చలికాలం.

ఎముకలు కొరికే చలి.

రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నై.

రాము వాళ్ల ఇంట్లో కూడా చలిగానే ఉంది: పైన తాటాకుల కప్పు- ఆ కప్పులోంచి పగటి పూట ఎండ , సాయంత్రం తర్వాత చలి లోపలికి దూరుతుంటాయి..

రాము వాళ్ల అమ్మ వాడికొక ముతక దుప్పటి ఇచ్చింది. తనొక పలచని చీర కప్పుకొని, గదిలో ఒక మూలగా చాపమీద ముడుచుకొని పడుకున్నది. రాముకోసం మరొక చాప ఉంది వాళ్లింట్లో.

రాత్రి అవుతున్న కొద్దీ చలి కూడా పెరిగింది. ఇప్పుడది ఎముకల్ని నమిలేస్తున్నది.

రాముకి మధ్యలో మెలకువ వచ్చింది. కడుపు బిగబట్టుకొని అటూ ఇటూ దొర్లాడు కొంత సేపు, నిద్రపట్టలేదు- కళ్లు తెరచి వాళ్ల అమ్మవైపు చూశాడు, నిద్రలోనే వణుకుతోంది.

రాములేచి, తనుకప్పుకున్న దుప్పటిని వాళ్ల అమ్మకు కప్పాడు.

రోజూతను ఒళ్ళుతుడుచుకునే తువ్వాలని తీసి, తలనిండా కప్పుకొని, తలుపు తీసుకొని- బయటికి అడుగు పెట్టాడు.

ఎదురుగుండా ఉన్న ఇంటికి ఒక నక్షత్రం వ్రేలాడుతున్నది- ఎర్రటి కాగితం- లోపల కరెంట్ బల్బు. నక్షత్రం ప్రకాశవంతంగా వెలుగుతున్నది: "బల్బు వేడిగా ఉంటుంది!" అన్నది మనసు. రాము మొఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. రోడ్డు దాటి, నక్షత్రం దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు.

అంతలో- గడగడ శబ్దం చేసుకుంటూ, సూటిగా రాము ముందుకే వచ్చి ఆగిందొక బండి- అది ఎటునుండి వచ్చిందో మరి, తెలీనేలేదు! చాలా వింతగా ఉంది! దాన్ని జింకలు లాగుతున్నై , వాటి వంటినిండా దుబ్బలు దుబ్బలుగా పెరిగిన ఉన్ని!

ఆ బండిలో ఒక వింత ముసలాయన కూర్చొని ఉన్నాడు: ఎర్రటి బట్టలు, ఎర్రటిటోపీ, పొడుగాటి ఆ టోపీ చివరన ఒక ఎర్ర బంతి, పొడవాడి తెల్ల గడ్డం, తెల్లటి- పెద్ద పెద్ద- మీసాలు.

" హేయ్ ! హేయ్ ! బాగున్నావా, మెర్రీ క్రిస్‌మస్ !" అన్నాడా తాత. బండిలోంచి ఒకపెద్ద ప్యాకెట్టును తీసి రాముకి ఇస్తూ.

" మీరు క్రిస్మస్ తాత కదూ ?! బహుమతిని ఇ వ్వాల్సింది, నాకు కాదు. ఈ ఇంట్లో ఉండే పీటర్‌కు! " అన్నాడు రాము- "ఈ నక్షత్రమూ, ఆ క్రిస్మస్ చెట్టూ అన్నీ పీటర్ వాళ్లవే".

" ఓహో ఓహో " అని నవ్వాడు తాత. "అయినా పర్లేదు- ఈ‌ బహుమతి నీకే" అన్నాడు- బహుమతిని రాము చేతిలో పెట్టేసి.

"మరి పీటర్ కి?"

తాత కళ్ళు లైటు వెలుగులో వింతగా మెరిశాయి. వెనక్కి తిరిగి వెళ్ళి బండి ఎక్కాడు.

"అయ్యో! అయ్యో ! మళ్ళీ పీటర్ లేచి తన బహుమతి కోసం వెతుక్కుంటాడు, నాకేమీ అక్కర్లేదు తాతా... " అంటూనే ఉన్నాడు రాము - తాత , బండి మరి ఎప్పుడు వెళ్లిపోయారో, ఏమో- తేరుకొని చూసేసరికి, వాళ్ళు వచ్చిన జాడలు కూడా లేవు!

రాము విచారంగా‌ తన చేతిలోని బహుమతికేసి చూసుకున్నాడు. ప్యాకెట్టు మెరిసిపోతున్నది. దానికి కట్టిన పచ్చరిబ్బను చాలా ముద్దొస్తోంది. దాన్ని పట్టుకొని ఒక అడుగు తన ఇంటి వైపు వేశాడు- " ఊహూ వద్దు, ఇది నీకు కాదు- పీటర్‌కే. పాపం! వాడు ఈ బహుమతి కోసమే కదా, నక్షత్రం తెచ్చిపెట్టాడు; క్రిస్మస్ చెట్టు పెట్టాడు; అన్నీ చేశాడు ?! నీకు బాగా డబ్బులొచ్చాక, వచ్చే సంవత్సరం క్రిస్మస్‌కు మీ ఇంటి ముందూ ఒక నక్షత్రం పెట్టుకుందువు. అప్పుడు తాత ఇచ్చే బహుమతిని నువ్వు తీసుకో. ఇది నీకొద్దు" అన్నది మనసు.

రాము వెనక్కి తిరిగి వెళ్ళి దాన్ని క్రిస్మస్ చెట్టు కింద పెట్టేసాడు. వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేశాడు.

ఇంటి తలుపు తెరవగానే వాడికి ఆశ్చర్యంతో నోట మాటరాలేదు- తన చాప మీద- ఇంకా పెద్ద ప్యాకెట్టు ఒకటి ఎదురుచూస్తోంది, తనకోసం!

ప్యాకెట్టు మీద పచ్చరంగులో‌ ఏదో రాసి ఉంది మెరుస్తూ- "నీ సౌహార్ద్రతకు మెచ్చి ఈసారికి నేనిచ్చే బహుమతి ఇది. వచ్చేసారి ఇంకా మంచి బహుమతి తెస్తాను!" అని.

ప్యాకెట్టు లోపల వెచ్చని రగ్గులు రెండు- చక్కగా మడతపెట్టి ఉన్నాయి!

మంచి మనసున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షల రగ్గులు.

కొత్తపల్లి బృందం.