బుద్ధూరాం చాలా సాదా సీదా మనిషి. మనసులో కల్మషం తక్కువ. ఆయన్ని గురించి తెలిసినవాళ్ళు ఒకవైపున ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూనే, మరోవైపున "ఈయన నిజంగానే వింత మనిషి" అనుకుంటూ ఉంటారు.
బుద్ధూరాంకు ఒక అలవాటు ఉండేది: రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు, ఎదురైన వాళ్లకు ఎవరికైనా సరే, నమస్కారం పెట్టి, "నమస్తే" అనో, "రాం!రాం!" అనో అంటూ ఉండేవాడు. వాళ్ళు పరిచయస్తులే అవ్వాలని లేదు- ముక్కూ మొహం తెలీని కొత్తవాళ్ళు అయినా సరే- బుద్ధూరాం కు ఎదురు పడ్డారంటే ఒక నమస్కార బాణం తప్పని సరిగా అందేది వాళ్ళకు!
బుద్ధూరాం గడ్డాన్ని చూసి, దారిన ఉండే పిల్లలు ఒకింత ఉత్సాహంగాను, ఆశ్చర్యంగాను చూస్తుంటే, ఈయన ఒక్కోసారి చేతులు ఊపి, వాళ్ళకు "హాయ్! బై!" చెప్పి, పోయేవాడు. ఒక్కోసారి ఆగి, వాళ్లను దగ్గరికి రానిచ్చి, తన గడ్డం ముట్టుకోనిచ్చేవాడు. పిల్లలందరూ ఆయనకు బదులిచ్చి, నవ్వేవాళ్ళు-
కొందరైతే "బాగున్నావా, తాతా!?" అని అడిగేవాళ్ళు. కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం ఆయన నమస్కారం పెడితే పట్టించుకునేవాళ్ళు కారు. కొందరు తిరిగి నమస్కారం పెట్టేవాళ్ళు. కొందరు ఊరికే అట్లా వింతగా చూస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. చాలామంది, మొదటి సారి పట్టించుకోకున్నా, రెండోసారో మూడోసారో నమస్కారం అందుకున్నాక, ప్రతి నమస్కారం పెట్టేవాళ్ళు.
ఒకరోజు ఉదయం బుద్ధూరాం ఎప్పటిలాగానే పార్కుకు వెళ్ళాడు. అప్పుడైతే మంచి గాలిని పీల్చుకోవచ్చు! నడక వ్యాయామం కూడా అవుతుంది! మంచు కురుస్తున్నది.
ఇంకా బాగా తెల్లవారలేదు. పది అడుగుల దూరంలో ఉన్న మనిషిని కూడా గుర్తుపట్టటానికి వీలు అవ్వట్లేదు. బుద్ధూరాం రోడ్డుకు ఎడమ ప్రక్కగా నడుస్తున్నాడు. రోడ్డుకు కుడివైపున, అటు ప్రక్కనుండి, ఎవరో వస్తుండటం గమనించాడు బుద్ధూరాం. ఆ వచ్చేదెవరో ఈయనలాగా వ్యాహ్యాళికి వచ్చేవాడైతే కాదు- అతని వీపుమీద పెద్ద సంచీ ఒకటి వ్రేలాడుతున్నది. అతని నడక తీరు, అతను వేసుకున్న బట్టలు- అతని రూపం చూస్తే దూరం నుండే తెలుస్తున్నది- అతనొక ’చెత్తఏరుకునేవాడు’ అని.
బుర్ధూరాం చేతులు, నోరు అలవాటు పడి ఉన్నాయేమో, ఊరుకోలేదు- అతన్ని చూడగానే బుద్ధూరాం చేతులు జోడించాడు- "రాం!రాం!" అన్నాడు. రోడ్డుకు అవతలగా నడుస్తున్న ఆ మనిషి టక్కున ఆగాడు- రోడ్డును దాటుకొని ఇటువైపుకు వచ్చాడు; భుజాన ఉన్న మూటను క్రింద పెట్టి, అమాంతం బుద్ధూరాం కాళ్లమీద పడిపోయాడు!
బుద్ధూరాంకు నోట మాట రాలేదు. ఏమౌతున్నదో అస్సలు అర్థం కాలేదు. ఎవరో వచ్చి తన కాళ్ళకు మొక్కుతున్నారు! అసంకల్పితంగానే ఆయన ఆ మనిషిని వారిస్తూ, లేవనెత్తి దగ్గరకు తీసుకున్నాడు. తీరా చూసేసరికి, ఆ మనిషి కళ్ల నిండా నీళ్ళు! సంతోషంతోటీ, కృతజ్ఞతతోటీ అతని కళ్లలో నీళ్లు నిండి ఉన్నాయి: నోట మాట రావట్లేదు.
బుద్ధూరాం అడిగాడు: "ఏమైంది బాబూ!? ఎందుకిట్లా?" అని.
చెత్త ఏరుకునేవాడు కళ్లనీళ్ళు తుడుచుకున్నాడు. మెరిసే కళ్లతో, సంతోషంగా అన్నాడు "’ఎందుకు’ అని అడుగుతున్నారా, సాహెబ్? ఈ పండగ ప్రొద్దున, ప్రార్థన సమయంలో మీరు నాకు ఎంత అద్భుతమైన బహుమతిని ఇచ్చారో మీరే ఊహించలేరు. నేను ఒక పేదవాడిని- చెత్త కుప్పల్లోంచి కాయితాలను, ప్లాస్టిక్కులనూ ఏరుకొని, నా కుటుంబాన్ని పోషించు-కుంటాను. తెలిసినవాళ్ళు, తెలీని వాళ్ళు అందరూ ఒక్క తీరుగానే ప్రవర్తిస్తారు, నా పట్ల: ఎవ్వరేగాని ఇప్పటివరకూ నన్ను పట్టించుకోనే లేదు! చూసీ, చూడనట్లు పోతారు అందరూ. ఎవ్వరూ నాకు కనీసం "హలో" కూడా చెప్పరు. మీమాదిరి ప్రేమగా, గౌరవంగా, చేతులెత్తి నమస్కారం పెట్టినవాళ్ళు ఇప్పటివరకూ ఎవ్వరూ ఎదురవ్వలేదు నాకు. మీరు పెద్దమనుషులూ, గౌరవనీయులు- అయినా మీరు నాకు నమస్కారం పెట్టి, నన్ను దగ్గరకు తీసుకున్నారు- మీరు హిందువు అనుకుంటాను- నేను ముస్లిమును. అయితేనేమి, అల్లాకు ప్రియమైన వాళ్ళు మీరు! మిమ్మల్ని కలిసిన ఈ క్షణాల్ని నేను ఎన్నటికీ మరువను. మీకు నమస్కరించి, నేను అల్లాను గుర్తు చేసుకుంటాను. ఖుదా హాఫిజ్! దేవుడు మీకు తోడుగా ఉండుగాక!" అని శలవు పుచ్చుకున్నాడు.
"ఒక్క నమస్కారం ఎంత పని చేసింది!" అని బుద్ధూరాం ఆశ్చర్యపోయాడు.