు! వాళ్లని ఎత్తుకెళ్ళింది ఒక రాక్షసుడు. సుడిగాలి రూపంలో వచ్చి వాళ్లను ఎత్తుకెళ్లాడు, పెంచుకునేందుకు. ఇట్లే కొంచెం ముందుకి వెళ్ళావంటే వాడి ఇల్లు కనబడుతుంది. నీ తెలివి బాగా ఉపయోగించి నీ అక్కల్ని వెనక్కి తెచ్చుకోపో!" అని ముసలమ్మ యువకుడికి చెప్పింది. అది వింటూనే చాలా ఉషారుగా రాక్షసుడి ఇంటికి నడుచుకుంటూ పోయాడు రాజకుమారుడు.
వీడు వెళ్ళేటప్పటికి రాక్షసుడు తన ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. రాజ-కుమారుడిని చూసి "నువ్వెవరు రా!" అని గర్జిస్తూ అడిగాడు. రాజకుమారుడు భయపడలేదు. "నేను రాజకుమారుడిని రా!" అని అరిచాడు గట్టిగా.
"నువ్వెందుకొచ్చావిక్కడకి ?"అని ఇంకోసారి గట్టిగా అరిచాడు రాక్షసుడు.
"నా అక్కల కోసం వచ్చానోయ్, నీకేం కష్టం?!" అని రాక్షసుడి మీసం పట్టుకొని గిర గిర తిప్పి విసిరేశాడు రాజకుమారుడు. ఆ దెబ్బకు రాక్షసుడు దూరంగా వెళ్ళి పడ్డాడు.
అప్పుడు రాక్షసుడు గట్టిగా పోరాడటానికి ప్రయత్నించాడు. వాడికి, రాజకుమారుడికి పెద్దగా యుద్ధం జరిగింది. చివరికి రాక్షసుడు కాస్తా చచ్చి పడిపోయాడు.
అప్పుడు రాజకుమారుడు రాక్షసుడి ఇంటిలోపలికి వెళ్ళి చూశాడు. వాళ్ల అక్కలు అక్కడే ఉన్నారు. అక్కలను తీసుకొని రాజ్యానికి వెళ్ళాడు రాజకుమారుడు.
అందరూ చాలా సంతోషపడ్డారు.