ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి ఒక రోజు సమావేశం అయ్యాయి:

అడవిలో‌ ఒక స్కూలు పెట్టుకోవాలని అనుకున్నాయి. అన్నీ‌ కలిసి సింహం రాజుగారిని అనుమతి అడిగాయి. సింహం ఒప్పుకున్నాడు. వెంటనే స్కూలు కూడా మొదలైంది.

స్కూల్లో కోతి బాగా అల్లరి చేసేది; వేరే వాళ్ళ పెన్సిళ్ళను, పెన్నులను దొంగిలించేది. టక్కరి నక్క పోయి, కోతి దొంగతనం గురించి సింహం రాజుకు ఫిర్యాదు చేసింది.

అప్పుడు రాజు కోతితో "ఇంకోసారి అల్లరి చేస్తే పట్టణంలోకి పంపుతాం" అన్నాడు. రాజు అలా అనగానే కోతి చాలా సంబరపడింది. దానికి పట్నం అంటే చాలా ఇష్టం మరి! అందుకని కోతి ఇంకా ఎక్కువ అల్లరి చేయటం మొదలు పెట్టింది.

ఇక తట్టుకోలేని జంతువులన్నీ కలిసి న్యాయవిచారణ చేసి, కోతిని అడవిలోంచి తరిమేశాయి.

పట్నం చేరుకున్న కోతికి మొదట్లో‌ చాలా సంతోషం కలిగింది. అక్కడి దుకాణాలు, వాహనాలు చూస్తూ‌ అది తనను తాను మరచి పోయింది. అంతలోనే దాన్ని ఒకపిల్లవాడు పట్టుకున్నాడు. కోతితో సర్కస్ చేపించి బాగా డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు వాడు. కోతికి కూడా మొదట్లో ఆ ఆట ఇష్టమే అయ్యింది, కాని వాడు రాను రాను దానికి తక్కువ అన్నం పెడుతుండేసరికి, అది చాలా బాధ పడింది.

"నేను అడవిలో అల్లరి చేయకుండా ఉంటే బాగుండేది- నాకు ఇన్ని తిప్పలు తప్పేవి కదా" అనుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు దానికి తప్పించుకునేందుకు అవకాశం వచ్చింది. వెంటనే అది పిల్లవాడి బారి నుండి తప్పించుకొని అడవిలోకి వెళ్ళింది. అక్కడ సింహం రాజు గారి దగ్గరికి పోయి "రాజా! నన్ను క్షమించండి - పట్నం మీది మోజుతో అడవిలోని జంతువులన్నిటినీ వేధించాను. ఇకపై బాగుంటాను- నన్ను ఇక్కడ ఉండనివ్వండి చాలు" అని కోరింది.

సింహం రాజు దాన్ని క్షమించి, అడవిలో ఉండనిచ్చాడు. అప్పటినుండీ అది అల్లరి మానేసింది- బుద్ధిమంతురాలైంది.