అవంతీపుర రాజ్యాన్ని ప్రతాప వర్మ మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు.
రాజకుమారులందరూ చాలా తెలివైన వారు. వాళ్లలో చిన్న యువరాజు చాలా అందంగా కూడా ఉండేవాడు. వీళ్లందరికీ పట్టాభిషేకం చెయ్యాలని అనుకున్నాడు మహారాజు- కానీ అంతకంటే ముందే వారికి పెళ్ళి చేయాలి! అందుకోసమని, 'ఒకే ఇంట్లో పుట్టిన ఏడుగురి అమ్మాయిలను' వెతికి తన కొడుకులకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు.
అయితే ఆరాజ్యంలో ఎంత వెతికినా 'ఒకే ఇంట్లో పుట్టిన ఏడుగురు అమ్మాయిలు' దొరకలేదు! అందుకని రాజుగారు భటుల్ని పక్క రాజ్యానికి పంపించి 'ఒకే ఇంట్లో పుట్టిన ఏడుగురి అమ్మాయిలను వెతకమ'న్నాడు. వెతకగా వెతకగా వాళ్ళకు ఒకే ఇంట్లో పుట్టిన ఏడుగురు అమ్మాయిలు కనిపించారు. ఈ విషయం వాళ్ళు వెంటనే తమ మహారాజుకు తెలియజేశారు.
రాజుగారు చాలా సంతోషించారు. వెంటనే ప్రక్క రాజ్యానికి వెళ్ళి, ఏడుగురు అమ్మాయిలను చూడమని పంపించారు కొడుకులను. ఏడుగురు రాజ కుమారులూ ప్రక్కరాజ్యానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒకే ఇంట్లో పుట్టిన ఏడుగురు అమ్మాయిలూ చక్కని సుందరీమణులు! చూసీ చూడగానే నచ్చారు వాళ్ళు! రాజకుమారులకు, వాళ్ళకు ఘనంగా పెళ్లిళ్ళు జరిగాయి.
ఆ తర్వాత అందరూ బయలు దేరి తమ రాజ్యానికి తిరిగి వస్తుండగా, మధ్య దారిలోనే చీకటి పడింది. "ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం" అని, అందరూ అక్కడే గుడారాలు వేసుకొని పడుకున్నారు.
అయితే అడవిలోని ఆ ప్రదేశం గంధర్వులకు చాలా ఇష్టమైనది. ప్రతిరోజూ రాత్రిపూట కనీసం నలుగురు గంధర్వ కన్యలు అక్కడికి వచ్చేవాళ్ళు. అలాగే ఆరోజు కూడా అక్కడికి వచ్చారు నలుగురు! తీరా చూస్తే అక్కడ గుడారాలు వేసి ఉన్నాయి. గంధర్వ కన్యలు కుతూహలం కొద్దీ గుడారాల్లోకి తొంగి చూసారు.
గుడారాల్లోపడుకున్న రాజకుమారుల్లో చిన్నవాడు అందరి కంటే అందంగా అనిపించాడు వాళ్ళకు. వెంటనే గంధర్వ కన్యలు కూడబలుక్కుని, వాడిని మాయం చేసి తమతోబాటు తమ లోకానికి తీసుకొని వెళ్లిపోయారు! తెల్లవారింది. అందరూ నిద్ర లేచారు- కానీ చిన్న యువరాజు మాత్రం ఎక్కడా కనిపించలేదు.
కొంచెం సేపు వెతికిన తర్వాత, 'అతన్ని ఏ క్రూరమృగమైనా ఎత్తుకెళ్లిందేమో' అని అనుమానించారు అందరూ. 'బ్రతికి ఉంటే తనే వస్తాడులే, ఎంతని వెతుకుతాం? మనం వెళ్దాం పదండి' అని అందరూ వాళ్ళ రాజ్యానికి బయలుదేరారు.
