కొత్తపల్లిలో దేవి అనే పాప ఉండేది. దేవికి ఒక స్నేహితురాలు ఉండేది. ఆమె పేరు అనసూయ. వాళ్లిద్దరూ బడిలో చక్కగా చదువుకునే వాళ్లు. వాళ్లంటే టీచర్లందరికీ కూడా చాలా అభిమానం.

ఒక రోజున దేవి, అనసూయ బడికి వెళుతున్నారు. అనుకోకుండా అనసూయ జారి పడిపోయింది. రాతి నేల కావటంవల్లనేమో, ఆమెకు చాలా దెబ్బలు తగిలాయి. స్పృహ కోల్పోయింది. దేవి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనసూయకు స్పృహ వచ్చిన తరువాత దేవి ఆమెకు ధైర్యం చెప్పింది. "నీకు తొందరగా బాగవుతుంది, నువ్వేమీ భయపడవద్దు" అన్నది. కొద్ది రోజులకు అనసూయ కోలుకున్నది. మళ్లీ మామూలుగానే వాళ్లిద్దరూ కలసి స్కూలుకు వెళ్లసాగారు. అయితే ఈ‌అనుభవం కారణంగా వాళ్ళ స్నేహం మరింత బలపడింది.

ఒక రోజు బడి వార్షికోత్సవం జరుగుతోంది. దేవి, అనసూయ కలసి పాట పాడారు. ఆ తర్వాత పరుగు పందెంలో‌ పాల్గొన్నది దేవి. అనసూయ ట్రాకు పక్కనే కూర్చొని ఉత్సాహంగా చూస్తున్నది. చురుకుగా పరుగెత్తే దేవి ఇప్పుడు అందరి కంటే ముందుగా పరుగెడుతోంది. దేవి గెలుస్తుందన్న సంతోషంతో అనసూయ చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ 'ఇంకా జోరుగా పరుగెత్తు! నువ్వే గెలుస్తావ్! నువ్వే గెలవాలి!' అంటూ అరుస్తోంది. దేవి గెలవాలని మనసులోనే దేవుడికి మొక్కుకుంటోంది. 'దేవుడా, దేవుడా! మా దేవినే గెలిపించు! దేవిని గెలిపించు స్వామీ!' అని వేడుకుంటోంది.

అది 400 మీట ర్ల పరుగు పందెం. దేవి 300 మీటర్ల పైగానే పూర్తి చేసింది. ఆమే ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు. అనసూయ సంతోషంతో గాలిలో తేలిపోతోంది. 350 మీటర్లు పూర్తి చేసేసరికి మిగిలిన వాళ్లను ఇంకా దూరంగా పెట్టేసింది. అందరూ "దేవి! దేవి!" అని అరుస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉంది వాతావరణం.

ఇంతలో దేవి వెనక దబ్బుమని శబ్దం వచ్చింది. పరుగెత్తుతూనే వెనకకు తిరిగి చూసింది దేవి. తన వెనకాల పరుగెడుతున్న అమ్మాయి కాలు ఏదో రాయికి దొందురు-కొన్నట్లుంది: ఎదురు దెబ్బ తగిలి ఆ అమ్మాయి పడిపోయింది. మరుక్షణం దేవి ఆగిపోయింది. ఆ పాపను లేవనెత్తేందుకని వెనక్కు తిరిగింది.

బయట కూర్చొని ప్రోత్సహిస్తున్న అనసూయకు కోపం వచ్చింది. 'దేవీ!‌నువ్వు పరుగెత్తు! వెనక్కు తిరగొద్దు! వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు. నిన్ను దాటి పోతారు ' అని అరుస్తోంది. అనసూయలాగే ఇంకొందరు దేవి అభిమానులు కూడా ఇలాగే అరుస్తున్నారు.

దేవి వాళ్ల అరుపుల్ని పట్టించుకోలేదు- వేగంగా వెనక్కి పరుగెత్తుకెళ్లి, పడిపోయిన ఆ అమ్మాయిని లేపింది. గబుక్కున ఆమెను ఎత్తుకొని షామియానా కిందికి చేర్చింది. అంతలోనే అక్కడికి చేరుకున్న టీచర్లు పడిపోయిన ఆ పాపకు కట్టుకట్టి, ప్రథమ చికిత్స చేశారు.

పరుగుపందెంలో ఇంకెవరో గెలిచారు. దేవి మిత్రురాలు అనసూయకు ఇది చాలా బాధగా ఉంది. 'ఈ దేవి చూడు! ఫస్టు ప్రైజును స్వయంగా పోగొట్టుకున్నది. తనొక మదర్ థెరీసా అనుకున్నదేమో! ఎవరికీ లేని సేవాగుణం తనకెందుకో? పడిపోయిన ఆ అమ్మాయిని తనే పట్టించుకోవాలా? బుద్ధిగా పరుగెత్తి ఫస్టు ప్రైజు తెచ్చుకోవచ్చు గదా!' అని చిటపటలాడింది. పోటీ‌ పూర్తయ్యాక ఇక అనసూయ దేవితో మాట్లాడలేదు. ఆ సాయంత్రం వరకు దేవికి కనబడకుండా తప్పించుకొని తిరిగింది.

సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం. పండుగ వాతావరణం కనిపిస్తోంది. చాలా మంది అతిథులు, తల్లిదండ్రులు వచ్చారు. పరుగు పందెపు విజేతలకు బహుమతులు ఇచ్చారు. దేవి సంతోషంగానే ఉన్నది, కానీ‌ అనసూయ ముఖం మాత్రం వాడిపోయి ఉన్నది.

ఆ వెంటనే హెడ్మాస్టారు గారు మైకు దగ్గరకొచ్చారు. ఉదయం జరిగిన పరుగు పందెపు విశేషాలు చెప్పారు. ఒక పాపకు ఎంత దెబ్బలు తగిలాయో చెప్పారు. ఆ పాపను దేవి ఎలా కాపాడిందో చెప్పారు. "ఈ పరుగు పందెంలో నిజమైన విజేత దేవి!" అని చెప్పి, ఆమెను స్టేజి పైకి ఆహ్వానించారాయన. పిల్లలు దేవిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడుతుంటే, ఒక పెద్ద పూలమాలతో ఆమెను సత్కరించారు హెడ్‌మాస్టారు గారు.

స్టేజి దిగి వస్తున్న దేవిని అనసూయ ఆరాధనా పూర్వకంగా చూసి, నవ్వుతూ ఆమె దగ్గరికి పరుగెత్తింది.