విజయపురి రాజు విక్రమసింహుడికి తన ప్రజలు చాలా విజ్ఞులనీ, తెలివైనవాళ్లనీ నమ్మకం ఉండేది.
ఒకమారు ఆయన బాల్యమిత్రుడు ఆనందభూపతిని కలసినపుడు, మాటల సందర్భంలో "మా ప్రజలు చాలా తెలివైన వాళ్లు, విజ్ఞులు కూడా. అందువలన మాకు మా ప్రజల గురించిన చింత ఏమాత్రం లేదు. వాళ్లు మోసపోడం జరగని పని. ఏ పని చేసినా బాగా తర్కించి చేస్తారు..." అన్నాడు .
"విక్రమా! ప్రజలు ఎంతతెలివైన వారైనా, ప్రతి పనినీ తర్కించి చేస్తారనడం సమంజసంకాదు. ప్రజలు ఎల్లప్పుడూ తమ ఇరుగు పొరుగులను అనుసరిస్తారు. ఇక తమ ప్రభువును అనుసరించడంలోనైతే వాళ్ళు అసలు ఏమీ ఆలోచించరనే చెప్పాలి" అన్నాడు ఆనందభూపతి .
"కాదు ఆనందా! మా ప్రజల విషయంలో అది జరుగదు. వారు వెఱ్ఱిగా ఏమీ అనుసరించరు" అన్నాడు విక్రమసింహుడు, కొంచెం గట్టిగా.
విక్రమసింహుడిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేని ఆనందభూపతి మాట మారుస్తూ "సరే! మిత్రమా, రా! మా ఉద్యానవనం దర్శించుదువుగాని!" అంటూ మిత్రుడిని తమ ఉద్యానవనానికి తీసుకెళ్ళాడు.
వాటి సౌందర్యం చూసి మురిసిపోయిన విక్రమసింహుడు ఆశ్చర్యంతో "ఇంత అందమైన వింత వింత పుష్పాలు, ఇన్ని రకాల ఫలాలు ఎట్లా పండించగలుగుతున్నారు మీరు?! మీ తోటమాలితో నేను మాట్లావచ్చా?" అన్నాడు.
"తప్పక మాట్లాడచ్చు మిత్రమా!-ఎవరక్కడ ? మన ప్రధాన తోటమాలి 'పరమేశు'ని పిలవండి .." ఆజ్ఞాపించాడు ఆనందభూపతి.
రాజాజ్ఞ అందినవెంటనే పరమేశుడు పరుగు పరుగున వచ్చాడు."ప్రభూ ! వందనం " అని వినయంగా చేతులుకట్టుకుని నిల్చాడు.
"పరమేశూ! మన ఉద్యానవనపు అందచందాలు మా బాల్యమిత్రుని మనస్సు దోచుకున్నాయి. ఇంత చక్కని ఫల- పుష్పాలను ఎలా సృజిస్తున్నారని ఆసక్తి చూపగా నిన్ను పిలిచాం" అన్నారు ఆనంద భూపతులవారు అతనితో.
"ప్రభువులకు వందనాలు. హిమాలయాల- నుండి వచ్చిన ఋషీశ్వరులు ఒకరు మా ఉద్యానవనంలో ఆ మధ్య ఒక హిమవన్నగశిలను ప్రతిష్టించారు. దాని ప్రభావంవల్ల మా ఉద్యానవనం నిత్య నూతనమై, రకరకాల ఫలాలను, వింత వింత పుష్పాలను అందిస్తున్నది. ఆ ఋషీశ్వరులు రానున్న ఏకాదశి నాడు మా నగరికి తిరిగి విచ్చేస్తున్నారు. ప్రభూ! ఇబ్బందేం లేదు. ఆ ఋషీశ్వరులు రాగానే తమ రాజ్య ప్రజల కోసం కూడా ఒక హిమవన్నగ శిలను తెచ్చి, తమ రాచనగరు నడిబొడ్డున నాటి, తమకు విన్నవించుకుంటాను; మా ప్రభువులవారు అనుమతిస్తే" మనవి చేశాడు పరమేశుడు.
"అవశ్యం వెళ్దువు. ఏకాదశి రాగానే ఆ హిమవన్నగ శిలను మా మిత్రుని నగరం నడిబొడ్డున నీవే ప్రతిష్ఠించి, ఆ సంగతి వారికి మనవి చేసిరా. -పద మిత్రమా ! భోజన సమయం అయ్యింది- మనం వెళ్ళి భుజిద్దాం" అంటూ రాజ మందిరంలోకి దారితీశాడు ఆనందభూపతి.
కొన్ని రోజులు గడిచాక, ఒకనాటి ప్రాతః కాలంలో విక్రమసింహుని ఆంతరంగిక సేవకుడు ఆయన దగ్గరకు వచ్చి- "ప్రభువులకు అభివాదం! ఎవరో ఆనందభూపతులవారి ఉద్యానవనానికి ప్రధాన తోటమాలియట! మన నగరం నడిబొడ్డున ఉన్న కూడలిలో 'హిమవన్నగ శిల ' అంటూ ఒక రాతిని ప్రతిష్ఠించాడు! మన సైనికులు అతనిని అడ్డగించబోగా తమరి అనుమతి పత్రం చూపాడట. ఆ పైన మంత్రిగారిని కలిసి వారికి ఆ శిల సంగతి విన్నవించుకుని వెళ్ళాడు" అని చెప్పాడు.
విక్రమసింహుడు త్వరగా తయారై వెళ్ళి, నాల్గు వీధుల కూడలిలోని ఆ హిమవన్నగ శిలను దర్శించుకుని వచ్చాడు. అది తెల్లని కాంతులీనుతూ, గుమ్మడి పండులా గుండ్రంగా, ఎంతో ముచ్చటగా ఉంది. విక్రమసింహుడు దాన్ని చేత్తో ముట్టుకుని, తట్టి, దాని అందానికి మురిసి -కొంతసేపు నిల్చి చూసి , తన మందిరానికి తిరిగి వెళ్ళాడు.
ఆ సాయంకాలం రాణిగారు తన పరివారంతో వచ్చి ఆ శిలను దర్శించారు. వారు కూడా దానిని ముట్టి , తట్టి, దాని గట్టిదనాన్ని చూసి , కొంతసేపు దాని ఎదుట ప్రశాంతంగా తలవాల్చి నిల్చి వెళ్ళారు.
దాంతో ఇక దర్శనార్థుల ప్రవాహం మొదలైంది. అందరూ "ఇది నిజంగా చాలా మహిమాన్వితమైన శిలయే! లేకపోతే మహారాజేగాక , మహారాణి సైతం అంతఃపురం నుండి వచ్చి దర్శించి వెళతారా!?" అనటం మొదలు పెట్టారు. ప్రతిఒక్కరూ వచ్చి, దాన్ని తట్టి, తాకి, ఎదుట కొంత సేపు నిలబడి వెళ్ళసాగారు.
ఒక వారం రోజుల్లో ఆ శిల మహత్తును గురించిన కథలు దేశమంతటా వినిపించ సాగాయి. జనం తండోపతండాలుగా కదలి రాసాగారు. కొందరు "ఆ శిలను ముట్టగానే మా జ్వరం తగ్గిందంటే , మరొకరు నాతలనొప్పి తగ్గిందనీ, మరొకరు పిల్లలు లేని మా కోడలికి బిడ్డడు పుట్టాడనీ , మాకు పంట బాగా పండిందనీ , మాకు వ్యాపారం కలసి వచ్చి లాభాల పంట పండిందనీ .." ఇట్లా రకరకాలుగా చెప్పుకోసాగారు.