కానీ చిన్న రాణికి అట్లా ముందుకు వెళ్ళబుద్ధి కాలేదు. అలాగని తన పుట్టినింటికి వెళ్లటమూ ఇష్టం కాలేదు. మిగతావాళ్లనందరినీ వెళ్ళనిచ్చి, తను మాత్రం భర్త కోసం వెతుకుతూ అడవిలోనే ఉండిపోయింది.
ఆకలి దప్పులు పట్టించుకోకుండా ఆమె అడవి మొత్తం గాలించింది- ఎక్కడా భర్త జాడ లేదు.
చివరికి అదృష్టవశాత్తు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్న ఋషి ఒకాయన కనబడ్డాడు ఆమెకు. అయితే నాగుపాము ఒకటి, ఆ ఋషి ముందు నిలబడి, ఆయన్ని కాటు వేయబోతున్నది! చిన్న రాణి వెంటనే సమయస్ఫూర్తిని ఉపయోగించింది: ముందుగా చేతికందిన కట్టెతో శబ్దం చేస్తూఆ పాము దృష్టిని మరల్చింది- ఆపైన ఒక్కసారిగా ఆ పామును కట్టెతో ఎత్తి, దూరంగా విసిరేసింది.
కొంత సేపటికి కళ్ళు తెరచిన ఋషి, చిరునవ్వు నవ్వుతూ "ఎవరమ్మా నువ్వు? ఇంత ఘోరమైన అడవిలో ఒక్కదానివీ తిరుగుతున్నట్లున్నావే? నీకు ఏదో కష్టం ఎదురైనట్లుంది. నన్ను పాము బారినుండి కాపాడావు కదా, నువ్వు? నాకు తెలుసులే, నీకెదురైన కష్టాల్ని నేను తీరుస్తాను" అన్నాడు.
అప్పుడు రాణి తన కథను వివరించింది.
అప్పుడు మహర్షి కొద్దిసేపు కళ్ళుమూసుకొని, సర్వం తెలుసుకున్నాడు. 'నీ భర్తను గంధర్వ కన్యలు ఎత్తుకెళ్ళారు తల్లీ! వాళ్ళ గర్వం అణగే సమయం దగ్గరపడింది. ఒకానొక శాపకారణంగా ఆ గంధర్వ కన్యలకు ఏది మంచో ఏది చెడో తెలీకుండా పోయింది. నేను చెప్పినట్లు చెయ్యి - ఆ కొలనులో ఒక కుండ ఉంది. కొలనులోకి దూకి, నీటి అడుగున ఉన్న కుండను బయటికి తెచ్చి, దానిపైన సూర్య కిరణాలను ప్రసరింపజేశావంటే, ఆ కన్యలను కప్పిన శాపపు పొర వీడిపోతుంది. దాంతో వాళ్లకు మంచి చెడులు అర్థమౌతాయి. నీ భర్త నీకు లభిస్తాడు. చింతించకు" అని చెప్పాడు.
చూస్తే కొలనులో మొసళ్ళు ఉన్నై! మరెలా? అయినా గాని చిన్న రాణి ధైర్యంతో కొలనులో దిగి ఆ కుండ కోసం వెతికి వెతికి , చివరికి కొలను అడుగున నాచులో దాగిన కుండను కనుగొన్నది. ఆ కుండ పైన సూర్య కిరణాలు పడగానే, గంధర్వ కన్యల మైకం వదిలిపోయింది. వాళ్ళిప్పుడు రాజ-కుమారుడిని చూసి "అయ్యో , ఇదేమిటి? ఇతన్ని ఎందుకు తీసుకొచ్చాం?" అని బాధపడి, అతనికి క్షమాపణలు చెప్పి, అనేక బహుమతులిచ్చి వెనక్కి తెచ్చి విడిచారు. రాకుమారుడు , చిన్న రాణి మహర్షికి ధన్యవాదాలు చెప్పుకొని, వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్ళారు.
అప్పటికే మహారాజు తన చిన్న కుమారుడినీ, చిన్న కోడలినీ వెతికేందుకు పెద్ద సైన్యాన్నే పంపించబోతున్నాడు. వాళ్ళే క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించాడు.
అటుపైన యువరాజూ రాణీ సుఖంగా జీవించారు.