అనగనగా ఒక ఒకటో తరగతి అయ్యవారు.
ఆ అయ్యవారి తరగతిలో అరవై మంది.
అందులో ఒక అబ్దుల్లా ఆ పూట బడికి రాలేదు.
అబ్దుల్లా అబ్దుల్లా, ప్రొద్దున రాలేదెందుకు?
అమ్మ అన్నం వండలేదు సార్!
అమ్మా అమ్మా , ఎందుకు వండలేదు?
ఆయన బియ్యం తేలేదు.
ఆయనా ఆయనా, ఎందుకు తేలేదు?
ఆఫీసులో జీతం ఇవ్వలేదు.
ఆఫీసూ ఆఫీసూ ఎందుకియ్యలేదు?
ఆర్థిక దుస్థితి! ఆర్థిక దుస్థితి!!
ఆర్థిక దుస్థితీ, ఆర్థిక దుస్థితీ- ఎందుకేర్పడినావు?
అందుకు సమాధానం దేశాన్ని ఏలే దేశాయినడుగు.
దేశాయీ, దేశాయీ ఇందుకు నీ సమాధానమేమి?
అందుకు సమాధానం ఇదివరకటి ఇందిరమ్మనడుగు.
ఇందిరమ్మా ఇందిరమ్మా, ఇందుకు నీ సమాధానమేమి?
అందుకు సమాధానం నా రెక్కలు విరగ్గొట్టి మూలపడేసిన మూఢ ఓటరునడుగు.
ఓటరూ ఓటరూ, ఎందుకు విరగ్గొట్టినావు?
నా బంగారు నోటిని లాకప్పు చేస్తే విరగ్గొట్టక ఊరుకుంటానా?