ఒక గ్రద్ద, ఒక గువ్వ ఎత్తైన కొండ శిఖరం మీద ఉన్న ఒక బండరాయి మీద కలిశాయి.
"నమస్కారం అన్నా" అని పలకరించింది గువ్వ, గ్రద్దను.
గ్రద్ద క్రిందికి చూసి కొంచెం తిరస్కారంగానే ప్రతి నమస్కారం చేసింది.
అంతా బానే ఉంది కదన్నా? " ఇంకొంచెం మాట్లాడించింది గువ్వ.
"ఊ" అంది గ్రద్ద. "మేమందరం బాగానే ఉన్నాం. కానీ నీకు మర్యాదలు సరిగ్గా తెలిసినట్లు లేదే? మేం పక్షులకు రాజులమనీ, ముందుగా మేం స్వయంగా పలకరించకపోతే ఎవ్వరూ మాతో మాట్లాడరాదని నీకు తెలీదా? "
గువ్వ అన్నది- "మనం అందరం ఒకే జాతి పక్షులం అనుకున్నానే, నేను ?" అని.
గ్రద్ద గువ్వకేసి అసహ్యపడుతున్నట్లు చూసింది- " ఒకే జాతా? 'నువ్వూ, నేను ఒకే జాతి' అని నీకు చెప్పిందెవ్వరు?" అన్నది.
అప్పుడు గువ్వ అన్నది- "కానీ ఒక్క సంగతి చెప్పనియ్యి నన్ను- నువ్వెంత ఎత్తుకు ఎగురగలవో నేనూ అంత ఎత్తుకు ఎగురగలను. అంతేకాక నేను నా పాటతో భూమి మీద ఉన్న ఇతర ప్రాణులకు సంతోషం కలిగించగలను. నువ్వు ఆనందాన్నే పంచవు, సంతోషాన్ని ఇవ్వవు." అని.
గ్రద్దకు కోపం వచ్చింది. "ఆనందం, సంతోషం! ఊహల్లో బ్రతికే పిట్టా! ముక్కుతో ఒక్కపోటు పొడిచానంటే నాశనం అయిపోతావు నువ్వు. నా కాలంత కూడా లేవు, గొంతెత్తి మాట్లాడుతున్నావేం?" అన్నది.
వెంటనే గువ్వ ఎగిరి, గ్రద్ద మీదికి దూకి కూర్చుని, దాని ఈకల్ని పీకడం మొదలు పెట్టింది. గ్రద్దకు చాలా కోపం వచ్చింది. అది వేగంగా పైకెగిరి, ఇంకా ఇంకా పైకి పోయి, కిందకు జారి, ఆకాశంలో గింగిరాలు కొట్టి, ఎలాగైనా గువ్వను వదిలించుకుందామని తంటాలు పడింది. ఎంత ఎగిరినా దానికి అలుపు వచ్చింది తప్పిస్తే, ప్రయోజనం ఏమి లేకుండింది. చివరకు అది అదే రాతి వాలింది. మునుపటికంటే చికాకుగాను, మీదికెక్కి కూర్చున్న గువ్వను, దానితోబాటు తన రాతను తిట్టుకుంటూనూ.
ఇక సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిందొక తాబేలు, గునగునా నడుచుకుంటూ.
కంటపడిన దృశ్యాన్ని చూసి దానికి నవ్వు ఆగలేదు. నవ్వీ నవ్వీ దానికి కడుపు నొప్పి పుట్టి, ఆగలేక వీపు మీదికి తిరిగి వెల్లకిలా పడతానేమో అనిపించింది.
ఆ నవ్వు విని, గ్రద్ద కిందికి చూస్తే అక్కడ తాబేలు కనపడింది. " నడకరాని, ప్రాకే ప్రాణీ! ఎప్పుడూ నేలబారున పడి తిరుగుతుంటావు, దేనికి నవ్వుతున్నావిప్పుడు?" అరిచింది గ్రద్ద కోపంగా.
తాబేలు అన్నది- "ఏముంది, నువ్వు గుర్రం అయిపోయావని తెలుస్తూనే ఉన్నది- చిన్న పిట్ట ఒకటి నీ మీద ఎక్కి స్వారీ చేస్తున్నది. కానీ చిన్నపిట్టే గొప్పదని నాకు చూడగానే అర్థమైపోయి, నీ మీద జాలితో నవ్వు వస్తోంది" అని.
"నీ పని నువ్వు చూసుకో, నా గువ్వ తమ్ముడికీ నాకూ మధ్య, ఇది మా కుటుంబ వ్యవహారం. బయటి వాళ్ళకి దీనితో ఏమీ సంబంధం లేదు" అన్నది గ్రద్ద దానితో!