ఇలా నెలరోజులు గడిచాయి. అంతలో ఆనందభూపతులవారు నగరానికి విచ్చేస్తున్నట్లు వార్త వచ్చింది. ఆయనకు ఎదురువెళ్ళి ఆహ్వానించేందుకు ప్రధాన ద్వారం వద్దకు బయల్దేరాడు విక్రమసింహుడు.
ఐతే నాల్గు వీధుల కూడలి దగ్గర ఎంత రద్దీగా ఉందంటే, దాన్ని దాటి వెళ్ళేందుకు రధానికి దారి లేదు- ఆ హిమవన్నగ శిల వద్ద బారులు తీరి నిలబడి ఉన్నది అశేష జన వాహిని! ఒక్కరొక్కరుగా దాన్ని తాకి నమస్కరించే అవకాశంకోసం ఎదురు చూస్తున్నారు అందరూ! ఇంతలో ఆనంద భూపతులవారు రానే వచ్చారు.
"మిత్రమా ఆనందా! మన్నించాలి , మిమ్మల్ని ద్వారంవద్దే ఆహ్వానించాలని బయల్దేరాను. కానీ ఈ జనసంద్రాన్ని చూశారు కదా, నాకు ముందుకు కదిలే అవకాశమే లభించలేదు" అంటూ ఆహ్వానించాడు విక్రమసిం హుడు.
బావుంది మిత్రమా! మన మధ్య ఈ మన్నింపులేంటి? ఇంతకూ ఈ జనమంతా ఎందుకోసం ఈ బారులు తీరినట్లు?"అని అడిగిన ఆనందభూపతితో "మిత్రమా! ఇదంతా నీ చలవే సుమా! ఈ హిమవన్నగశిల వచ్చాక మాప్రజలందరూ అత్యంత సుఖ శాంతులతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నారు. కృతజ్ఞతా భావంతో వారంతా ఆ శిలను ముట్టి, నమస్కరించుకుని వెళుతుంటారు" చెప్పాడు విక్రమసిం హుడు.
"మిత్రమా విక్రమా! మీరు మరోలా భావించకుంటే, నన్ను మన్నించానంటే ఒక విషయం బయల్పరుస్తాను.."
"అలా అనకండి ఆనందా! మనం మంచి మిత్రులం. మనమధ్య అంతరాలే ఉండవు.."
"ఏం లేదు విక్రమా, గుర్తు తెచ్చుకోండి- మీరు మా నగరానికి వచ్చినపుడు ఏమన్నారో! మీ ప్రజలు విజ్ఞులనీ, ఏ పనైనా తర్కించిచేస్తారనీ అన్నారు మీరు. నిజానికి అసలు ఇది హిమవన్నగ శిలే కాదు- మా శిల్పులు పాలరాతితో చెక్కిన రాయి ఇది. మీరు దాన్ని చూసి తట్టగానే, ప్రజలందరూ కూడా దీన్ని మహిమగల శిలగా భావించి నమస్కరించడం మొదలెట్టారు, చూశారు గద! ఐతే వాళ్ళు సహృదయులు, కష్టించి పని చేసేవారూ గనుక వారి కోరికలన్నీ తీరుతున్నాయి- అంతే. ప్రజలు ప్రభువును అనుసరిస్తారే తప్ప, వారి విజ్ఞతను కాదు. మన్నించండి- ఇది నేటి ప్రజల నైజాన్ని తెల్సుకునేందుకుగాను మేం చేసిన చిన్న పరిశోధనే తప్ప, మరేమీ కాదు. అన్యథా భావించకండి- మన స్నేహానికి దెబ్బ రానివ్వకండి " అంటూ చేతులు కలిపాడు ఆనందభూపతి.
"నిజమే, మిత్రమా! ప్రజలు పాలకులను సంకోచం లేకుండా అనుకరిస్తుంటారు. అందువల్లనే ప్రభువులకు మచ్చలేని వ్యక్తిత్వం అవసరం" మనసారా అంగీకరిస్తూ అన్నాడు విక్రమసిం హుడు .