అవంతీపురం అనేరాజ్యాన్ని విజయుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆ రాజు భార్య మందార- వారికి సంతానం లేదు; అందుకని ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ రాజు మాత్రం తన రాజ్యంలోని ప్రజలను చాలా పీడించి, హింసించి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాదు- కరువుకాటకాలు వచ్చినప్పుడు కూడా ప్రజలను పట్టించు-కునేవాడు కాదు. పైపెచ్చు వారిపైన ఇంకా ఎక్కువ పన్నులు వేసి, పన్నులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేసేవాడు. తన ఖజానాలోని డబ్బులను ఎంత మాత్రం ఖర్చు చేసేవాడు కాదు. ఏ మాత్రం దాన ధర్మాలు చేసేవాడుకాదు.
రాజు రాణి ఇద్దరూ సంతానం కోసం తిరగని చోటు లేదు; చూడని గుడి లేదు. చివరికి, అట్లా తిరుగుతూ,తిరుగుతూ వాళ్ళు ఒక ముని ని కలుసుకున్నారు.
అప్పుడు ఆ ముని తన దివ్య దృష్టితో చూసి, రాజుతో "చూడండి, మీరు చేసిన పాప ఫలం ఇది. ఇప్పటికైనా గుర్తించండి- ప్రజలంటే ఎవరో కాదు- రాజుకు ప్రజలంతా బిడ్డలే. అలాంటి ప్రజలను పీడించటం వల్ల మీకంటూ వేరే సంతానం కలగలేదు. కాబట్టి, మీ జీవితాలు బాగుపడాలంటే మీరు మీ పిసినారి తనాన్ని విడిచిపెట్టాలి. ఘనంగా దాన ధర్మాలు చేయాలి. పేదలను హింసించకూడదు . అప్పుడు, మీ పుణ్యం కొద్దీ మీకు సంతానం కలుగుతుంది" అని చెప్పాడు.
ఆ మాటలు రాజు-రాణి ఇద్దరిలోనూ అలజడి రేపాయి. వాళ్ళు మునికి ధన్యవాదాలు చెప్పి తమ రాజ్యానికి వెళ్ళారు. అటుపైన రాజుగారు పూర్తిగా మారిపోయినట్లు, గుడులు, సత్రాలు కట్టించాడు; దానధర్మాలు చేశాడు; బలవంతపు పన్నుల వసూళ్లు మానుకున్నాడు; 'ఆ రాజు-ఈ రాజు ఒకరేనా' అన్నట్లు ప్రవర్తించాడు.
అనతి కాలంలోనే ఆ దంపతులకు ఒక పాప పుట్టింది. రాజు, రాణి, రాజ్య ప్రజలు అందరూ ఎంతో సంతోషించారు. ఆ పాప పుట్టిన తరువాత కొన్నేళ్ళపాటు రాజ్యం చాలా సుభిక్షంగా ఉండింది. సకాలానికి వర్షాలు వచ్చాయి; పంటలు బాగా పండాయి; ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు- రాజ్యంలో మళ్ళీ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఒక ఏడాది.
ప్రజల మేలు కోసం ఖజానాలోంచి డబ్బులు బయటికి తీయాలనేసరికి రాజుకు మళ్ళీ లోభం పుట్టింది. 'ప్రజావసరాలు తీరాలంటే ప్రజలు పన్ను కట్టకపోతే ఎలా?'అన్నాడు. ప్రజలు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి- రాజుగారు ప్రజలను హింసించడం మళ్ళీ నిత్య కృత్యమైంది. ఈలోగా రాజు కూతురు కూడా పెరిగి పెద్దదైంది.
ఒక రోజు పాపకు జబ్బు చేసింది. రాజు వైద్యులకు చూపించాడు, కాని జబ్బుమాత్రం తగ్గలేదు. రాజ్యంలోని వైద్యులందరిని పిలిపించి పాప జబ్బును నయం చేయమన్నాడు రాజు. కానీ ఏవైద్యుడూ పాపకొచ్చిన జబ్బును నయం చేయలేకపోయాడు.
రాజుకు చాలా భయం వేసింది. ఒక్కగానొక్క పాప దూరం ఐపోతుందేమోనని బాధపడ్డాడు, చివరికి ఆ సమయంలో రాజుకు ముని గుర్తుకొచ్చాడు. "రాజుకు ప్రజలంతా బిడ్డలే" అని ముని చెప్పటం గుర్తుకొచ్చింది. 'తను ఆ సంగతిని ఎంత త్వరగా మర్చిపోయాడు?!' అని విచారం వేసింది. పశ్చాతాపంతో రాజు మునిని స్మరించి, తనను క్షమించమని వేడుకొన్నాడు. ఆక్షణంలోనే ఆయన తన మనసును ప్రజా సంక్షేమం వైపుకు మరల్చాడు. ప్రజలనుండి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని తిరిగి వాళ్ళకోసమే ఖర్చు చేసేటట్లు ఆజ్ఞలు జారీ చేశాడు. పంటకాలువలను, చెరువులను, నీటి పారుదల వ్యవస్థలను, జల సేకరణ వ్యవస్థలను బలోపేతం చేసేసరికి, రాజ్యం మళ్లీ ఒక గాటన పడింది.
ఆలోగా యువరాణి ఆరోగ్యమూ బాగుపడింది. తను మంచిపనులు చేయటం వల్లనే తన కూతురు బ్రతికిందన్న విశ్వాసంవల్లనేమో, రాజు అటుపైన ఎన్నడూ ప్రజల్ని కష్టపెట్టలేదు. కాలక్రమేణా ఆయనలోని క్రూరత్వం అంతా పోయి, సహజమైన దయాగుణం వేళ్ళూనుకున్నది. 'విజయ మహారాజు మంచివాడు' అన్న ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది.